BJP | ఆగ్రహంలో ఆ.. ఆరుగురు? బీజేపీలో కొనసాగడంపై అంతర్మథనం!
BJP | అధిష్ఠానం పెద్దలపై సీనియర్ నేతల అలక అమిత్‌షాతో భేటీకి అడ్డుపడటంపై గుస్సా అనుచరులతో అసమ్మతి నేతల భేటీలు పార్టీ మారాలని అనుయాయుల ఒత్తిడి! విధాత, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి వలస నేతలు షాక్ ఇచ్చేలా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సదరు నేతలు.. తమ వాదన వినిపించుకునేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇక బీజేపీలో ఉండటం వల్ల […]

BJP |
- అధిష్ఠానం పెద్దలపై సీనియర్ నేతల అలక
- అమిత్‌షాతో భేటీకి అడ్డుపడటంపై గుస్సా
- అనుచరులతో అసమ్మతి నేతల భేటీలు
- పార్టీ మారాలని అనుయాయుల ఒత్తిడి!
విధాత, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి వలస నేతలు షాక్ ఇచ్చేలా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సదరు నేతలు.. తమ వాదన వినిపించుకునేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇక బీజేపీలో ఉండటం వల్ల లాభం లేదన్న అభిప్రాయానికి సదరు నేతలు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది.
ఇతర పార్టీల నుంచి వచ్చిన తమను కలుపుకొని పోవడం లేదన్న ఆగ్రహంతో ఈ నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆరుగురు సీనియర్ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రవీంద్ర నాయక్, రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డిలు ఒక సీనియర్ నాయకుడి ఇంట్లో సమావేశమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీజేపీలో ఉండటం వల్ల అవమానాల పాలు కావడమే కానీ గౌరవం ఏనాటికీ దక్కదన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
కేసీఆర్‌పై కోపంతో బీజేపీలోకి!
కాంగ్రెస్, బీఆరెస్ పార్టీలకు చెందిన ఈ సీనియర్ నేతలు కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా వివిధ సందర్భాలలో బీజేపీలో చేరారు. రాష్ట్రంలో బీఆరెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలబడుతుందని ఆశించారు. కానీ నేతలకు ఆశాభంగమే ఎదురైంది. పైగా బీజేపీ, బీఆరెస్ మధ్య అవగాహన కుదిరిందన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడటం కూడా వారిని అంతర్మథనంలోకి నెట్టింది.
తాము కాంగ్రెస్, బీఆరెస్‌లను వీడి బీజేపీలో చేరిందే కేసీఆర్‌ను ఓడించడానికైతే.. అందుకు భిన్నంగా పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్నదని అభిప్రాయపడుతున్న ఈ నేతలు.. తమ అభిప్రాయాన్ని పలువురు పార్టీ పెద్దలకు చేరవేశారని తెలుస్తున్నది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలోనే మీడియా వద్ద బీజేపీ అధిష్ఠానంపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు రాష్ట్ర పార్టీ నేతలు తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న భావనలో ఉన్నారని సమాచారం. తమను పట్టించుకోవడం లేదని బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. నాడు సంజయ్‌పై ఫిర్యాదు చేసిన నేతల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. అప్పట్లో ఈటల కూడా బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం ఊపందుకున్నది.
అయితే బీజేపీ అధిష్ఠానం జోక్యం చేసుకోవడంతో ఈటల అలక మానారని సమాచారం. ఆ సమయంలో ఈటలతో పాటు ఈ ఆరుగురు నేతలు కూడా మౌనం దాల్చారు. బండి సంజయ్ మార్పు తరువాత ఈటలకు బీజేపీలో ప్రాధాన్యం పెరిగిందని చెబుతున్నారు. అయితే ఇతర నేతలు తమను బీజేపీ పెద్దలు పట్టించుకోవడంలేదన్న అసంతృప్తితోనే ఉన్నట్టు సమాచారం.
పేరుకు పదవులు ఇచ్చారు కానీ కనీసం తమ నాయకులకు పార్టీ కార్యకలాపాలపై సమాచారం కూడా ఇవ్వడం లేదని వారి అనుచరులు వాపోతున్నారు. కిషన్‌రెడ్డి ఇటీవల చేపట్టిన దీక్షకు కూడా ఈ ఆరుగురికి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడా నికి హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసేందుకు ఈ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా.. కలువనీయ లేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌లతో మాత్రమే సమావేశమయ్యారని, అలాంటప్పడు తాము పేరుకే జాతీయ నాయకులం కానీ తమకు ప్రాధాన్యం ఏదని తీవ్ర ఆవేదనలో ఉన్నట్టు చెబుతున్నారు.
మనం ఎన్నాళ్లున్నా ఈ పార్టీలో మన పరిస్థితి ఇంతేనన్న అభిప్రాయానికి వచ్చిన ఈ నేతలు పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. ఈ నేతల విషయంపై బీజేపీ అధిష్ఠానం కూడా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ నేతలు పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న తీరుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.