Reservations: అవి రేజర్వేషన్లు కాదు.. పరిహారం | జాతీయ సంపదలో దళితుల వాటా ఎంత?
బానిసలుగా పనిచేసిన శ్రామికవర్గం ఒక్క దళిత జాతే.. భాగస్వామ్యం లేకుండానే పంట పండించడం, సంపద సృష్టించిన జాతి జాతీయ సంపదలో దళితుల వాటా ఎంత? విధాత: సంఘ్ పరివార్‌కు చెందిన 150 మంది మేధావులు ఇటీవల గురుగావ్‌లో సమావేశమై దళిత క్రైస్తవులు రిజర్వేషన్లకు అర్హులు కారు అని తీర్మానించారు. దళితుల ఆర్థిక అభివృద్ధి, సామాజిక అనుసంధానం గురించి చర్చించకుండా దళిత క్రైస్తవులను ఇబ్బందులు పెట్టే చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. 1956లో దళిత సిక్కులకు, 1990లో దళిత […]

- బానిసలుగా పనిచేసిన శ్రామికవర్గం ఒక్క దళిత జాతే..
- భాగస్వామ్యం లేకుండానే పంట పండించడం, సంపద సృష్టించిన జాతి
- జాతీయ సంపదలో దళితుల వాటా ఎంత?
విధాత: సంఘ్ పరివార్‌కు చెందిన 150 మంది మేధావులు ఇటీవల గురుగావ్‌లో సమావేశమై దళిత క్రైస్తవులు రిజర్వేషన్లకు అర్హులు కారు అని తీర్మానించారు. దళితుల ఆర్థిక అభివృద్ధి, సామాజిక అనుసంధానం గురించి చర్చించకుండా దళిత క్రైస్తవులను ఇబ్బందులు పెట్టే చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు.
1956లో దళిత సిక్కులకు, 1990లో దళిత బౌద్దులకు రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించ బడడానికి గల కారణాలు దళిత క్రైస్తవులకు వర్తిస్తాయి. ఎందుకంటే బౌద్ధమతం, సిక్కు మతం కుల రహిత విధానాలపై రూపొందాయి. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు ఖాళీ ఉద్యోగాలను నియమించకుండా, మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ రిజర్వేషన్ విధానాన్ని నిరర్ధకం చేస్తూ లేని ఉద్యోగాల కొరకు దళితుల మధ్య చీలికలు తెచ్చే క్రమంలోనే ఈ వాదనలు వినిపిస్తున్నాయి.
దళితులను హిందూ మతంలో పరిపూర్ణ భాగస్వాములుగా పరిగణిస్తే అయోధ్యలో కడుతున్న రామ మందిరానికి దళిత పూజారులను నియమించడానికి ఈ మేధావులు అంగీకరిస్తారా? మధురలో ఉన్న శ్రీకృష్ణుని దేవాలయానికి యాదవులను పూజారులుగా నియమించాలని సూచిస్తారా? మౌలికమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా రాజకీయ లబ్ధి కొరకు దళితులలోనే చీలికలు తెచ్చే ప్రయత్నాలు సమంజసం కావు.
దళిత రిజర్వేషన్లకు ప్రతిపాదక ప్రస్తుత ఆర్థిక, సామాజిక వెనుక బాటు తనం మాత్రమేనా? లేక శతాబ్దాల తరబడి దళిత జాతికి జరిగిన అన్యాయమా అని ప్రశ్నించుకుంటే చారిత్రక దోపిడీయే ప్రాతి పాదిక గా నిలుస్తుంది. భారతదేశంలో వ్యవసాయం ప్రధానమైన ఆర్థిక వనరుగా ఉన్నప్పుడు పశువుల కంటే ఎక్కువగా శ్రమించి భారత్ ఆర్ధిక వ్యవస్థకు దళితులు ఇంధనంగా మారారు.
రేయి పగలు కష్టించి భూమిపై హక్కులు లేకుండా, పంటలో, సంపదలో భాగస్వామ్యం పొందకుండా బానిసలుగా పనిచేసిన శ్రామిక వర్గం ప్రపంచంలో ఒక్క దళిత జాతి మాత్రమే.. అమెరికాలో బానిసలను ఎంతగా పీడించినప్పటికీ ఇంట్లోకి రానిచ్చేవారు. ఉత్తరాది రాష్ట్రాలలో నల్ల వారికి మెరుగైన సౌకర్యాలు ఉండేవి. కొంతమంది యజమానులు బానిసలను కార్మికులుగా పరిగణించి గౌరవంగా చూసుకునే వారు.
భారతదేశంలో అంటరానితనాన్ని అమలు పరచడంలో ఇతర కులాలు అన్ని ఏకమై కచ్చితంగా అమలు పరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కారంచేడు మరణ కాండలో దళితేతర వర్గాలు గ్రామస్థాయిలో నిర్వహించిన పాత్ర పై అనేక విమర్శలు ఉన్నాయి.. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో దళితుల చెమట, నెత్తురు ఉన్నాయి. వారి పూర్వీకులు చేసిన త్యాగాలకు ఫలితంగా పరిహారము (reparation) పొందుతున్నారు. వాటిని కేవలం రిజర్వేషన్లుగా (reservation) పరిగణించకూడదు.
బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంmr తరలించుకొని పోయిన సంపద గురించి లెక్కలు వేస్తున్న వారు శతాబ్దాలుగా వ్యవస్థీకృత దోపిడీలో దళిత జాతి కోల్పోయిన సంపద గురించి కూడా లెక్కలు వేయాలి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 10 లక్షల మంది యూదులను హిట్లర్ నిర్బంధ కార్మికులుగా ఉపయోగించాడు. యుద్ధం తర్వాత వారి కుటుంబాలకు పరిహారంగా పశ్చిమ జర్మనీ 2022 రూపాయి మారక నిలువ ప్రకారము 30 లక్షల కోట్ల రూపాయలు చెల్లించింది.
10 లక్షల యూదుల చేత ఐదు సంవత్సరాల నిర్బంధ శ్రమ చేయించుకున్నందుకు 30 లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తే కోట్లాది దళితులు శతాబ్దాల శ్రమ చేసినందుకు భారత సమాజం ఎంత చెల్లించాలి? పూర్వీకులు చేసిన త్యాగమే ప్రస్తుతం దళిత జాతి ఆస్తి హిందూ మతస్తులు మత మార్పిడితో వారి ఆస్తి హక్కు కోల్పోరు. అలాగే దళితుడు కూడా పూర్వీకులు చేసిన శ్రమ ఫలితంగా వచ్చిన పరిహారం (reparations) ను మాత మార్పిడితో కోల్పోడు.
దళితులకు సంపద సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. అత్యంత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దేశం ఉన్నప్పటికీ ఇంతవరకు 16 వేల ఎకరాలు దళితులకు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరగడం వలన ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కొన్ని వర్గాల నుంచి విమర్శను ఎదుర్కొంటుంది.
దళితులకు మాత్రమే 10 లక్షలు రూపాయలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అమలులో ఉన్న రైతు బంధు, రైతు బీమా, నేత, గీత, గొర్ల కాపరుల సంక్షేమ పథకాలపై దళితులు అభ్యంతరం వ్యక్తం చేయనప్పుడు కొందరు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు?
తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం దళిత బంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రధాని మోదీ దక్షిణ భారతదేశంపై ద్వేష భావం లేకుండా ఉన్నా లేక కొవిడ్, డీమానిటైజేషన్ లాంటి ఉప ద్రవాలు రాకుండా ఉన్నా రాష్ట్రంలో ఎక్కువ ఆర్ధిక వనరులు ఉండేవి. అధిక కేటాయింపులు జరిగే అవకాశాలు ఉండేవి.
మహాత్మా గాంధీ చెప్పినట్లుగా దళితుల అభివృద్ధి సామాజిక బాధ్యత ప్రభుత్వం ద్వారా మాత్రమే దళిత పెట్టుబడిదారులను సృష్టించే కార్యక్రమం విజయవంతం కాదు. అమెరికాలో బహుళ జాతి కంపెనీలు వివిధ కార్యక్రమాల ద్వారా నల్లవారిని పెట్టుబడిదారులుగా తయారు చేస్తున్నవి. అదే పద్ధతిలో ప్రైవేట్ కార్పొరేషన్లు, ప్రభుత్వ బ్యాంకులు సామాజిక బాధ్యతగా ఈ రంగంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నది.
ఓట్ల కొరకు దళితులలో మత కలహాలను సృష్టించడానికి ప్రణాళికలు రచిస్తున్న మేధావులు జాతీయ సంపదలో దళితుల వాటా గురించి చర్చించాలి. జాతీయ సంపద లూటీ అయినప్పుడు, ప్రైవేటీకరణ జరిగినప్పుడు ఎక్కువగా నష్ట పోతున్నది దళిత జాతి. ఇటీవల ఆశ్రితులకు 12.5 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసినప్పుడు, ఓడరేవులను, విమానాశ్రయాలను, గనులను అక్రమంగా కొంత మందికి బదలాయించినప్పుడు జాతికి జరిగిన నష్టం ఎంత? అందులో దళితుల వాటా ఎంత? మోదీ ఆర్థిక చర్యల వలన దళితులకు వచ్చిన ప్రయోజనం ఏమిటి?
కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ప్రవేశ పథకాన్ని పెట్టినప్పుడు దళితులకు కేటాయించిన శాతం ఎంత? జాతి సంపదను అదానికి ఇవ్వడాన్ని సమర్ధించే వాళ్ళు రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లని ప్రశ్నిస్తున్నారు? జాతి సంపద, దళిత అభివృద్ధి పరస్పరం ఆధారపడిన అంశాలు. జాతి సంపదను కోల్పోతే దళిత అభివృద్ధి జరగదు.
దళితబంధు లేదా అంతకంటే ఉత్తమమైన పథకాన్ని జాతీయ స్థాయిలో ప్రవేశం పెట్టడానికి దళితులు పోరాటం చేయకపోతే. మతాలవారిగా, ఉప కులాలవారీగా దళిత జాతిని చీల్చే అవకాశాలు ఉన్నాయి. సంక్షేమం, ఆర్ధిక అభివృద్ధి. ఉద్యోగ కల్పన లాంటి అంశాలు కాకుండా మతాల వారీగా విడిపోయి అభివృద్ధికి సంబంధం లేని అంశాలపై కలహించాల్సిన పరిస్థితులు ఏర్పరచాలని మత వాదులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి పరిస్థితులు దళితులకు మాత్రమే కాకుండా పీడిత వర్గాలకు కూడా నష్టం కలిగిస్తాయి.
– Madhavaram Nagendar Rao