దేశంలోనే వృద్ధ ఎంపీ ష‌ఫిక‌ర్ ర‌హ్మాన్ బ‌ర్క్ క‌న్నుమూత‌

దేశంలోనే అత్యంత వృద్ధ ఎంపీ ష‌ఫిక‌ర్ ర‌హ్మాన్ బ‌ర్క్(94) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మొరదాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు

  • By: Somu    latest    Feb 27, 2024 10:16 AM IST
దేశంలోనే వృద్ధ ఎంపీ ష‌ఫిక‌ర్ ర‌హ్మాన్ బ‌ర్క్ క‌న్నుమూత‌

ల‌క్నో : దేశంలోనే అత్యంత వృద్ధ ఎంపీ ష‌ఫిక‌ర్ ర‌హ్మాన్ బ‌ర్క్(94) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మొరదాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ష‌ఫిక‌ర్ కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిసింది.


ష‌ఫిక‌ర్ మృతి ప‌ట్ల స‌మాజ్‌వాదీ పార్టీ సంతాపం ప్ర‌క‌టించింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపింది. సీనియ‌ర్ నాయ‌కుడైన ష‌ఫిక‌ర్ చ‌నిపోవ‌డం పార్టీకి తీర‌ని న‌ష్టం అని పేర్కొంది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఆ భ‌గ‌వంతుడు ధైర్యం ఇవ్వాల‌ని ఎస్పీ త‌న ట్వీట్‌లో పేర్కొంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ కూడా సంతాపం ప్ర‌క‌టించారు.


ష‌ఫిక‌ర్ ర‌హ్మాన్ బ‌ర్క్ రాజ‌కీయ ప్ర‌స్థానం..


ష‌ఫిక‌ర్ ర‌హ్మాన్ బ‌ర్క్ జులై 11, 1930లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సంభ‌ల్‌లో జన్మించారు. ఆయ‌న రాజ‌కీయ జీవితం భార‌త మాజీ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్‌తో క‌లిసి ప్రారంభ‌మైంది. ముస్లింల హ‌క్కుల కోసం దేశ వ్యాప్తంగా త‌న గ‌ళాన్ని వినిపించారు. బాబ్రీ మ‌సీదు యాక్ష‌న్ క‌మిటీ కోఆర్డినేట‌ర్‌గా కూడా ప‌ని చేశారు.


ఇక ములాయం సింగ్ యాద‌వ్ స‌మాజ్‌వాదీ పార్టీని స్థాపించిన‌ప్పుడు ఆయ‌న‌తో క‌లిసి ష‌ఫిక‌ర్ అడుగులు వేశారు. సంభ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 1996, 1998, 2004 ఎన్నిక‌ల్లో మొర‌దాబాద్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. 2009, 2019 ఎన్నిక‌ల్లో సంభ‌ల్ నుంచి పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో సంభ‌ల్ నుంచే ష‌ఫిక‌ర్ పోటీ చేస్తార‌ని ఇటీవ‌లే స‌మాజ్‌వాదీ పార్టీ కూడా ప్ర‌క‌టించింది.


గ‌తంలో యూపీ గ‌వ‌ర్న‌మెంట్‌లో కేబినెట్ మినిస్ట‌ర్‌గా కూడా ప‌ని చేశారు. 2022లో ఆయ‌న మ‌నువ‌డు జ‌యూర్ ర‌హ్మ‌న్ బ‌ర్క్ మొర‌దాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఇక 94 ఏండ్ల వ‌య‌సులోనూ ప్ర‌జల కోసం ప‌ని చేస్తున్న బ‌ర్క్‌ను మోదీ 2023లో ప్ర‌శంసల‌తో ముంచెత్తారు.