కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవ్వండి: బాబా రాందేవ్‌కు సుప్రీం డెడ్‌లైన్‌

ప్రజలను తప్పుదోవపట్టించే పతంజలి ఆయుర్వేద్‌ వాణిజ్య ప్రకటనల కేసులో రెండు వారాల వ్యవధిలో కోర్టుకు హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది

  • By: Somu    latest    Mar 19, 2024 12:44 PM IST
కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవ్వండి: బాబా రాందేవ్‌కు సుప్రీం డెడ్‌లైన్‌

ప్రజలను తప్పుదోవపట్టించే పతంజలి ఆయుర్వేద్‌ వాణిజ్య ప్రకటనల కేసులో రెండు వారాల వ్యవధిలో కోర్టుకు హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. పతంజలి ఆయుర్వేద్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ను కూడా కోర్టుకు రావాలని ఆదేశించింది.


తాము తయారు చేసే ఔషధాలు రక్తపోటు, మధుమేహం, అర్థ్రరైటిస్‌, ఆస్తమా, ఊబకాయం తదితరాలను తగ్గిస్తాయని పతంజలి ఆయుర్వేద్‌ ప్రచురించిన వాణిజ్య ప్రకటనలను సుప్రీంకోర్టు 2024, ఫిబ్రవరి 27వ తేదీన నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పతంజలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణకు కోర్టు ఉల్లంఘన నోటీసులు కూడా పంపింది.


పతంజలి ఆయుర్వేద్‌ విడుదల చేస్తున్న ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌లో కోర్టు ఈ ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది.


మంగళవారం ఈ కేసులో విచారణ చేపట్టిన జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ అమానుల్లాఖాన్‌ ధర్మాసనం.. గత ఆదేశాలను పాటిస్తూ స్పందనను దాఖలు చేయని అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నది. దీనిపై తాజాగా ఆదేశాలు జారీ చేస్తూ బాబా రాందేవ్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. దానితోపాటు డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీస్‌ చట్టంలోని మూడు, నాలుగు సెక్షన్లను ఉల్లంఘించినందుకు ఆయనపై కోర్టు ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని జస్టిస్‌ హిమా కోహ్లి ఆదేశించారు.


కోర్టు ఉల్లంఘన నోటీసులకు ఇప్పటి వరకూ ఎందుకు ప్రతిస్పందించలేదని బాబా రాందేవ్‌ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్‌ అడ్వొకేట్‌ ముకుల్‌ రోహత్గిని కోర్టు విచారణ సందర్భంగా ప్రకటించింది. ‘ఇక ఇప్పుడు మీరు మీ క్లయింట్‌ను కోర్టుకు హాజరవ్వమని చెప్పండి. ఈ కేసులో బాబా రాందేవ్‌ను కూడా మేం పార్టీగా చేర్చుతున్నాం. ఇద్దరూ కోర్టుకు రావాల్సిందే’ అని కోర్టు స్పష్టం చేసింది.


ఈ కేసులో బాబా రాందేవ్‌ను పార్టీగా చేర్చవద్దని ముకుల్‌ రోహత్గి చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ‘ప్రతి వాణిజ్య ప్రకటనలోనూ ఆయన ఉన్నారు. ఒక మీడియా సమావేశం కూడా ఆయన నిర్వహించారు’ అని కోర్టు పేర్కొన్నది. ఈ కేసులో విచారణను వాయిదా వేయదల్చుకోలేదని స్పష్టం చేసింది.

ఈ కేసులో స్పందనను దాఖలు చేయనందుకు సోమవారం కూడా కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఇందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్రం కోర్టుకు విన్నవించింది.


దీంతో తాజగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తప్పుదారిపట్టించే వాణిజ్య ప్రకటనల విషయంలో వేర్వేరు కంపెనీలపై 35,556 కేసులు నమోదయ్యాయని అంతకు ముందటి అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. ఫిర్యాదులు అందుకున్న తర్వాత వాటిపై తగిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్రస్థాయిలో సంబంధిత అధికారులకు వాటిని పంపినట్టు వివరించింది. అనంతరం 2020 జూన్‌ 23న పతంజలి ఆయుర్వేద్‌కు కొవిడ్‌ను నిర్మూలించేదిగా పతంజలి చెప్పుకొన్న కరోనిల్‌ డ్రగ్‌ విషయంలో నోటీసులు జారీ చేసినట్టు తెలిపింది.