Modi | మోడీ శకానికి ఇక ముగింపే!

Modi విధాత‌: నరేంద్రమోడీ నాయకత్వం దుర్భేద్యం కాదని గత నాలుగున్నరేళ్లలో అనేకసార్లు రుజువయింది. 2019 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన పద్నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార యుద్ధానికి మోడీ, అమిత్‌ షా స్వయంగా నాయకత్వం వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో మోడీ అనుకూల పవనాలతో బీజేపీ అసాధారణ విజయం సాధించింది. సొంతంగా 302 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. మోడీ-షాలు అదే ధైర్యంతో గత నాలుగేళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు గెలవడానికి సర్వశక్తులూ ఒడ్డారు. అయితే […]

Modi | మోడీ శకానికి ఇక ముగింపే!

Modi

విధాత‌: నరేంద్రమోడీ నాయకత్వం దుర్భేద్యం కాదని గత నాలుగున్నరేళ్లలో అనేకసార్లు రుజువయింది. 2019 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన పద్నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార యుద్ధానికి మోడీ, అమిత్‌ షా స్వయంగా నాయకత్వం వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో మోడీ అనుకూల పవనాలతో బీజేపీ అసాధారణ విజయం సాధించింది. సొంతంగా 302 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది.

మోడీ-షాలు అదే ధైర్యంతో గత నాలుగేళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు గెలవడానికి సర్వశక్తులూ ఒడ్డారు. అయితే వారి విజయం అప్రతిహతంగా ఏమీ ముందుకు సాగలేదు. పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎనభై శాతానికి పైగా లోక్‌సభ స్థానాలను గెల్చుకున్న మోడీ.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. 2019 నాటి పరిస్థితులు నేడు లేవు అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి.

ఒకటి: లోక్‌సభ ఎన్నికల తర్వాత హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఢిల్లీ, బీహార్‌, అస్సాం, గోవా, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌, కర్ణాటక- మొత్తం 18 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ ఆరు రాష్ట్రాల్లో ఓడిపోయింది. ‘నన్ను చూసి ఓటేయండి. డబుల్‌ ఇంజను సర్కారు కోసం ఓటేయండి’ అని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినా జార్ఖండ్‌, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, మేఘాలయ, నాగాలాండ్‌, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఓడించారు. ఎంత ఖర్చుపెట్టినా, ఎంతగా ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.

మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ ఆ సంకరానికి ప్రజామోదం లేదన్నది వాస్తవం. హర్యానా, మహారాష్ట్ర, బిహార్‌, గోవాలలో ఏర్పాటయింది ఆయారామ్‌ గయారామ్‌ల ప్రభుత్వాలు. బిహార్‌లో ఇప్పుడు అది కూడా పోయింది. వారు సొంతంగా సాధించిన ఘన విజయాలు ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, అస్సాం, ఉత్తరాఖండ్‌, త్రిపురలలో మాత్రమే. అంటే అసెంబ్లీల ఎన్నికలలో అత్యధిక రాష్ట్రాలలో మోదీ, షాల పాలనకు ఆమోదం లభించలేదు. మోదీ అనుకూల వాతావరణం ఇప్పుడు ఆవిరయిపోయింది.

రెండు: 2019నాడు నరేంద్ర మోడీని ప్రేమించిన మిత్రపక్షాలు ఇప్పుడు ఆయనతో లేవు. మహారాష్ట్రలో శివసేన దూరమైంది. నరేంద్రమోడీ నాయకుడుగా ఉండగా మళ్లీ శివసేన బీజేపీకి దగ్గరయ్యే అవకాశమే లేదు. పంజాబ్‌లో అకాలీదళ్‌ దూరమైంది.

బిహార్‌లో జేడీయూ దూరమైంది. హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలోనే కొన్ని స్థానిక మిత్రపక్షాలు ఇంకా బీజేపీతో ఉన్నాయి. జేడీయూ, శివసేన లేకుండా బీజేపీ ఏమి చేయగలదో మళ్లీ ఎన్నికలు వస్తేగానీ తెలియదు. అకాలీదళ్‌ దూరమైన తర్వాత పంజాబ్‌లో ఏమి జరిగిందో అందరూ చూశారు. అందువల్ల ఇప్పటి బీజేపీ 2019 నాటి బీజేపీ కాదు.

మూడవ అంశం: నరేంద్ర మోడీ జనాకర్షణ మసకబారిపోయింది. ‘అవినీతి మరకలేదు’, ‘దేశభక్తుడు’ వంటి ముద్రలేవీ ఇప్పుడు ఆయకు మిగిలిలేవు. ఆయన కూడా అందరి వంటి నాయకుడే అని రుజువు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు, మత హింస, విద్వేషకాండ, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి ఏ ఒక్క అంశంపైనా ఆయన స్పందించరు. తను చేయదల్చుకున్నది చేస్తూ పోతారు. తను చెప్పదల్చుకున్నవి చెబుతూ పోతారు. స్వయంగా ఎటువంటి చరిత్ర లేకపోయినా జాతీయోద్యమ చరిత్రను వక్రీకరిస్తారు. జాతీయ నాయకులపై బురద చల్లుతారు.

Telangana | CPI, BRS మధ్య పొత్తు పొడవనట్టేనా?

రాఫెల్‌ విమానాల కొనుగోలు నుంచి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ను తప్పించి, ఒక అనామక సంస్థను ప్రవేశపెడతారు. అది అవినీతి కాదని వాదిస్తారు. అదానీ కంపెనీల షేర్ల రిగ్గింగు, నిధుల దందాపై అంతపెద్ద ఆరోపణలు వస్తే బెల్లంకొట్టిన రాయిలాగా ఉలకరు పలకరు. రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు ఇంధనం తెస్తున్నామని ఘనంగా చెప్పే ప్రభుత్వం ఇక్కడి ప్రజలపై మాత్రం ధరల భారాన్ని పెంచుతూ వచ్చింది.

కంపెనీలకు రుణాలు, పన్నుల తగ్గింపు, రాయితీలు ఇబ్బడి ముబ్బడిగా ఇస్తారు. అప్పులు ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్తలకు దివాలా సౌకర్యాలూ ఉన్నాయి. విదేశాలకు పారిపోయే అవకాశాలూ ఉన్నాయి. తుఫాన్‌లు, గాలివానలు, రాళ్లవానల వల్ల వేలకోట్ల రూపాయల పంటలను నష్టపోయిన రైతాంగానికి పదివేల సహాయం అందించడానికి మనసు రాదు.

BRS | బీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీయ‌నుందా?

సంపదను సృష్టించడమే కాదు, పోగుపడుతున్న సంపదను ప్రజలకు పంచడం ప్రజాస్వామిక ప్రభుత్వాలు చేయాల్సిన పని. కానీ సంపద పంపిణీకి మోడీ వ్యతిరేకం. సంపద సమాజంలో ఉన్నతవర్గాల వైపు పురోగమించాలని కోరుకుంటున్నారని ఆయన చర్యలు సూచిస్తున్నాయి. అందుకే పేద ధనిక వ్యత్యాసాలు మునుపెన్నడూ లేనంత పెరిగాయని అంతర్జాతీయ అధ్యయన నివేదికలు సూచిస్తున్నాయి.

ప్రతిపక్షాలపై, ప్రజాసంఘాలపై, కవులు, రచయితలు, జర్నలిస్టులపై నిర్బంధం, హత్యాకాండ యథేచ్ఛగా జరుతున్నది. తమను విమర్శించినవారు సొంత పార్టీ వారయినా వారి ఇంటిపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తాయి. మొత్తం వ్యవస్థలు ఒక్క మోడీ కోసం ఒక్క అమిత్‌షా కోసం పనిచేస్తాయి. దేశం లేదు, ప్రజాస్వామ్యం లేదు, చట్టం లేదు, హక్కులు లేవు. చివరికి ప్రధాని ఎలా తయ్యారంటే తను, తన కార్యక్రమాలు తప్ప దేశంలో ఏమి జరిగినా పట్టించుకోరు.

తమను లైంగికంగా వేధించారని దేశానికి పతకాలు తెచ్చిన అమ్మాయిలు రాజధాని నడిబొడ్డున కన్నీళ్లు పెట్టుకుంటుంటే, మణిపూర్‌లో రెండు జాతుల మధ్య తగవు వచ్చి ఊళ్లకు ఊళ్లు తగలబడిపోతుంటే, అనేక మంది అమాయకులు అగ్నికీలలకు ఆహుతి అవుతుంటే, ఇక్కడ ఈ సారు టన్నులకొద్దీ పూల వర్షంలో కిలోమీటర్ల పొడవునా రోడ్డు షోలు నిర్వహిస్తుంటారు. ఆధునిక నీరో అని ప్రతిపక్షాలు నిందించేది అందుకే. ఇప్పటి మోడీ 2019 నాటి మోడీ కాడు.

నాలుగు: ప్రభుత్వ వ్యతిరేకత. కొన్ని చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత. మరికొన్ని చోట్ల కేంద్రంపైనే వ్యతిరేకత. రెండు పర్యాయాలు పాలనలో ఉన్న ఏ పార్టీకయినా ఈ వ్యతిరేకత సహజం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా వ్యతిరేకత ఏర్పడింది. అవినీతి, ఆశ్రితపక్షపాతం, కుంభకోణాలు, కమీషన్లు, రాజకీయ ఫిరాయింపులు, గవర్నర్ల నాటకాలు, ప్రభుత్వాలను కూల్చడం పనులలో బీజేపీ కాంగ్రెస్‌ కంటే దుర్మార్గంగా తయారయిందని చాలా సందర్భాల్లో రుజువయింది.

వందల కోట్ల రూపాయలు వెచ్చించి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రత్యేక విమానాల్లో అస్సాం, కశ్మీర్‌ తిప్పి ప్రభుత్వాలను పడగొట్టడం అంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు? బీజేపీ ఈ ఎనిమిదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో 170 మంది విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు ఆ మధ్య జాతీయ మీడియా సంస్థలు రాశాయి.

భిన్నమైన, పరిశుద్ధమైన రాజకీయాలు చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ మునుపటి కంటే హీనమైన మురికి రాజకీయాలు చేస్తున్నది. అంతేకాదు ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యల నుంచి దృష్టి మళ్లించి, పనికిమాలిన అంశాలతో సమాజంలో అశాంతిని, అరాచకాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తున్నదన్న భావన జనంలో తలెత్తుతున్నది.

ప్రజలను మతం ధ్యాసలో ముంచి, సంపదను, వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను తమకు ఇష్టులైన కంపెనీలకు కట్టబెడుతున్నదన్న అసంతృప్తి కూడా జనంలో ప్రబలుతున్నది. ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే పేరిట వడ్డీ రేట్లు అడ్డగోలుగా పెంచి ఠంచనుగా రుణాలు, ఈఎంఐలు చెల్లించే మధ్యతరగతి జీవులపై కోలుకోలేని భారాన్ని మోపిన విషయమూ ఆందోళన రేకెత్తించింది. అధిక ధరలు, నిరుద్యోగం తారస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెరగడానికి ఇవన్నీ దోహదం చేశాయి.

Cabinet | దొడ్డి దోవ మంత్రులు..! క్యాబినెట్‌ హోదా, సదుపాయాల కల్పన

ఇవి నరేంద్ర మోడీకి చివరి ఎన్నికలు అవుతాయి. ఆయన మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 నుంచి 200 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతుగా ఎన్‌డీఏలో చేరడానికి మరికొన్ని పార్టీలు ముందుకు రావాలి.

కానీ నరేంద్ర మోడీని ప్రేమించే ప్రతిపక్ష నాయకుడు దేశంలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. నరేంద్ర మోడీ ఏ ప్రతిపక్ష నాయకుడినీ విశ్వాసంలోకి తీసుకోలేదు. తీసుకోలేడు. ఆయన అందరితోనూ దొంగా పోలీస్‌ ఆట ఆడుకున్నారు. అందరినీ భయపెట్టి స్వాధీన పర్చుకోవాలనుకున్నారే కానీ మిత్రపూర్వక సంబంధాలు మిగిల్చుకోలేదు. ఆయన తత్వమే అంత.

అమిత్‌ షా ఆయన నీడ. అందువల్ల ఆయననూ ప్రతిపక్షాలు అంగీకరించవు. బీజేపీ మరో కొత్త నాయకుడిని, ఎక్కువమందికి ఆమోదయోగ్యుడైన నాయకుడిని ఎన్నుకుని ముందుకు వస్తే చెప్పలేము. అదికూడా కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు ఏకం కాకపోతేనే.

– కట్టా శేఖర్‌రెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు