TS Assembly | ఉన్న తెలంగాణను ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్సే: సీఎం కేసీఆర్‌

TS Assembly విధాత: ఉన్న తెలంగాణను ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్‌ పార్టీయేనని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులనుద్దేశించి సీఎం మాట్లాడారు. ‘ఇక్కడో విషయం స్ఫురణకు తెచ్చుకోవాలి. కాంగ్రెస్‌ సభ్యులు కూడా తనతో ఏకీభవిస్తారనుకుంటున్నా. రాష్ట్ర సాధన అనే విషయం 58 ఏండ్ల సుధీర్ఘ పోరాటం. ఒకరోజుతో, ఒక నాయకుడితో వచ్చింది కాదు. ఈ సుదీర్ఘ పోరాటానికి ఆద్యులు […]

  • By: krs    latest    Aug 06, 2023 2:20 AM IST
TS Assembly | ఉన్న తెలంగాణను ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్సే: సీఎం కేసీఆర్‌

TS Assembly

విధాత: ఉన్న తెలంగాణను ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్‌ పార్టీయేనని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులనుద్దేశించి సీఎం మాట్లాడారు. ‘ఇక్కడో విషయం స్ఫురణకు తెచ్చుకోవాలి. కాంగ్రెస్‌ సభ్యులు కూడా తనతో ఏకీభవిస్తారనుకుంటున్నా. రాష్ట్ర సాధన అనే విషయం 58 ఏండ్ల సుధీర్ఘ పోరాటం. ఒకరోజుతో, ఒక నాయకుడితో వచ్చింది కాదు.

ఈ సుదీర్ఘ పోరాటానికి ఆద్యులు ఎవరు ? ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఇదే కాంగ్రెస్‌ పార్టీ. జవహర్‌లాల్‌ నెహ్రూ. ఇది చరిత్ర. దీన్ని ఎవరూ కాదనలేరు. ఉన్న తెలంగాణ ఉన్నట్టే ఉంటే.. ఎప్పుడు ఎక్కడుండునో.. ఏ దిశలో ఉండునో. తొమ్మిదేళ్లలో ఇంత స్థాయికి వచ్చాం. ఎవరూ ఏం మాట్లాడినా.. ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా.. టీకా టిప్పన్‌ చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం గానీ, ఒక అడ్మినిస్ట్రేషన్‌ యూనిట్‌ గానీ, దేశం గానీ పెరుగుదల ఉందా? తరుగుదలా ఉందా ? అనే దానికి కొన్ని గీటురాళ్లు ఉంటాయి’ అన్నారు.

సమ్మిళిత అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి

‘ఇందులో ప్రధానంగా చూసేది తలసరి ఆదాయం. తలసరి ఆదాయం ఎంత పెరిగితే అంత ఆ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరిగణిస్తరు. తెలంగాణ ఏర్పడిన రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది. ఏర్పాటు తర్వాత పెద్ద రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం. మన తలసరి ఆదాయం రూ.3.12లక్షలు ఉంటే.. మనం ఏ రాష్ట్రం నుంచి మనం విడిపోయామో.. ఎవరైనా మనల్ని ఎకసెక్కాలు పలికారో.. మీకు పరిపాలన రాదు అన్నారో వారి తలసరి ఆదాయం రూ.2.19లక్షలు. రెండురాష్ట్రాల మధ్య రూ.లక్ష వరకు తేడా ఉంది.

ఏపీ, తెలంగాణ పదేళ్ల కింద వచ్చిన రాష్ట్రాలు. దాన్ని మించి చాలా స్థిరపడి, చాలాబలంగా ఉండి ఆర్థిక రాజధాని ముంబయి ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌ మోడల్‌ అని దేశాన్ని గోల్‌మాల్‌ చేసి ప్రధానిని సంపాదించిన గుజరాత్‌ రాష్ట్రం కావచ్చు. ఎప్పటి నుంచో స్థిరపడి 70 ఏళ్లుగా ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మనకన్నా పెద్ద రాష్ట్రాలు. ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానా రాష్ట్రం కావచ్చు.

వీటిన్నింటిని తలదన్ని ఎక్కువ మొత్తంలో తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నది తెలంగాణలోనే. ఇది అన్నింటికి ఇండికేటర్‌. అన్నిరకాల సమ్మిళితమైన అభివృద్ధి జరిగితేనే ఇది సాధ్యం కాదు. ఏ ఒక్క రంగానికే, ఓ ఒక్క వర్గానికో పనులు జరిగితే కాదు. రాష్ట్రంలో అన్నిరంగాలు సామూహికంగా సమ్మిళితంగా అభివృద్ధి జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇది ఇక్కడ విజయవంతంగా జరిగింది అనేదానికి సూచిక తలసరి ఆదాయం, తలసరి విద్యుత్‌ వినియోగం’ అని సీఎం చెప్పారు.

మనల్ని ముంచిందే ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌..

‘ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు ? దీనికి ఎవరు బాధ్యులు ? జవహర్‌లాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలో నాడు తెలంగాణ విద్యార్థులు, మేధావులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆరోజు ఉన్న కొండ వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వ్యతిరేకించినా ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. మాట్లాడితే భట్టి విక్రమార్క ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటరు. ఆ పార్టీ మన కొంపముంచింది. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్‌. ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. ఇది చరిత్రలో రికార్డయ్యింది. ఇక్కడి నుంచి విమానంలో వెళ్లే సమయంలో రామకృష్ణారావు తెలంగాణ తప్ప మరోమాట లేదని చెప్పారు.

ఢిల్లీలో బలవంతంగా ఒప్పించిన తర్వాత.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో నెహ్రూసాబ్‌ చెప్పిన తర్వాత ఏం మాట్లాడుతాం అన్నారు. ఇది కూడా చరిత్రలో ఉన్నది. ఇది కల్పిత కథ కాదు. ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్‌. ఆ తదనంతరం అనేక అగ్రిమెంట్లు, జంటిల్మన్‌ అగ్రిమెంట్‌ మరొకటి కావొచ్చు. విడిగొట్టిన సందర్భంలో ఇచ్చిన హామీలు కాలరాస్తే ప్రేక్షకపాత్ర వహించిందే కాంగ్రెస్‌ పార్టీ. చివరకు 1969 ఉద్యమం. ఎంత కర్కషంగా వ్యవహరించింది కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ పట్ల. 56 ఏళ్లలో ఊడగొట్టే సమయంలో అనేకమందిని జైళ్లలో జైళ్లల్లో పెట్టారు.

సిటీ కాలేజీ దగ్గర ఫైరింగ్‌ జరిగితే ఏడుగురు చనిపోయారు. దాన్ని ఖాతరు చేయకుండా ఆ రోజు కలిపేశారు. ఆ తర్వాత 1969 ఉద్యమం వస్తే ఉన్నతస్థాయికి తీసుకువెళ్లారు. చివరకు టీఎన్‌జీవోలు ఉద్యోగులూ ఉద్యమించారు. ఉద్యమ నేత ఆమోస్‌పై ఎస్మా, రకరకాల కేసులు పెట్టి జైలులో పెట్టి నిర్బంధించినా ఉద్యమించారు. తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే భద్రి విశాల్‌ పిట్టి తదితర నేతలు బకిట్లు పట్టుకొనిపోయి దుకాణాల్లో అడిగి.. ఉద్యోగులను కాపాడుకున్నారు. ఇదంతా చరిత్ర. ఎంత రాచి రంపాన పెట్టారో.. ఎంత మందిని కాల్చి చంపారో.. ఆ ఘనత చరిత్రంతా కాంగ్రెస్‌లో పోతది’ అంటూ విమర్శించారు.

మూగ.. మౌన ప్రేక్షకపాత్ర వహించింది తెలంగాణ కాంగ్రెస్సే..

1969లో చెన్నారెడ్డి, విద్యార్థులు, ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే.. చివరకు తెలంగాణ డెమొక్రటిక్‌గా 14 ఎంపీ స్థానాల్లో 11 మందిని గెలిపించి.. యావత్‌ తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి అంటే.. ఆ నాడు ఇందిరాగాంధీ నో తెలంగాణ అని నిరాకరించారు. ఇది కాంగ్రెస్‌ చరిత్రనే. ఆ తర్వాత ముల్కీ రూల్స్‌ కొల్లగొట్టబడి.. ఉద్యోగాలు మొత్తం మాయమై.. నీళ్లు మొత్తం పోతావుంటే.. తట్టుపుట్టడు మన్ను తీసి ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి ప్రాజెక్టులను పెండింగ్‌లో పెడితే ఉంటే కూడా మూగ, మౌన ప్రేక్షకపాత్ర వహించింది కూడా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలే.

తెలంగాణ ఎంత యాతనను అనుభవించిందో..? ఎంత బాధను అనుభవించిందో.. ఎంత మంది విద్యార్థులు, యువకులను కోల్పోయిందో.. 69లో కళాశాలలు, హాస్టల్స్‌లో అన్ని జైళ్లుగా మారాయి. 41 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచింది. ఇది చరిత్రలో మరిపోలేం. ఈ సందర్భంగా మనం పునశ్చరణ చేసుకోక తప్పదు. తెలంగాణ సమాజానికి జ్ఞప్తికి తేవాల్సిన బాధ్యత మాపై ఉన్నది’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

చంద్రబాబు పాలనలోనూ ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ది మౌన ప్రేక్షకపాత్రే

చంద్రబాబు పాలనలో పత్రిపక్షంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్‌ పార్టీ మౌన ప్రేక్షకపాత్ర వహించిందని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘టీడీపీ హయాంలో తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారాయి. నాడు స్పీకర్‌ స్థానంలో కూర్చున్న వ్యక్తి.. ప్రణయ్‌ భాస్కర్‌ అనే ఎమ్మెల్యే తెలంగాణ అంటే.. నో నో తెలంగాణ అనే పదం వాడకూడదని రూలింగ్‌ ఇచ్చిన స్థాయికి దిగ జారింది.

ఆ రోజు కూడా మౌన ప్రేక్షకపాత్ర పోషించింది కాంగ్రెస్‌ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వీళ్ల నోర్లు మెదలలేదు. చివరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా సమయంలో సంస్కరణ ముసుగులో విద్యుత్‌ చార్జీలను పెంచారు. ఒక సంవత్సరం కాదు.. మూడేళ్లు 15శాతం పెరుగుతుందని చెబితే ఆ సమయంలో అప్పటికప్పుడే తాను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలో లేఖ రాశాను’ అని కేసీఆర్‌ గుర్తు చేశారు.

బాబు పాలనలో రైతులపై కాల్పులు..

‘ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులు బషీర్‌బాగ్‌లో నిరసన తెలిపేందుకు వస్తే పట్టపగలు ముగ్గురు కాల్పులు జరిపారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. చనిపోయిన వారు సైతం కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నేతలు ఓ మొఖదొరికిందని అందులోకి చొరబడి.. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలు దీక్ష చేపట్టారు. అంతకు మించి ఏమీ చేయలేదు.

ఆ తర్వాత సమైక్య రాష్ట్రంలో న్యాయం జరుగదని భావించి.. తాను కొంతమంది మిత్రులను కలిసి ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు.. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ నాయకులే తాపకొకరు బయలు దేరాలి.. జై తెలంగాణ అనాలే.. పిలిచి మంత్రి పదవి ఇవ్వగానే తెలంగాణ దుకాణం బంద్‌ చేయాలి. ఇది ఎట్లా తయారయ్యిందంటే.. ఉద్యమం అంటే నమ్మని పరిస్థితి వచ్చింది. వీళ్లు ఎక్కడ చేస్తరు ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది. అనేక దఫాలుగా ఉద్యమాలు చేపట్టి విరమించింది కాంగ్రెస్‌ నాయకులే’నని విమర్శించారు.

జెండా ఎగుర వేసి.. తెలంగాణ ప్రస్థానాన్ని ప్రారంభించాం..

‘ఐదారునెలలు సుదీర్ఘంగా చర్చలు జరిపి, మేధోమథనం చేసి ఎట్లా తెలంగాణ రావాలి. ఉద్యమం చేద్దామంటే ఎవరూ సహకరించే పరిస్థితి లేదు. అంతా కారు చీకటి అలుముకొని ఉంది. ఐదారు మాసాలు ఉద్యమపంథా నిర్ణయించుకొని చివరకు 2021 ఏప్రిల్‌, 27న స్వర్గీయ కొండా లక్ష్మణ్‌ గారు ఇంట్లో ఆశ్రయం ఇస్తే.. జెండా ఎగుర వేసి తెలంగాణ పై తెలంగాణ ప్రస్థానాన్ని ప్రారంభించాం. చాలా నిరాశ, నిస్పృహ ఉండేది. ఇంకెక్కడి తెలంగాణ ? ఎక్కడి నుంచి వస్తుంది ? జరిగే పనేనా ? అని నిరాశలో మాట్లాడే వారు.

నమ్మకం కలిగించేలా.. అవిశ్వాసం నుంచి ప్రజలు, యువకులను మేలుకొల్పేందుకు నేను పాట రాశాను. ‘సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే దేశానికి స్వాత్రంత్యం వచ్చేదా?.. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని’ నేను పాట రాశాను. అదే పద్ధతిలో రాజీలేని పోరాటం చేశాం. ఎక్కడ వెనక్కి పోలేదు. పార్టీని చీల్చే ప్రయత్నాలు చేశారు. హింసకు సైతం గురి చేశారు. ఎక్కడా వెనుదిరుగగుండా పోరాటం చేశాం. తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి తెలంగాణ వచ్చింది’ అన్నారు.

ఆ నాటి ముఖ్యమంత్రుల అవహేళనలు జీవితంలో మరిచిపోలేం

నాటి ముఖ్యమంత్రుల మాటలు, అవహేళనలు జీవితంలో మరిచిపోలేమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నాల్గో రోజు తెలంగాణ ఆవిర్భావం – సాధించిన ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఇదే శాసనసభలో కొన్ని ఘటనలు జరిగాయి.

2004లో అద్భుతంగా విజృంభిస్తున్నాం. అప్పటికి పది సంవత్సరాలవుతుంది కాంగ్రెస్‌ అధికారం కోల్పోయి. ఒక నిరాశ అలుముకున్నది. తెలంగాణ అంటే ఏమైనా నూకలు చెల్లుతయని చెప్పి.. తెలంగాణ ఇస్తం అంటే పొత్తు గలిసినం. ఉద్యమం ఢిల్లీకి తెలియాలని ఆలోచించి పొత్తు పెట్టుకున్నాం. కలిసిన తర్వాత కామన్‌ మినిమం ప్రోగ్రామ్‌లో, రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించాం’ అని గుర్తు చేశారు.

కుక్క తోక వంకర అన్నట్లు మళ్లీ పాత కథనే..

‘ఆ తర్వాత మళ్లీ దుకాణం మొదలైంది. కుక్కతోక వంకర అన్నట్లుగా మళ్లీ పాత కథనే. కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని రకాలుగా రాచిరంపాన పెట్టిందంటే.. ఆ నాటి ముఖ్యమంత్రుల మాటలు, అవహేళనలు జీవితంలో కూడా మరిచిపోలేం. సెకండ్‌ ఎస్సార్సీ మళ్లీ రావాలి? అని మాట్లాడటం.. తెలంగాణ కాంగ్రెస్‌ దానికి తబల కొట్టింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణలో పుడితే ఎంత బాగుండు అని అప్పటి జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడారు.

తెలంగాణలో పోలింగ్‌ అయిపోయాక నంద్యాల సభలో మాట్లాడుతూ.. తెలంగాణకు వెళ్లాలంటే మనం వీసా తీసుకోవాలి. తెలంగాణ అనే ప్రశ్నే లేదు అని చెప్పడు.. వీళ్లు మౌనంగా ఉండడం ఇదంతా నిజం కాదా? ఆ రోజు రేణుకాచౌదరి కేంద్రమంత్రిగా ఉన్నది. ఆమె చేసిన అవమానం అంతా ఇంతా కాదు. తెలంగాణ ఇచ్చేందుకు ఇదేమన్నా ఇన్‌స్టంట్‌ కాఫీనా..? దోషనా? అంత ఈజీనా? అంటూ అవమానించారు’ అన్నారు.

వైఎస్సార్‌ వ్యాఖ్యలు చేసినా మౌనపాత్ర వహించారు..

‘వైఎస్సార్‌ రాజశేఖర్‌రెడ్డి తాను తెలంగాణకు అడ్డం కాదు.. నిలువు కాదు ముసిముసి నవ్వులు నవ్వితే.. వీరంతా మౌనపాత్ర వహించారు. ఇది అన్నింటికీ పరాకాష్ట. సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఆయన చేసిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. చివరకు పరాకాష్టగా ఇదే శాసనసభలో.. భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలో శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నారు. ఇ

వాళ నేను నిలబడి ఉన్న స్థానంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి నిలబడి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకో పోండి అంటే ఒక్క కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే, మంత్రి లేచి అట్ల ఎట్లా అంటరు అని అడుగలేదు. బెల్లంకొట్టిన రాళ్లలెక్క కూర్చున్నరు తప్పా లేచి అడుగలేదు. సమైక్య రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా ఉండి అలా ఎలా అంటారని అడిగే సాహసం చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. అసెంబ్లీలో చూపించమంటే చూపిస్తాం’ అన్నారు.

బీజేపీది ఇదీ వరుస..

‘వీళ్లు ఇట్లంటే బీజేపీ వాళ్లు.. ‘బడేమియాతో బడేమియా.. చొటేమియా సుభానల్లా’ అన్నట్లుంది. ఒక ఓటు .. రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడలో తీర్మానం చేశారు. గడ్డకెక్కిన తర్వాత చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్‌ అయ్యాడు. వాజ్‌పేయి ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నారు. డిప్యూటీ ప్రధాని, హోంమంత్రిగా ఉన్న ఎల్‌కే అద్వానీ వచ్చి హైదరాబాదే తెలంగాణలో ఉంది.. తెలంగాణ ఎందుకు అని స్పీచ్‌ ఇచ్చిపోయారు.

ఇదే ఎన్‌డీయే మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. కాకినాడ తీర్మానాన్ని కాకి ఎత్తుకుపోయింది. ఎన్డీయే తెలంగాణ ఇవ్వలేదు. మీకెందుకు తెలంగాణ అంటూ బీజేపీ కించపరిచింది. వీటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరి వరకు పోరాడాలని తెగువతో.. పోతావుంటే.. పీసీసీ ప్రెసిడెంట్‌ సత్యనారాయణరావు అని ఉండే. మీకెక్కడిదయ్యా మాతోనే గెలిచారు.. మీది బతుకా? లెక్కనా.. మీదో పార్టీనా అని మాట్లాడితే.. నాకు పౌరుషం వచ్చి కరీంనగర్‌గా ఎంపీగా ఉన్న సమయంలో రాజీనామా చేశాను’ అని కేసీఆర్‌ గుర్తు చేశారు.

ఓడగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు..

‘కరీంనగర్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో నన్ను ఓడగొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వందకోట్లు ఖర్చుబెట్టి భయంకరమైన ప్రయత్నాలు చేశారు. కానీ, కరీంనగర్‌ జిల్లా ప్రజలు కాంగ్రెస్‌ చెంపలు చెల్లుమనేలా 2.50లక్షల మెజారిటీతో గెలిపించి మా తెలంగాణ మాకు కావాలని చెప్పారు. తెలంగాణ అంశం అంటేనే అవలోకగా తీసిపడేస్తే తీసిపారేశారు. ఇదే సభలో ఒంటరిగా ఎమ్మెల్యేగా ఉంటే ఉద్యోగాలు మీద మాట్లాడుతుంటే గోల్‌మాల్‌ చేశారు.

కేసీఆర్‌ ఎక్కడికి వెళ్తే పిల్లలరు లేస్తున్నరు.. కేసీఆర్‌ ఎక్కడికి వెళ్లినా వేలకొద్ది వస్తున్నరు అని.. గిర్‌గ్లానీ కమిటీ వేసింది. మళ్లీ కమిటీ ఎందుకు ? దగ్గరలోనే సెక్రటేరియట్‌ ఉంది.. 5గంటలకు గేట్‌ వద్ద అటుఒకరం ఇటుకొరం నిలబడుతాం.. చేతిలో ఆనపుకాయ చేతిలో పట్టుకుందాం.. అందులో నుంచి వచ్చిన వారిని ఇదేందని అడిగితే.. ఆనపుకాయ అన్నవారు తెలంగాణ, సోరకాయ అన్నోడు ఆంధ్రా.. ఇంకేముంది. దీని కోసం కమిటీయా? ఇది సత్యం. ఇదే సభలో మాట్లాడాను.

ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి.. గోల్‌మాల్‌ చేయడం వల్ల 58 సంవత్సరాలు.. సుమారు ఆరు దశాబ్దాలు సర్వస్వం కోల్పోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైన బాధలు అనుభవించారు. 20, 30 ఎకరాల భూమి ఉన్న నల్గొండ, నారాయణఖేడ్‌, మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఆటోరిక్షాలు నడిపిన పరిస్థితి. ఇంత దయనీయంగా పరిస్థితులు ఉండేవి. మనందరం వాటికి సాక్ష్యమే’ అన్నారు.

‘కేసీఆర్‌ శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్ర’ తేలాలని నిరాహార దీక్ష

‘రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ వైపు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే.. ఆయన 14ఎఫ్‌ను తీసుకువచ్చారు. మళ్లీ సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టాం. 3, 4లక్షల మందిని సమీకరించాం. ఇట్లయితే తెలంగాణ వచ్చేటట్టు లేదు. మంచో చెడో తేల్చుకుందామని ‘కేసీఆర్‌ శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్ర’నో ఏదో ఒకటి జరగాలని చెప్పి నిరాహార దీక్షకు ఉపక్రమించాను.

నిరాహార దీక్ష చేస్తే అరెస్టు చేసి ఖమ్మం జైలులో వేసి.. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. చివరకు వీడు చస్తడా? అప్రతిష్ట పాలవుతామనుకున్నారు. లోక్‌సభలో ములాయం సింగ్‌ యాదవ్‌ తెలంగాణకు అనుకూలంగా లేకపోయినా.. తెలంగాణ ఇవ్వాలని మాట్లాడితే.. 38 పార్టీలో గోల చేస్తే తట్టుకోలేక చిదంబరంతో ప్రకటన చేయించారు.

తెలంగాణ ప్రక్రియ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నామని చెప్పి.. ఆంధ్రా లాబీయింగ్‌ ఒత్తిడి చేయగానే మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ప్రకటన చేసింది కాంగ్రెస్సే.. మళ్లీ వెనక్కి తీసుకున్నది కాంగ్రెస్సే. అలా వెనక్కి తీసుకోవడం వల్ల మళ్లీ దాదాపు వందలాది మంది విద్యార్థులు చనిపోయారు. చేరాల యాదయ్య, ఇషాన్‌రెడ్డి, శ్రీకాంతచారిలాంటి వారు చనిపోతున్నా పట్టించుకోలేదు. నమ్మకం కలిగించే శాంతి వచనాలు చెప్పలేదు. ఉద్యమాన్ని కొనసాగిస్తూ వెళ్లాం.

ఆ తర్వాత వైఎస్సార్‌ గతించడం.. ఆ తర్వాత జగన్‌ను ర్యాంగ్‌ హ్యాండిల్‌ చేయడం.. వేధింపులకు గురి చేయడంతో సొంత పార్టీ స్థాపించుకున్నరు. ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే 4, 5 లక్షల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఒకటి రెండు ఎన్నికలు వస్తే స్వీప్‌ చేయడంతో ఆంధ్రాలో మన పని అయిపోయిందని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చారు. 2014లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురుగాలి. ఫలితాలు కూడా అవే వచ్చాయి. తెలంగాణ ఇస్తేనైనా పది సీట్లు రాకపోతయా? అని ఇచ్చారు. తెలంగాణపై ఏనాడూ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎవరు ఎన్ని చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం’ అని కేసీఆర్‌ అన్నారు.

దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పే స్కేల్‌

దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పే స్కేల్‌ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావం – సాధించిన ప్రగతిపై చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్‌ అలవికాని హామీలు ఇచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి ప్రకటించారు. పైసలు లేవ్‌.. ఏం చేద్దాం.. ఎస్టీ, ఎస్టీఫండ్స్‌ డైవర్ట్‌ చేసి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి. చేయగలిగిందే చెప్పాలి. చెప్పింది చేయాలి ఈ పద్ధతి ఉండాలి. నాలుగు ఓట్ల కోసం ఇష్టం వచ్చింది చెప్పి.. అలవికాని హామీలు ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇచ్చే పెన్షన్‌ ఎంత ? రాజస్థాన్‌లో ఇచ్చేదెంతా?.. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4వేలు పెన్షన్‌ ఇస్తరా? ప్రజలను అడిగితే చెప్పారు. చేస్తమంటున్నరు వస్తరా అంటే యాళ్లకు లావడితే ఎట్ల అంటున్నరు. ఇంతకు ముందు అనుభవాలు ఉన్నాయి’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

చెప్పింది చేశాం.. పెన్షన్లు ఎలా పెంచాలో పెంచుతాం..

‘ఉమ్మడి రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్‌ పార్టీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మేం కాంగ్రెస్‌ అంత గొప్పోళ్లం కాదు. మేము మాత్రం రూ.లక్ష వరకు చేస్తామని చెప్పారు. గుద్దుడు గుద్దితే మేం 80 సీట్లు గెలిచాం.. వాళ్లు 19 సీట్లు గెలిచారు. అలవికానివి చెబితే ఎవరూ నమ్మరు. ఏ విధంగా పెన్షన్‌ ఎలా పెంచాలో పెంచుతాం. ఒకటేసారి పెంచలేం. క్రమానుగతంగా తీసుకెళ్తాం. మా దగ్గర ఇంకా గంపెడున్నయ్‌. మా దగ్గర చాలా అస్త్రాలున్నాయ్‌. మా అమ్ములపొదిలో చాలా అస్త్రాలు ఉన్నయ్‌.

రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేం. సంక్షేమాన్ని అమలు చేస్తున్నది మేము. రెండేళ్ల నుంచి రూ.2వేలు ఇస్తున్నాం. మొదట వెయ్యి ఆ తర్వాత రూ.2వేలు ఇచ్చాం. కల్యాణలక్ష్మిలో మొదట రూ.50వేలు.. ఆ తర్వాత రూ.లక్ష ఇచ్చాం. గొర్ల యూనిట్లకు సైతం రూ.1.75లక్షలకు పెంచాం. రైతుబంధు రూ.4వేలతో మొదలు పెట్టి.. రూ.5వేలకు పెంచాం. రాబోయే రోజుల్లో ఎంత దూరం పెంచగలుగుతమో అంత వరకు పెంచుతాం’ అని తెలిపారు.

దేశంలో అత్యధిక వేతనాలు పొందేది తెలంగాణ ఉద్యోగులే..

‘భారత్‌లో అత్యధికంగా సాలరీలు పొందేది తెలంగాణ ఉద్యోగులు. ఉద్యమ సమయంలో నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పాం.. మాటను నిలబెట్టుకున్నాం. మాకు మానవీయ దృక్పథం ఉన్నది. కాంగ్రెస్‌, మరెవరి పార్టీలో ఇవ్వలేదు. 30శాతం పీఆర్సీ ఉద్యోగులకు ఇస్తే.. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం 30శాతం జీతాలు పెంచాం.

భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి పెంచడం. శాసనసభలో పని చేసే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం పెంచాం. ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాం. తక్కువ సమయంలో పీఆర్సీ అపాయింట్‌ చేస్తాం. మా ఉద్యోగులు చమటోడుస్తున్నరు. మా ఇంజినీర్ల పుణ్యం ప్రాజెక్టుల్లో నీళ్లు కనబడుతున్నయ్‌. మా ఫారెస్ట్‌ ఆఫీసర్ల పుణ్యంతో వనాలు పెరుగుతున్నయ్‌. వ్యవసాయ అధికారుల పుణ్యంతో కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది’ అన్నారు.

బ్రహ్మాండంగా జీతాలు పెంచుకుంటాం..

‘అనేక రకాల రెగ్యులరేటరి అధికారులు, ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నరు. కమర్షియల్‌ టాక్స్‌ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది ? ఒకనాడు ఎంత నేడు ఎంత ? రిజిస్ట్రేషన్స్‌లో ఒకనాడు ఆదాయం ఎంత.. ఇవాళ ఎంత ? ఉద్యోగులు శ్రమతో డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి.. వాళ్ల సొమ్ములో వారికి వాటా ఇచ్చి.. ప్రజలతో పాటు కడుపునిండా అన్నం పెట్టుకుంటున్నాం. దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పే స్కేల్‌ ఇస్తాం.

బ్రహ్మాండంగా జీతాలు పెంచుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు సమకూరిస్తే ఇస్తేం. ఉద్యోగులు మా పిల్లలే. రాష్ట్రం ధనికమైతే.. వాళ్లు ధనికులు కావాలి. వారికి నాలుగు రూపాయలు కావాలి. తక్కువ సమయంలోనే ఐఆర్‌ ఇచ్చి.. పీఆర్సీ అపాయింట్‌ చేస్తాం. రెకమెండేషన్‌ను బట్టి.. మరోసారి దివ్యంగా పెంచుతాం. ఇప్పటికే 70శాతం పెంచుకున్నాం. మళ్లీ మంచి పర్సంటేజీతో జీతాలు పెంచుతాం’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవాలనుకుంటే.. దీనికి సంబంధించిన బిల్లుపై గవర్నర్‌ తెలిసీ తెలియ వివాదం చేశారని సీఎం వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొందరు ఆరోపణలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్నరోజుల్లో ఆర్టీసీ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. మరిన్ని డిపోలు పెడతామన్నారు. యువ ఐఏఎస్‌లను నియమించి సంస్థను అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.