ర‌త‌న్ టాటాకు ముప్పు ఉంద‌ని ఎంబీఏ విద్యార్థి బెదిరింపులు..

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ర‌త‌న్ టాటాకు బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది.

ర‌త‌న్ టాటాకు ముప్పు ఉంద‌ని ఎంబీఏ విద్యార్థి బెదిరింపులు..

ముంబై : ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ర‌త‌న్ టాటాకు బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ వారం ఆరంభంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ముంబై కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి.. ర‌త‌న్ టాటాకు ముప్పు ఉంద‌ని హెచ్చ‌రించిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ర‌త‌న్ టాటాకు భ‌ద్ర‌త పెంచాల‌ని, లేదంటే ఆయ‌న‌కు కూడా సైర‌స్ మిస్త్రీలాగే అవుతుంద‌ని ఫోన్‌లో బెదిరించిన‌ట్లు పేర్కొన్నారు.


దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ర‌త‌న్ టాటాకు భ‌ద్ర‌త పెంచారు. త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే ఫోన్ చేసిన వ్య‌క్తి వివ‌రాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. క‌ర్ణాట‌క నుంచి బెదిరింపు కాల్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఎంబీఏ చ‌దివిన విద్యార్థి ఫోన్ చేశార‌ని, త‌క్ష‌ణ‌మే అక్క‌డికి వెళ్లి అత‌న్ని అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం అత‌ను ఇంటి నుంచి వెళ్లిపోయిన‌ట్లు తేలింది. అయితే ఆ వ్య‌క్తికి సిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధి ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు.


టాటా స‌న్స్ మాజీ చైర్మ‌న్ అయిన సైర‌స్ మిస్త్రీ గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. అహ్మ‌దాబాద్ నుంచి ముంబై వెళ్తుండ‌గా ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో మిస్త్రీతో పాటు కారులో ఉన్న మ‌రో వ్య‌క్తి కూడా ప్రాణాలు కోల్పోయారు.