Singareni: RTC మాదిరిగా సింగరేణిలో ఎన్నికలు లేకుండా చేసే కుట్ర
కాల పరిమితి ముగిసి నాలుగేళ్లు దాటినా ఎన్నికలు నిర్వహించరా? ఎన్నికలు నిర్వహించకపోతే సమ్మె నోటీసు ఇస్తాం ఎన్నికల నిర్వహణ చేతకాకపోతే గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలను రద్దు చేయండి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య విధాత బ్యూరో, కరీంనగర్: ఆర్టీసీ మాదిరిగా సింగరేణిలో ఎన్నికలనేవి లేకుండా చేసే కుట్ర జరుగుతోందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించని […]

- కాల పరిమితి ముగిసి నాలుగేళ్లు దాటినా ఎన్నికలు నిర్వహించరా?
- ఎన్నికలు నిర్వహించకపోతే సమ్మె నోటీసు ఇస్తాం
- ఎన్నికల నిర్వహణ చేతకాకపోతే గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలను రద్దు చేయండి
- సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య
విధాత బ్యూరో, కరీంనగర్: ఆర్టీసీ మాదిరిగా సింగరేణిలో ఎన్నికలనేవి లేకుండా చేసే కుట్ర జరుగుతోందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించని పక్షంలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి సమ్మె నోటీసు ఇస్తామని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు. శనివారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్‌లో జరిగిన ఏఐటియుసి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించడం చేతకాక పోతే వెంటనే గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలను రద్దు చేసి అన్ని కార్మిక సంఘాలతో కార్మికుల సమస్యల పై సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు సంవత్సరాలు కావస్తున్నదని, కాలపరిమితి ముగిసి నాలుగు సంవత్సరాలు గడిచిందని ఆయన గుర్తు చేశారు.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల నిర్వహణ కోసం ఏఐటీయూసీ అనేక దఫాలుగా పోరాటాలు చేసి, చివరికి హైకోర్టు మెట్లెక్కడం జరిగిందన్నారు. తమ అప్పీలుపై స్పందించిన కోర్టు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని తీర్పు చెప్పిందని అన్నారు. కోర్టు ఆదేశాలకు లోబడి సింగరేణి ఎన్నికల నిర్వహణ కోసం చీఫ్ లేబర్ కమిషనర్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ను రిటర్నింగ్ అధికారిగా నియమించిందని అన్నారు.
మార్చి13న రిటర్నింగ్ అధికారి హైదరాబాద్ లో అన్ని కార్మిక సంఘాలతో ఎన్నికల సన్నద్ధ సమావేశం నిర్వహించి, యాజమాన్యం నిర్ణయం కోసం ఏప్రిల్ 2 న తిరిగి మరో సమావేశం ఏర్పాటు చేస్తారన్నారు. ఈ లోగానే యాజమాన్యం ప్రొడక్షన్ పీరియడ్ పేరుతో ఎన్నికలు రెండు నెలలు వాయిదా వేయాలని కోర్టుకు వెళ్ళడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. దీన్ని బట్టి సింగరేణి యాజమాన్యానికి ఎన్నికలంటే ఇష్టం లేదని,తమకు తొత్తుగా ఉన్న టిబిజికేఎస్ తో అంటకాగుతూ, ఆర్టీసీలో మాదిరిగా సింగరేణి లో కూడా ఎన్నికలు రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగక పోవడం వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, సింగరేణిలో ఓపెన్ కాస్ట్ లతో పాటు అండర్ గ్రౌండ్ లలో కాంట్రాక్టీకరణ వల్ల కార్మికులపై పని భారం పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణిలో కొన్ని కార్మిక సంఘాలకు పైకి ఎన్నికలు పెట్టాలని ఉన్నా, లోపల మాత్రం తమ గెలుపు పై అనుమానంతో ఎన్నికలు లేకుంటేనే మంచిదనే అభిప్రాయం ఉందని ఆయన అన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక జరపాలన్న ఆసక్తి సింగరేణికి లేకపోతే, ఎన్నికలు రద్దు చేసి అన్ని కార్మిక సంఘాలతో కార్మికుల సమస్యల పై సంప్రదింపులు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, నాయకులు ఎస్.వెంకట్ రెడ్డి, బోగ సతీష్ బాబు, ఉప్పులేటి తిరుపతి, తాని రాజబాబు, జి.ప్రభుదాస్, డి.సారయ్య, ఆకునూరి శంకరయ్య, బండారి కనకయ్య, రమేష్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, డి.సాయన్న, చక్రపాణి, రాజన్న, వినయ్, సిరిసిల్ల మల్లేశ్, మోరె సమ్మన్న, సంగి సమ్మయ్య, ఆఫీసు కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.