ఉత్తర భారతంలో స్వల్పంగా తగ్గిన చలి..! వదలని భారీ పొగమంచు
ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో చలి నుంచి స్వల్ప ఉపశమనం కలిగింది. పంజాబ్, హర్యానాలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన చలి పరిస్థితులు కొనసాగుతున్నది
Weather | ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో ఎముకలు కొరికే చలి నుంచి స్వల్ప ఉపశమనం కలిగింది. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన చలి పరిస్థితులు కొనసాగుతున్నది. దానికి తోడు విపరీతంగా పొగమంచు కురుస్తున్నది. మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ సహా పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో ఈ నెల 25 వరకు మూడు రోజుల పాటు తేలికపాటి వర్షం, హిమపాతం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దట్టమైన పొగమంచు కారణంగా సోమవారం ఉదయం రైలు, విమానాల రాకపోకలపై ప్రభావంపడింది.
పంజాబ్‌లో పతమైన ఉష్ణోగ్రతలు
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, గత రెండు రోజుల నుంచి సూర్యరశ్మి పడుతుండడంతో ఢిల్లీ ఎన్‌సీఆర్ సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి నుంచి ఊరట కలిగింది. పంజాబ్, హర్యానాలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికీ తీవ్రమైన చలి వణికిస్తూనే ఉన్నది. పంజాబ్‌లోని భటిండాలో అత్యల్పంగా 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గురుదాస్‌పూర్‌లోనూ 4.5 డిగ్రీలకు పడిపోయింది. హర్యానాలోని సిర్సా, ఫతేహాబాద్, హిసార్, భివానీ, నార్నాల్‌లో చలి కొనసాగింది.
జమ్మూలో మైనస్‌కు చేరిన ఉష్ణోగ్రతలు
జమ్మూ కశ్మీర్‌లో చలిగాలులు వీస్తున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్‌లలో శీతల పరిస్థితులు నెలకొన్నాయి. ఉష్ణోగ్రతలు 7.4 డిగ్రీలకు పడిపోయాయి. ఆదివారం రాత్రి శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.0 డిగ్రీలు తక్కువగా మైనస్ 5.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పహల్గామ్‌లో మైనస్ 6.9 డిగ్రీలు, గుల్మార్గ్‌లో మైనస్ 5.4 డిగ్రీలుగా నమోదైంది. సోమవారం పొద్దంతా మేఘావృతమై పొగమంచు పేరుకుపోయింది. దీంతో జనం చలికి వణికిపోయారు.
ఆలస్యంగా రైళ్లు, విమానాలు
దట్టమైన పొగమంచు కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే కనీసం 23 రైళ్లు నిర్ణీత సమయం కంటే ఐదు గంటలకుపైగా ఆలస్యంగా నడిచాయి. రేవా-ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్ అత్యధికంగా 5.45 గంటలు ఆలస్యమైందని రైల్వే తెలిపింది. అమృత్‌సర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ కూడా దాదాపు ఐదున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఆలస్యంగా నడిచే రైళ్లలో దిబ్రూఘర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర మెయిల్ కూడా ఉన్నాయి. తక్కువ దృశ్యమానత కారణంగా విమానాలు ప్రభావితమయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram