South Korea: కిమ్‌ను మించి పోతున్నారుగా.. సొంత పౌరులపై బాంబులు వేసిన సౌత్ కొరియా!

South Korea:
విధాత, వెబ్ డెస్క్: శత్రు దేశంలో వేయాల్సిన బాంబుల (bombs Attack)ను పొరపాటున సొంత దేశం పౌరుల(Own Citizens)పైనే వేసిన నిర్వాకంతో సౌత్ కొరియా(South Korea) ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సౌత్ కొరియాలో వాయుసేన చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. శిక్షణ విన్యాసాల్లో ఉన్న యుద్ద విమానాలు పొరపాటున సొంత పౌరులపైనే బాంబులు కురిపించాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలవ్వగా.. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తర కొరియా సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది.
దక్షిణ కొరియా – అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల మధ్య శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు ఉదయం 10 గంటలకు KF-16 పోచెయోన్ స్థావరం నుంచి 8 MK-82 శ్రేణి బాంబులతో బయల్దేరిన సియోల్ ఫైటర్ జెట్ దేశ సరిహద్ధుకు 25 కి.మీ దూరంలో జారవిడవాల్సిన బాంబులను పొరపాటున సొంతదేశంలోని ఓ గ్రామంలోని జనావాసాలపై వేయడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బాంబుల ధాటికి ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. అనేక భవనాలు కాలి బూడిదయ్యాయి. జరిగిన పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి.. సంఘటనా స్థలం వద్దకు అగ్నిమాపక సిబ్బందిని పంపించారు.
ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఇందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై స్పందించిన వాయుసేన అధికారులు.. బాధితులను ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. దీనిపై యాక్సిడెంట్ రెస్పాన్స్ కమిటీ విచారణ జరుతుందని.. బాధ్యులపై చర్యలు కూడా తీసుకుంటుందని వెల్లడించారు. మొత్తంగా సౌత్ కొరియా నిర్వాకం వైరల్ గా మారింది.