విధాత: బాల్యంలో చుట్టూ ఉండే పరిస్థితులు, తల్లిదండ్రుల పెంపకం మొదలైనవి మన వ్యక్తిత్వాన్ని (Moral Values) నిర్మిస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైన విషయం తెలిసిందే. తాజాగా మనం వినే సంగీతం కూడా మన వ్యక్తిత్వ విలువలను నిర్దేశిస్తుందని ఒక అధ్యయనం (Study) వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచాన్ని చూస్తే దృక్కోణాన్ని కూడా మనం వినే సంగీతమే (Music) చెబుతుందని పేర్కొంది. క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్స్ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్లు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా 1400 మంది వాలంటీర్లను తీసుకుని.. సైకోమెట్రిక్ పరీక్ష ద్వారా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు. అనంతరం ఆ వాలంటీర్లకు ఇష్టమైన పాటలను, గాయకులను, ఫేస్‌బుక్‌లో ఎవరెవరిని ఫాలో అవుతున్నారన్న వివరాలు సేకరించారు. వారు అనుసరిస్తున్న ఆర్టిస్టులు, గాయకుల టాప్ 5 పాటలను సేకరించి.. వాటిని విశ్లేషించారు.
అధ్యయనకర్తలు వీటన్నింటినీ విశ్లేషించి.. వారి వారి వ్యక్తిత్వాన్ని పోల్చి చూశారు. ఈ పాటల్లో చెబుతున్న విషయం, విలువలు, సెంటిమెంట్, ఏ ఏ భావోద్వేగాలున్నాయి వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ అధ్యయనంలో ప్రముఖ ఆడియో సంస్థ స్పాటిఫై కూడా సహకరించింది. ఇందులో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే.. ఇతరుల పట్ల కేరింగ్‌గా ఉండటం, నిజాయతీగా ఉండటం అనే అంశాలను వారు ఎంచుకునే పాటల టోన్, పిచ్‌ను బట్టి అంచనా వేయొచ్చని తేలింది.
అలాగే లిరిక్స్‌ను బట్టి వాటిని వింటున్న వారి సెంటిమెంట్లు, భావోద్వేగాలను పసిగట్టొచ్చని వెల్లడైంది. సంగీతం అనేది కేవలం ఒక సమయాన్ని గడిపేసే అలవాటే కాదు. మన వ్యక్తిత్వ విలువలను, నైతిక ప్రవర్తనను రూపుదిద్దే ఒక మార్గం అని అధ్యయన కర్త, క్వీన్‌మేరీ యూనివర్సిటీలో డాక్టొరల్ స్టూడెంట్ జోసా ప్రెనెకి వెల్లడించారు. ఈ పరిశోధన ఆధారంగా వ్యక్తిత్వ వికాస పాఠాలలో, వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పరీక్షల్లో సంగీతాన్ని ఎలా వినియోగించాలనే అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తామని ఆయన తెలిపారు.