Supreme Court | 27వారాల గర్భ విచ్ఛిత్తికి.. సుప్రీం అనుమతి

Supreme Court | గుజరాత్‌ హైకోర్టుపై తీవ్ర ఆగ్రహం పెళ్లికాకుండా గర్భం హానికారకం రేప్‌ బాధితులకు మానసిక క్షోభ న్యూఢిల్లీ: గర్భవిచ్ఛిత్తికి లైంగిక దాడి బాధితురాలు పెట్టుకున్న దరఖాస్తుపై విచారణను గుజరాత్‌ హైకోర్టు వాయిదా వేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాని వల్ల పిటిషన్‌ దారు విలువైన సమయాన్ని కోల్పోయారని పేర్కొన్నది. ఈ విషయంలో సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్‌ విచారణకు రానున్నదని తెలిసి కూడా శనివారమే హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. […]

  • By: krs    latest    Aug 21, 2023 4:45 PM IST
Supreme Court | 27వారాల గర్భ విచ్ఛిత్తికి.. సుప్రీం అనుమతి

Supreme Court |

  • గుజరాత్‌ హైకోర్టుపై తీవ్ర ఆగ్రహం
  • పెళ్లికాకుండా గర్భం హానికారకం
  • రేప్‌ బాధితులకు మానసిక క్షోభ

న్యూఢిల్లీ: గర్భవిచ్ఛిత్తికి లైంగిక దాడి బాధితురాలు పెట్టుకున్న దరఖాస్తుపై విచారణను గుజరాత్‌ హైకోర్టు వాయిదా వేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాని వల్ల పిటిషన్‌ దారు విలువైన సమయాన్ని కోల్పోయారని పేర్కొన్నది. ఈ విషయంలో సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్‌ విచారణకు రానున్నదని తెలిసి కూడా శనివారమే హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.

పిటిషన్‌దారు 27వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. వివాహం కాకుండా సంభవించే గర్భం.. హానికరం, ఒత్తిడికి గురిచేస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. గర్భ విచ్ఛితికి పిటిషన్‌దారు చేసుకున్న విజ్ఞప్తిని గుజరాత్‌ హైకోర్టు తిరస్కరించడం సరికాదని పేర్కొన్నది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయడంపై మండిపడింది.

సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా కింది కోర్టులు ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంత తాత్వికతకు విరుద్ధమని స్పష్టం చేసింది. భారతీయ సమాజంలో వివాహం తర్వాత ప్రెగ్నెన్సీ అనేది దంపతులకే కాకుండా.. మొత్తం కుటుంబానికి, వారి స్నేహితులకు అత్యంత మనోహరమైనదని కోర్టు పేర్కొన్నది.

అదే సమయంలో పెళ్లికాకుండానే గర్భం దాల్చడం హానికరమని, అందులోనూ లైంగికదాడి బాధితులకు అది మానసికంగా తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తుందని పేర్కొన్నది. అది గర్భిణీ మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నది. ఈ కారణాల రీత్యా పిటిషనర్‌ తన గర్భాన్ని తొలగించుకునేం దుకు అనుమతిస్తున్నట్టు తెలిపింది.

గర్భవిచ్ఛిత్తి కోసం వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్‌ కావాలని పిటిషనర్‌కు సూచించింది. పిండం సజీవంగా ఉంటే.. ఇంక్యూబేషన్‌ సహా అన్ని రకాల సహకారాలు అందజేసి.. బేబీని బతికించేందుకు కృషి చేయాలని ఆదేశించింది. పిండం బతికితే చట్ట ప్రకారం దత్తతకు చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.