రామమందిరం.. దీపాలు వెలిగించడం.. ఇవా దేశ సమస్యలు?
వచ్చే లోక్‌సభ ఎన్నికలు దేశ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చెప్పారు
- జాతీయ సమస్యగా రామమందిరం బాధిస్తున్నది
- మతానికి అధిక ప్రాధాన్యం ఆందోళనకరం
- రాహుల్‌గాంధీ రాజకీయ డీఎన్ఏ ఉన్న నేత
- ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా
విధాత: వచ్చే లోక్‌సభ ఎన్నికలు దేశ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చెప్పారు. దేశంలోని నేటి రాజకీయాల్లో రామమందిరం, దీపాలు వెలిగించడం జాతీయ సమస్యగా మారడం తనకు బాధ కలిగిస్తున్నదని తెలిపారు. “2024 ఎన్నికలు దేశ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయి.
భవిష్యత్తులో భారతదేశం అనుసరించే మార్గాన్ని ఇది నిర్ణయించబోతున్నది. నేను దాని గురించి ఆందోళన చెందుతున్నాను” అని ఏఎన్ఐకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా పేర్కొన్నారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో పిట్రోడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై తాను ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం అణగదొక్కబడుతు న్నదని తెలిపారు. ప్రధాని వల్ల దేశంలో ప్రతిదీ మంచి జరుగుతుందని అందరూ భావించడం తనను కలవర పెడుతున్నదని పేర్కొన్నారు.
దేశం మొత్తం రామమందిరం, రామజన్మభూమి, దీపాలు వెలిగించడానికి దాసోహం అనడం తనను ఆందోళనకు గురిచేస్తున్నదని అన్నారు. మతం అనేది చాలా వ్యక్తిగతమైనదని పేర్కొన్నారు. దేశాన్ని పీడిస్తున్న జాతీయ సమస్యలైన విద్య, ఉపాధి, అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ఆరోగ్యం, పర్యావరణం, కాలుష్యం వంటి వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదని పిట్రోడా ఆవేదన వ్యక్తంచేశారు.
రాహుల్ గాంధీని అర్థం చేసుకోవడం కష్టం..
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అర్థం చేసుకోవడం చాలా కష్టమని పిట్రోడా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజకీయ డీఎన్ఏ ఉన్న యువకుడు, విద్యావంతుడు, చాలా తెలివైనవాడుగా అభివర్ణించారు. భారతదేశంలో ఒక వ్యవహారాన్ని తారుమారు చేసిన వ్యక్తినే ప్రజలు మంచి రాజకీయ నాయకుడిగా భావిస్తారని అభిప్రాయపడ్డారు.
నిజాయితీ గల రాజకీయవేత్తను భారత ప్రజలు అమాయకంగా భావిస్తారని తెలిపారు. రాహుల్ గాంధీ అన్ని రకాలుగా రాజకీయ నాయకుడిగా అర్హుడని, అయితే, ఆయనది భిన్నమైన శైలి అని పిట్రోడా పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram