Father Kills Son| కొడుకును చంపేసి..మూసీలో పడేసిన తండ్రి

కంటికి రెప్పలా కొడుకును చూసుకోవాల్సిన తండ్రి కన్న ప్రేమను మరిచిపోయి..విచక్షణ కోల్పోయి తన మూడేళ్లు కొడుకును హత్య చేశాడు. హైదరాబాద్ బండ్లగూడలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన క్షీణిస్తున్న మానవ సంబంధాలకు నిదర్శనంగా నిలిచింది.

Father Kills Son| కొడుకును చంపేసి..మూసీలో పడేసిన తండ్రి

విధాత : మానవ సంబంధాలు బలహీనపడుతున్న నేటి రోజుల్లో ఓ తండ్రినే(Father) తన మూడేళ్ల కొడుకు( Kills Son) పాలిట కాల యముడయ్యాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకును కన్న తండ్రినే కిరాతకంగా హత్య చేసి మూట కట్టి మూసీ నది(Moosi River)లో పడేశాడు. ఈ దారణ ఘటన హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ(Hyderabad Bandlaguda) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బండ్లగూడ నూరినగర్‌కు చెందిన మహ్మద్‌ అక్బర్‌(35), సనాబేగం దంపతులకు పెద్దకుమారుడు ఆరీఫ్(7), రెండో కుమారుడు మహ్మద్‌ అనాస్‌(3) ఉన్నారు. అక్బర్‌ కూరగాయల వ్యాపారం చేస్తుండగా.. సనాబేగం నిలోఫర్‌ ఆసుపత్రిలో కేర్‌టేకర్‌గా పని చేస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న రెండో కొడుకు విషయమై తరుచు భార్యభర్తల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. దీంతో చిన్న కొడుకును చంపేయాలని తండ్రి మహమ్మద్ అక్బర్ నిర్ణయించుకున్నాడు.

శుక్రవారం రాత్రి భార్య విధులకు వెళ్లాక తెల్లవారుజామున కొడుకు అనాస్‌ తలపై దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో మూటకట్టి బైక్ పై తీసుకెళ్లి నయా పుల్ బ్రిడ్జి పైనుంచి మూసీ నదిలో పడేశాడు. ఏమీ తెలియదన్నట్లుగా కొడుకు కనిపించడం లేదంటూ మహమ్మద్ అక్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే ఓ మూటతో తెల్లవారుజామున అక్బర్ బైక్ పై వెలుతున్న దృశ్యం కనిపించింది. అనుమానంతో మహమ్మద్ అక్బర్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు. బాలుడి మృతదేహం కోసం మూసీలో బండ్లగూడ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిగాలింపు చర్యలు చేపట్టారు.