కోచింగ్ క్లాస్‌లోనే కుప్పకూలిన విద్యార్థి
కోచింగ్ క్లాస్‌లో గుండెపోటుతో కుప్పకూలి కళాశాల విద్యార్థి మరణించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని కోచింగ్ కోచింగ్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది

- గుండెపోటుతో తుదిశ్వాస
- ఇండోర్ కోచింగ్ సెంటర్‌లో ఘటన
విధాత: కోచింగ్ క్లాస్‌లో గుండెపోటుతో కుప్పకూలి కళాశాల విద్యార్థి మరణించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని కోచింగ్ కోచింగ్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇండోర్‌లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్ (18) మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడు.
ఇండోర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. బుధవారం సాయంత్రం నల్ల అంగి ధరించిన మాధవ్ క్లాస్‌లో చాలా మంది విద్యార్థుల మధ్య కూర్చున్నాడు. మాధవ్ ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్టు కనిపించింది. పక్కనే కూర్చున్న యువకుడు ఒంగి మాధవ్ వీపు రుద్దాడు. నొప్పిగా ఉందా.. అని అడిగాడు. మాధవ్ గుండె నొప్పితో బాధపడుతున్నందున లెక్చరర్‌కు చెప్పాలని చూశాడు. ఈ లోపే మాధవ్ పూర్తిగా కుప్పకూలి, తన డెస్క్ నుంచి జారి నేలపై పడిపోయాడు. తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీలో ఈ విషాదకర ఘటన మొత్తం రికార్డయింది.
విద్యార్థులు హుటాహుటిన మాధవ్‌ను సమీపంలోని ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ కొన్ని గంటల తర్వాత మాధవ్ మరణించాడు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడలేదు. కానీ, మాధవ్ గుండెపోటుతో చనిపోయినట్టు వర్గాలు తెలిపాయి. గత కొన్ని వారాల్లోనే ఇండోర్‌లోనే కనీసం నలుగురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల చిన్నారులు, యువకులు కూడా గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోతున్నారు.