Electric SUVs | కార్ల ప్రియులకు గుడ్‌న్యూస్..! మార్కెట్‌లోకి రాబోతున్న ఈవీ ఎస్‌యూవీలు ఇవే..!

Electric SUVs | ఇటీవకాలంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరిగింది. భారీగా పెరిగిన ఇంధన ధరల కారణంగా వాహనదారులందరూ ఈవీ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమలో కంపెనీలు సైతం కొత్త కొత్త మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకున్నాయి. ఇప్పటికే ఎన్నో మోడల్స్ ఈవీ కార్లు మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా మరికొన్ని మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. భారత్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటామోటార్స్ సహా పలు కంపెనీలు సబ్ కాంటాప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాయి. టాటా మోటార్స్ ఈ ఏడాది చివరలో ‘పంచ్’ ఈవీని విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. మరో వైపు హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీని టెస్ట్ చేస్తున్నది. ఈవీలో తక్కువ ధరకు లభించే కార్ల జాబితాలో ఇది కూడా చేరనున్నది. మారుతి సుజుకీ ఈ ఏడాది ప్రారంభంలో ఎలక్ట్రిక్ కార్ల టీజర్‌ను విడదల చేసింది. అయితే, ఇందులో ఎలక్ట్రిక్ వెర్షన్ మారుతి సుజుకీ ఫ్రాంక్స్ మైక్రో ఎస్‌యూవీపైనే అందరి దృష్టి పడింది.
టాటా పంచ్ వచ్చేది ఎప్పుడంటే..?
టాటా కంపెనీకి చెందిన ఈవీని ఈ ఏడాది పండుగ సీజన్‌లోనే మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం ఉన్నది. టాటా జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో రాబోతున్నది. ఇందులో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ, పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌తో పాటు టియాగో ఈవీ పవర్‌ట్రెయిన్‌ను పంచ్ ఈవీలో ఉండబోతున్నది. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 74 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్‌తో 19.2 కేడబ్ల్యూహెచ్ యూనిట్, 61 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్‌తో 24 కేడబ్ల్యూహెచ్ యూనిట్ ఉండనున్నాయి. ఐసీఈ మోడల్ తరహాలోనే కొత్త 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇతర ఫీచర్లను ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
టెస్టింగ్ దశలో హ్యుందాయ్ ఎక్స్‌టర్..
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం టెస్టింగ్ ప్రారంభ దశలో ఉంది. అయితే, 2024లో మార్కెట్‌లోకి లాంఛ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కారు టాటా పంచ్ ఈవీతో పోటీ పడబోతున్నది. ఎక్స్‌టర్ ఈవీ 25 కేడబ్ల్యూహెచ్ నుంచి 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఇవ్వబోతున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 నుంచి 350 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుందని తెలుస్తున్నది. ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీలో కొన్ని కాస్మెటిక్ మార్పులను హ్యుందాయ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇంటీరియర్, స్పెసిఫికేషన్స్ ఐసీఈ ఎక్స్‌టర్‌ని పోలి ఉండనున్నట్లు తెలుస్తుంది.
మారుతి సుజుకీ ఆరు కార్లు..
2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఆరు కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లను తీసుకురాబోతున్నట్లుగా మారుతి సుజుకీ ప్రకటించింది. తొలి ఎలక్ట్రిక్ కారు ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ఈవీ 2025 ప్రారంభంలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. వాగర్ఆర్ ఈవీ, బలెనో ఈవీ వంటి మోడళ్లను టీజ్ చేయగా.. ఫ్రంట్ఎక్స్ ఈవీ, గ్రాండ్ విటారా ఈవీ, జిమ్నీ ఈవీ కనిపించాయి. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారీ మార్కెట్ సొంతం చేసుకోవాలని మారుతి సుజుకీ భావిస్తున్నది.