రైలులో బాలికపై లైంగిక వేధింపుల కలకలం!

రైల్వే శాఖ ఇటీవల రైళ్లలో మహిళ భద్రతపై కొత్తగా చర్యలు తీసుకున్నప్పటికి తాజాగా  బాలికపై లైైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకోవడంతో ఈ విషయమై మరింత ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • By: Somu    latest    Apr 04, 2025 11:50 AM IST
రైలులో బాలికపై లైంగిక వేధింపుల కలకలం!

విధాత : సికింద్రాబాద్- మేడ్చల్ మార్గంలో ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం ఘటన మరువకముందే రైలులో ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది.  సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ ఘటన కూడా చోటుచేసుకుంది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కుటుంబం రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుంది. వారిలో 16 ఏండ్ల బాలిక కూడా ఉన్నది. కేల్జార్‌ స్టేషన్‌ సమీపంలో అర్ధరాత్రి 2 గంటలకు ఆమె వాష్‌ రూమ్‌కు వెళ్లింది.
గమనించిన దుండగుడు ఆ
బాలికను లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలు చిత్రీకరించాడు. బాలిక తప్పించుకుని కుటుంబ సభ్యుల వద్ధకు చేరుకుని విషయం వివరించింది. వెంటనే వారు నిందితుడిని పట్టుకుని సెల్ ఫోన్ పరిశీలించగా అందులో వీడియోలు బయటపడ్డాయి. ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు రైల్వే టోల్ ఫ్రీ నంబర్ 139కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైల్వే శాఖ ఇటీవల రైళ్లలో మహిళ భద్రతపై కొత్తగా చర్యలు తీసుకున్నప్పటికి తాజాగా  బాలికపై లైైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకోవడంతో ఈ విషయమై మరింత ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా రైల్వే శాఖ మహిళా ప్రయాణికుల భద్రత కోసం మహిళల కంపార్ట్ మెంట్లలో, ఎంఎంటీఎస్​ రైళ్లలో ఆర్​పీఎఫ్​, జీఆర్​పీ సిబ్బందిని మోహరించాలని, ముఖ్యంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున ఆర్​పీఎఫ్​, జీఆర్​పీ సిబ్బంది క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఎంఎంటీఎస్ రైళ్లలో అత్యవసర ఫోన్ నంబర్‌లను ప్రదర్శించాలనీ నిర్ణయించింది. RPF, GRP సిబ్బంది పర్యవేక్షణతో అన్ని కంపార్ట్‌మెంట్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయాణీకులకు భద్రతా సందేశాల సమాచారాన్ని తెలియజేయడానికి రైళ్ల లోపల డిస్ ప్లే, స్క్రీన్‌లను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుంది. ప్రతి మహిళా కోచ్​లో కంట్రోల్ రూమ్, రైలు గార్డుకు అనుసంధానించిన పానిక్ బటన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.