సందేశ్‌ఖాలీ సరే.. బ్రిజ్‌భూషణ్ సంగతేంటి?
సందేశ్‌ఖాలీ విషయంలో మమత సర్కారుపై విమర్శల దాడికి దిగిన ప్రధాని నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది

- బిల్కిస్‌బానో రేపిస్టులకు మరణశిక్ష ఏది?
- మోదీపై టీఎంసీ ఆగ్రహం
కోల్‌కతా: సందేశ్‌ఖాలీ విషయంలో మమత సర్కారుపై విమర్శల దాడికి దిగిన ప్రధాని నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మహిళలను చావబాదుతుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. నారీశక్తి వందన్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా బెంగాల్‌లోని బరాసత్‌లో మాట్లాడిన ప్రధాని.. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మహిళలకు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదని, కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం లైంగిక దాడులకు పాల్పడిన వారికి యావజ్జీవ కారాగారం విధించాలని నిర్ణయించిందని గొప్పగా చెప్పుకొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లు సులభంగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విమెన్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తే.. దానిని బెంగాల్‌లో పనిచేసేందుకు తృణమూల్ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని కూడా ఆరోపించారు.
దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు గట్టగా కౌంటర్ ఇచ్చారు. ‘మీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళలను ఢిల్లీ పోలీసులు చితకబాదినప్పుడు మీ హెల్ప్‌లైన్ ఏమైంది?’ అని నిలదీశారు. మహిళా రెజ్లర్లపై లౌంగిక వేధింపులకు పాల్పడ్డాడని బీజేపీలో శక్తమంతమైన ఎంపీగా పేరున్న బ్రిజ్‌భూషణ్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా తొలగించాలని ఢిల్లీలో ఆందోళనకు దిగారు. ఆ కేసులో చార్జిషీటు దాఖలైనా.. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయలేదు.
ఇక రేపిస్టులకు మరణశిక్ష విధిస్తున్నామన్న మోదీ వ్యాఖ్యలనూ ఆమె తిప్పికొట్టారు. ‘మీ పార్టీ కార్యకర్తలు సన్మానం చేసిన.. బిల్కిస్ బానో రేపిస్టులకు ఉరిశిక్ష ఏది?’ అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ నాయకుడు సువేందు అధికారికి వ్యతిరేకంగా కోల్‌కతాలో సిక్కు మహిళలు చేసిన నిరసన ప్రదర్శన దృశ్యాలను సైతం ఆమె షేర్ చేశారు. సువేందు అధికారి ఖలిస్తానీ వ్యాఖ్యలపై నిరసనగా సిక్కుమహిళలు రోడ్డెక్కి నిరసనలు చేశారని, ప్రధాని తమను కలిసి, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరినా మోదీ పట్టించుకోలేదని విమర్శించారు.