SLBC టన్నెల్‌లో.. మరో మృతదేహం లభ్యం!
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రెస్క్యూ బృందాలు మరో మృతదేహన్ని బయటకు తీశాయి. మంగళవారం 33వ రోజున వెలికి తీసిన మరో మృతదేహం కు సంబంధించి మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గా గుర్తించారు.

SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రెస్క్యూ బృందాలు మరో మృతదేహన్ని బయటకు తీశాయి. టన్నెల్ ప్రమాదంలో మొత్తం 8మంది గల్లంతవగా.. ప్రమాదం జరిగిన 16వ రోజు గురుప్రీత్ సింగ్ అనే ఇంజినీర్ మృతదేహన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంగళవారం 33వ రోజున వెలికి తీసిన మరో మృత దేహం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్ట్ ఇంజినీర్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు. కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో టీబీఎం మిషన్ శకలాల కింద ఈ మృతదేహం కనిపించింది. మినీ హిటాచితో మట్టి తవ్వుతుండగా బయటపడింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆ ప్రదేశం భరించలేని దుర్వాసన వస్తుండడంతో మిగిలిన ఆరుగురి మృతదేహాలు కూడా అదే ప్రదేశంలో ఉండే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. గత ఫిబ్రవరి 22న టన్నెల్ నందు ప్రమాదం జరుగగా ఎనిమిది మంది కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్లు చిక్కుకొని జలసమాధి అయ్యారు. వారికోసం కేంద్ర రాష్ట్ర సంస్థలకు చెందిన అనేక విభాగాల రెస్క్యూ సిబ్బంది రాత్రింబవళ్లు మూడు షిఫ్టులుగా అన్వేషిస్తున్నారు.