Telangana Budget: వాహనదారులను భయపెట్టిన తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదన!

తెలంగాణ బడ్జెట్ లో ప్రతిపాదించిన విధంగా హైబ్రిడ్ అన్యూటీ మోడల్ లో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసినట్లయితే పక్క ఊరికి, పక్క మండలానికి, పక్క జిల్లాకు పోవాలన్నా టోల్ వసూలు చేసే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది.

Telangana Budget: వాహనదారులను భయపెట్టిన తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదన!

Telangana Budget: తెలంగాణ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ అంశం జనాలను ఆలోచనలో పడేసింది. బడ్జెట్ ప్రతిపాదనలు తెలుగు భాషలో కాపీ 72పేజీలు, ఆంగ్లంలో 61 పేజీలుండగా..రెండింటిలోనూ 151 చొప్పున అంశాలున్నాయి. ఇందులో 124అంశంలో రోడ్లు, భవనాల శాఖ ( ఆర్ అండ్ బీ)కు సంబంధించిన వివరాలున్నాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ అన్యూటీ మోడల్ (HAM) ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయించామన్న అంశం వాహనదారులను భయపెడుతోంది.

ఈ హమ్ మోడల్ లో  40 శాతం ప్రభుత్వ నిధులతో, 60 శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. హమ్ మోడల్లో 2028 వరకు 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను సుమారు 28,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వం తెలిపింది. అంటే హైబ్రిడ్ అన్యూటీ మోడల్ లో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసినట్లయితే పక్క ఊరికి, పక్క మండలానికి, పక్క జిల్లాకు పోవాలన్నా టోల్ వసూలు చేసే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది.

హైబ్రిడ్ అన్యూటీ మోడల్ (HAM) ద్వారా తెలంగాణలో ఇకపై గ్రామీణ రోడ్లకు కూడా టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. హమ్ మోడల్ ద్వారా ప్రజల ముక్కుపిండెందుకు టోల్ గేట్లు పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గతంలో మేం అద్భుతమైన నాలుగులైన్ల, డబుల్ లైన్ల రోడ్లు వేశామని..ఎక్కడా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయలేదని హరీష్ రావు గుర్తు చేశారు. మేం ప్రభుత్వ ఖజనా నుంచి రోడ్లు వేస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాళ్ల కమిషన్ల కోసం రోడ్లు వేసేందుకు..హమ్ మోడల్ లో అప్పులు తెచ్చి రోడ్లు వేసి ప్రజల దగ్గర టోల్ వసూలు చేసేందుకు బడ్జెట్ ప్రతిపాదన చేయడం సిగ్గుచేటన్నారు.