ఎమ్మెల్యే కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ జారీ
తెలంగాణ శాసన మండలిలో ఖాళీయైన రెండు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది

- జనవరి 29న పోలింగ్
విధాత : తెలంగాణ శాసన మండలిలో ఖాళీయైన రెండు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డిలు ఇద్దరు బీఆరెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఈ మేరకు గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 11న నోటిఫికేషన్.. 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 19న నామినేషన్ల పరిశీలన, 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. అయితే బీఆరెస్‌కు అసెంబ్లీలో ప్రస్తుతమున్న బలాబలాల నేపధ్యంలో బీఆరెస్ తిరిగి రెండు ఎమ్మెల్సీ సీట్లను గెలువడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఒక స్థానం కాంగ్రెస్ పార్టీ హస్తగతం కానుంది.