Telangana | బీసీ సీఎం ఎత్తుగడలో బీజేపీ.. ప్రచారంలో ఎంపీ K లక్ష్మణ్‌ పేరు?

Telangana | ఏకాభిప్రాయం వస్తుందని యోచన పార్టీ శ్రేణులకు మంచి సంకేతాలు.. బీసీ సీఎంతో సీట్లు తెచ్చుకునే ప్లాన్‌! విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం అస్త్రాన్ని ప్రయోగించబోతున్నదా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తున్నది. అధికార పార్టీ ఇప్పటికే ప్రకటించిన 115 స్థానాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. బీసీలకు బీఆరెస్‌ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువే కాంగ్రెస్‌ పార్టీ ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో […]

  • By: Somu    latest    Sep 07, 2023 11:32 AM IST
Telangana | బీసీ సీఎం ఎత్తుగడలో బీజేపీ.. ప్రచారంలో ఎంపీ K లక్ష్మణ్‌ పేరు?

Telangana |

  • ఏకాభిప్రాయం వస్తుందని యోచన
  • పార్టీ శ్రేణులకు మంచి సంకేతాలు..
  • బీసీ సీఎంతో సీట్లు తెచ్చుకునే ప్లాన్‌!

విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం అస్త్రాన్ని ప్రయోగించబోతున్నదా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తున్నది. అధికార పార్టీ ఇప్పటికే ప్రకటించిన 115 స్థానాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. బీసీలకు బీఆరెస్‌ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువే కాంగ్రెస్‌ పార్టీ ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఇటు బీఆరెస్‌ను, అటు కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు బీసీ సీఎంను బీజేపీ తెరమీదికి తీసుకురానున్నట్టు తెలుస్తున్నది.

బీజేపీలో సీఎం అభ్యర్థి రేసులో ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీళ్లలో ఎవరి పేరు ప్రకటించినా అందరూ అంగీకరించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే పార్టీలో కొత్తవారు, పాత వారు కలిసి పనిచేయాలని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సమన్వయంతో సాగాలని ఎన్నిసార్లు అధిష్ఠానం దిశానిర్దేశం చేసినా అవి ఫలించలేదు. పైగా సంజయ్‌, రాజేందర్‌ వర్గాలు ఉప్పునిప్పులా మెలిగాయి. ఇప్పటికీ అదే వాతావరణం ఉన్నదని చెబుతున్నారు.

రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులు ఇలా ఉంటే పార్టీ అధ్యక్ష పదవి కిషన్‌రెడ్డికి అప్పగించిన సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు లాంటి వాళ్లు పార్టీ అధిష్ఠానంపై బహిరంగ విమర్శలు చేశారు. తనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని, కనీసం పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా కూడా తాను పనికిరానా? అని విమర్శించారు.

బీఆరెస్‌లో అవకాశాలు రావడం లేదనో, పదవుల పంపిణీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదనో, కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఉన్నదనో భావించిన కొందరు నాయకులు బీఆరెస్‌ను ఎదుర్కొనాలంటే బీజేపీతోనే సాధ్యమని ఒక దశలో నమ్మి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరకముందున్న పరిస్థితులు చేరిన తర్వాత కనిపించలేదు. పైగా వారిని అసలు పట్టించుకునే వారే లేరని ఆ పార్టీ నుంచి బైటికి వచ్చిన వాళ్లు విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి వస్తామన్న భ్రమలేవీ కేంద్ర నాయకత్వానికి లేవు. కష్టపడితే పదో పదిహేనో సీట్లు దక్కించుకోవచ్చుని వారి ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోరుతో ఏ పార్టీకీ అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మెజారిటీ రాకపోతే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో ఉపయోగించిన చీలికల ఫార్ములాను ఉపయోగించి, పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవచ్చనేది వారి వ్యూహమని అంటున్నారు. అంతేకాదు ‘పార్టీ కోసం పనిచేయండి, పార్టీని గెలిపించండి, నేతల పనితీరు ఆధారంగా పదవులు వస్తాయి’ అంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.

ముందే పదవులు ఆశించవద్దని ఆయన సూచించారు. ఆయన మాటల ఉద్దేశం ఏమిటి అంటే పార్టీ సిద్ధాంతాన్ని విశ్వసించేవాళ్లు, పార్టీ కోసమే దశాబ్దాల పాటు పనిచేసేవాళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఇతర పార్టీల నాయకత్వాలతో విభేదించి.. ఆర్థికబలంతోనో, అంగబలంతోనో ఇక్కడ పదవులు దక్కించుకోవచ్చు అనుకునే అది పొరపాటేనని ఆ పార్టీలో చేరిన వారిని చూస్తే తెలుస్తుందని పరిశీలకులు అంటున్నారు. పదవులు రావాలన్నా, పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కాలన్నా పార్టీ అధిష్ఠాన పెద్దల అండదండలు, ముఖ్యంగా మోదీ-షాలకు విధేయులకు మాత్రమే అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుదనేది ఈ తొమ్మిదేళ్ల పరిణామాలు చూస్తే అర్థమౌతున్నదని వారు పేర్కొంటున్నారు.

అందుకే సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నకిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ కాకుండా పార్టీ మరి ఎవరికి అవకాశం ఇస్తుందనే ప్రశ్న రావొచ్చు. అయితే ఈ విషయంలో పార్టీ పెద్దలు మొదటి నుంచి క్లారిటీతోనే ఉన్నట్టు సమాచారం. ఆ పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్‌ను ప్రకటిస్తే ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవచ్చునని, పార్టీ కోసం సుదీర్ఘ కాలం పనిచేసిన వారిని సరైన సమయంలో పార్టీ గుర్తిస్తుందనే సంకేతాలు పంపిస్తుందనే టాక్‌ వినిపిస్తున్నది. ఆ పార్టీ తొలి జాబితా ఈ వారంలో విడుదల కావొచ్చు. ఆ సమయంలో లేదా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత అయినా దీనిపై బీజేపీ అధిష్ఠానం స్పష్టత ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్నది.