అధికారుల వేధింపులు..! కండక్టర్ ఆత్మహత్య..! డిపో ఎదుట కార్మికుల ఆందోళన

విధాత: హైదరాబాద్ నగర పరిధిలోని బండ్లగూడ డిపోకు చెందిన శ్రీవిద్య అనే మహిళా కండక్టర్ సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, కండక్టర్ ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణమని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆరోపించారు. కామినేని ఆసుపత్రిలో శ్రీవిద్య భౌతికకాయాన్ని ఆయన సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు.
కార్మికులపై అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వేధింపులు ఆపలేకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సమస్యను ఎండీ దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు తీరు ఏమాత్రం మారడం లేదని.. శ్రీవిద్య మృతిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ చేస్తుందన్నారు.
క్షణికావేశానికి గురై ఆత్మహత్య చేసుకోవద్దని కార్మికులకు సూచించారు. ఆత్మహత్యతో సాధించేది ఏమీ లేదని.. తిరుగుబాటు చేసి సాదిద్ధాం అన్నారు. మరో వైపు కండక్టర్ ఆత్మహత్య నేపథ్యంలో బండ్లగూడ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. శ్రీవిద్య ఆత్మహత్యకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.