గుజరాత్‌లో బీజేపీ విజయ రహస్యం.. ముస్లిం ఓట్లేనా..!
మైనారిటీ ఓట్లన్నీ బీజేపీ వైపు మల్లడంలో మతలబు ఏమిటి? విధాత: గుజరాత్ లో బీజేపీ అఖండ విజయంతో అనేక కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అధికార బలం ఇతరత్రా కారణాల ఆసరాతో బీజేపీ గెలిస్తే, అది సాధారణ గెలుపుగా ఉంటే ఈ స్థాయిలో చర్చలు, విశ్లేషణలు ఉండేవి కావు. ఎక్కడా ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి గుజరాత్‌లోని ముస్లిం ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయా? ఓట్ల శాతం పెరుగుదలకు వారి ఓట్లే ప్రధాన కారణమా.. అంటే.. ఔననే సమాధానం వస్తున్నది. […]

- మైనారిటీ ఓట్లన్నీ బీజేపీ వైపు మల్లడంలో మతలబు ఏమిటి?
విధాత: గుజరాత్ లో బీజేపీ అఖండ విజయంతో అనేక కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అధికార బలం ఇతరత్రా కారణాల ఆసరాతో బీజేపీ గెలిస్తే, అది సాధారణ గెలుపుగా ఉంటే ఈ స్థాయిలో చర్చలు, విశ్లేషణలు ఉండేవి కావు. ఎక్కడా ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి గుజరాత్‌లోని ముస్లిం ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయా? ఓట్ల శాతం పెరుగుదలకు వారి ఓట్లే ప్రధాన కారణమా.. అంటే.. ఔననే సమాధానం వస్తున్నది.
గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ156 సీట్లు గెల్చుకొని చారిత్రక విజయాన్ని మూటగట్టుకొన్నది. చరిత్రలో ఎన్నడూ లేని అఖండ విజయం సాధించటానికి ముస్లిం ఓట్లే కారణమని విశ్లేషకులు అంటున్నారు. గుజరాత్‌లో ముస్లింల జనాభా 9 శాతమే అయినా.., 10నుంచి 20 శాతం ఓట్లతో గెలుపు ఓటములను నిర్దేశించే స్థితి 53 నియోజక వర్గాల్లో ఉన్నది. వీటిలో 50 సీట్లు బీజేపీ గెల్చుకున్నది! ఈ గెలుపు ఎలా సాధ్యమైంది? కారణం ఏమై ఉంటుంది?
సాధారణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని అయినా పార్టీలు అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తామని చెప్పుకొంటాయి. అలా చూపెట్టుకోవటానికి అయినా అన్ని వర్గాలకు సీట్లు కేటాయిస్తారు. కానీ బీజేపీ ముస్లింల విషయంలో ఇదేమీ పట్టించుకోవటం లేదు. మొత్తం 182 సీట్లకు పోటీచేసి ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా పోటీలో నిలుపలేదు. తమ తరఫున ముస్లిం అభ్యర్థులు ఉండరని కూడా బాహాటంగా ప్రకటిస్తున్నది!
కానీ కాంగ్రెస్ ఆరుగురిని, ఆమ్‌ఆద్మీపార్టీ నలుగురు ముస్లింలను తమ అభ్యర్థులుగా నిలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా తామే బీజేపీకీ ప్రత్యామ్నాయంగా పోటాపోటీగా ప్రచారం చేశాయి. అయినా.. కాంగ్రెస్, ఆప్ పార్టీలు నామ మాత్రపు పోటీ మాత్రమే ఇచ్చినట్లు వచ్చిన సీట్లను బట్టి అర్థమవుతున్నది. కాంగ్రెస్ గెల్చుకున్నది 17 అయితే, ఆప్ 5సీట్లను మాత్రమే వశం చేసుకున్నాయి. మొత్తంగా చూస్తే… కాంగ్రెస్ తరపున జమాల్‌పుర్ ఖడియా నియోజక వర్గం నుంచి ఇమ్రాన్ ఖడావాలా ఒక్కరే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
గుజరాత్‌లో ముస్లిం ఓటర్లు పది నియోజక వర్గాల్లో 20 శాతం ఓట్లతో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. వాగ్రా, ఈస్ట్ సూరత్, భుజ్, దరియాపూర్, గోధ్రా, విజల్ పుర్, దానిలిమ్డా, భరూచ్, లింబాయత్, అబ్టాసా, వాంకనెర్ లాంటి నియోజకవర్గాల్లో ముస్లింలు 20శాతం ఉన్నారు. ఈ నియోజకవర్గాలన్నీ బీజేపీ వశమయ్యాయి. అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం తరపున 13 నియోజక వర్గాల్లో పోటీచేశారు. దేశ వ్యాప్తంగా మైనారిటీ ప్రతినిధిగా చెలామని అవుతున్న ఎంఐఎం కేవలం 1.1శాతం ఓట్లను మాత్రమే సాధించటం గమనార్హం.
ఈ పరిస్థితులన్నీ చెబుతున్నదేమంటే… ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న నియోజక వర్గాల్లో బీజేపీ గెలువటం నల్లేరు మీద నడకై పోయింది. ఇలా గెలవటానికి మరో కారణం ఏమీ కనిపించదు. ముస్లిం ఓట్లన్నీ బీజేపీకే పడుతున్నాయి. ఇది గుజరాత్‌లోనే.. కొత్తగా వచ్చిన పరిణామం కాదు. ఉత్తర ప్రదేశ్‌లో కూడా ముస్లింలు ఎక్కవుగా ఉన్న నియోజక వర్గాలన్నింటిలో బీజేపీ గెలిచింది.
ఒకానొక స్థితి ఏమంటే… ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ ప్రచారమే చేయటం లేదు. అలాంటి స్థానాల్లో బీజేపీని గెలిపించే బాధ్యత స్థానిక ముస్లింలదేనని బీజేపీ హుకుం జారీ చేసిన ఘటనలున్నాయి. మోదీ హయాంలో గత్యంతరం లేని స్థితిలో ముస్లింలు బీజేపీకే ఓటు వేసే పరిస్థితులు వచ్చాయి. అది యూపీలో మొదలై ఉత్తరాదిన ప్రబలి నేడు గుజరాత్‌కు వచ్చింది.