Supreme Court | మణిపూర్ హింసపై.. విచారణకు విస్తృత వ్యవస్థ: సుప్రీం
Supreme Court అసలు దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లు ఎన్ని? మహిళలపై నేరాల విషయంలో లెక్క ఏది? పూర్తి వివరాలతో కోర్టుకు రావాలి మహిళ జడ్జ్‌లతో కమిటీ కేంద్రం, మణిపూర్‌కు సుప్రీం కోర్టు ఆదేశం మణిపూర్ ఘటన ‘నిర్భయ’ వంటిది కాదు.. పథకం ప్రకారం సాగుతున్న వ్యవస్థీకృత హింస మే 4న ఘటన జరిగితే మే 18 ఎఫ్‌ఐఆర్ దాఖలా? ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? కేసు విచారణ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ: మణిపూర్‌లో యథేచ్ఛగా సాగుతున్న హింసాకాండ […]

Supreme Court
- అసలు దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లు ఎన్ని?
- మహిళలపై నేరాల విషయంలో లెక్క ఏది?
- పూర్తి వివరాలతో కోర్టుకు రావాలి
- మహిళ జడ్జ్‌లతో కమిటీ
- కేంద్రం, మణిపూర్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
- మణిపూర్ ఘటన ‘నిర్భయ’ వంటిది కాదు..
- పథకం ప్రకారం సాగుతున్న వ్యవస్థీకృత హింస
- మే 4న ఘటన జరిగితే మే 18 ఎఫ్‌ఐఆర్ దాఖలా?
- ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు?
- కేసు విచారణ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మణిపూర్‌లో యథేచ్ఛగా సాగుతున్న హింసాకాండ విషయంలో కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో తీవ్ర ఇబ్బందికర ప్రశ్నలను, పరిస్థితులను ఎదుర్కొన్నాయి. మే 4న ఇద్దరు కుకీ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన వీడియో దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులను సీబీఐకి బదిలీ చేసిన నేపథ్యంలో ఆ ఇద్దరు బాధితులు సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న హింసను కట్టడి చేసేందుకు విస్తృతస్థాయి వ్యవస్థ అవసరమని పేర్కొన్నది. హింసాకాండ మొదలైన మే నెల నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఈ అంశంలో ఎన్ని ఎఫ్‌ఆర్‌లు దాఖలయ్యాయో చెప్పాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ బెంచ్‌లో జస్టిస్ జేబీ పరదివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు.
‘కేవలం సిట్ లేదా సీబీఐతో విచారణ జరిపిస్తే సరిపోదు. తన కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని సహాయ శిబిరంలో ఓ 19 ఏళ్ల యువతి తలదాచుకుంటున్న దృశ్యాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఆమె మెజిస్ట్రేట్ వద్దకు వెళ్లటం కాదు.. న్యాయ ప్రక్రియ ఆమె ఇంటికి చేరేందుకు కృషి చేయాలి. పౌర సమాజ సభ్యులు, మహిళా న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి’ అని కోర్టు పేర్కొన్నది. బెంగాల్ స్థానిక ఎన్నికల్లో హింస విషయాన్ని ఒక లాయర్ ప్రస్తావిచగా.. ‘ఫలానా చోట ఇది జరిగింది.. మరో చోట ఇది జరిగింది అని చెప్పడం ద్వారా మణిపూర్‌లో జరుగుతున్న అంశాలను సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే.. వారే సదరు మహిళలను మూకలకు అప్పగించిన నేపథ్యంలో మణిపూర్ పోలీసుల విచారణను నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. దీనిపై విస్తృత స్థాయి వ్యవస్థ అవసరమని అన్నారు. ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసిన ఘటన మే 4న చోటు చేసుకుంటే ఎఫ్‌ఆర్‌ఆర్ దాఖలు చేయడానికి మే 18 వరకు ఎందుకు పట్టిందని కోర్టు ప్రశ్నించింది. ఘటన జరిగిన రోజే ఎందుకు ఎఫ్‌ఆర్‌ఆర్ నమోదు చేయలేదని నిలదీసింది.
సత్వరమే జీరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయకపోవడాన్ని సమర్థించుకోలేరని స్పష్టం చేసింది. మణిపూర్ హింసకు సంబంధించి ఇప్పటి వరకూ ఎన్ని జీరో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయో చెప్పాలని కోరింది. రాష్ట్రంలో బాధిత ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయో నివేదించాలని సూచించింది. లైంగిక దాడి అనేది వ్యవస్థీకృత హింసలో భాగమని వ్యాఖ్యానించింది. ‘బాధితులు తమను పోలీసులే మూకకు అప్పగించారని చెబుతున్నారు.
ఇది నిర్భయ వంటి ఉదంతం కాదు’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ‘అది ఒక ఘటన. కానీ.. మణిపూర్‌లో కుట్రపూరితంగా వ్యవస్థీకృతంగా జరుగుతున్న హింస’ అని పేర్కొన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మణిపూర్ వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పడం ద్వారా సమర్థించుకోజాలరని అన్నారు. మణిపూర్ హింసను నిరోధించేందుకు ఏం చేయాలన్నదే ప్రశ్న అని చెప్పారు. ‘భారతదేశంలోని కుమార్తెలందరినీ కాపాడాలని మీరు చెబుతారా? లేక ఎవరినీ కాపాడబోమని చెబుతారా?’ అని నిలదీశారు.
‘ఇటువంటి కేసులు ఎన్ని రిజస్టర్ అయ్యాయో చెప్పడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి వివరాలు లేవు. ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం’ అని బాధితుల తరఫు న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆయన అభ్యర్థించారు. విచారణపై బాధిత మహిళలకు నమ్మకం కలగాలని సిబల్ చెప్పడంతో తుషార్ మెహతా స్పందిస్తూ.. ఈ కేసులో దర్యాప్తును సుప్రం కోర్టు పర్యవేక్షించడంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
24 గంటల్లో సమాధానాలు చెప్పాలి
ఆరు అంశాలను లేవనెత్తిన సీజేఐ.. కేంద్రం, మణిపూర్ ప్రభుత్వం వాటికి 24 గంటల్లో సమాధానం చెప్పాలని ఆదేశించారు. మణిపూర్‌లో హింస మొదలైన తర్వాత దాఖలైన ఆరువేల ఎఫ్‌ఐఆర్‌లలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించినవి ఎన్ని? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి తుషార్ మెహతా స్పందిస్తూ.. అందుకు వర్గీకరించిన వివరాలు లేవని తెలిపారు. దీంతో ఆరు అంశాలను ప్రస్తావించిన సుప్రీంకోర్టు వీటిపై వివరణలతో మంగళవారం కోర్టుకు హాజరవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇందులో.. ఏ తరహా కేసులు ఎన్ని ఉన్నాయి?, జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఎన్ని?, సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు బదలాయించినవి ఎన్ని? ఈ కేసులలో ఎంతమందిని అరెస్టు చేశారు?, అరెస్టయినవారికి అందించిన న్యాయసహాయం పరిస్థితి ఏంటి?, సెక్షన్ 164 స్టేట్‌మెంట్లు సమీప మేజిస్ట్రేట్ వద్ద రికార్డు చేశారు? అనే వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. మహిళలపై జరిగిన నేరాలు అత్యంత భయానకమైనవన్న సుప్రీం కోర్టు.. ఈ కేసును మణిపూర్ పోలీసులు దర్యాప్తు చేయడాన్ని తాము అంగీకరించలేమని పేర్కొన్నది.
అంతకు ముందు కపిల్ సిబల్ తన వాదనలు వినిపిస్తూ.. మణిపూర్‌లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన మే 4న చోటు చేసుకుంటే.. ఎఫ్‌ఐఆర్ మే 18న దాఖలు చేశారని, జూన్‌లో ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదలాయించారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో జూలై 19న వెలుగులోకి వచ్చాక, కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేసులో పురోగతి కనిపించిందని చెప్పారు. బాధితులకు కేసు దర్యాప్తుపై విశ్వాసం అవసరమని అన్నారు. ఈ సమయంలో కోర్టు స్పందిస్తూ.. పద్నాలుగు రోజులుగా ఏం చేస్తున్నారని కేంద్రాన్ని నిలదీసింది.