మోస్ట్ వాంటెడ్.. ఐసీస్ ఉగ్రవాది అరెస్ట్

న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జాబితాలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఐసీసీ ఉగ్రవాదిని ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తలదాచుకున్న ఉగ్రవాది షాహ్నావాజ్ అలియాస్ షఫీ ఉజ్మాను ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారిని ఎన్ఐఏ అరెస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాద కుట్రలను భగ్నం చేస్తుంది. ఉగ్రవాద సంస్థకు చెందిన స్లీపర్ సెల్స్‌గా అనుమానిస్తున్న పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీకి చెందిన షాహ్నావాజ్.. వృత్తిరీత్యా ఇంజినీర్. షాహ్నావాజ్ ఐసీసీ పుణె మాడ్యుల్ కేసులో వాంటెడ్‌గా ఉన్నాడు. ఈ కేసులో అతని ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు. కానీ షాహ్నావాజ్ తప్పించుకు తిరుగుతున్నాడు. పుణె నుంచి ఢిల్లీ వచ్చి.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు షాహ్నావాజ్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.
షాహ్నావాజ్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 3 లక్షల క్యాష్ రివార్డ్ ఇస్తామని ఇటీవలే ఎన్ఐఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. షాహ్నావాజ్‌తో పాటు రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫైయాజ్ షేక్ అలియాస్ డయాపెర్వాలా, తల్హా లియాకత్ ఖాన్ ఆచూకీ కూడా తెలపాలని ఎన్ఐఏ ప్రకటించింది. షాహ్నావాజ్, అబ్దుల్లా, రిజ్వాన్ కలిసి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఐసీస్‌లో చేరారు.