Telangana: డీలిమిటేషన్ పై.. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ తీర్మానం

  • By: sr    news    Mar 27, 2025 2:04 PM IST
Telangana: డీలిమిటేషన్ పై.. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ తీర్మానం
  • కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి
  • కేంద్రం వైఖరితో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం
  • తెలంగాణ అఖిలపక్షాలతో త్వరలో సమావేశం

విధాత ప్రత్యేక ప్రతినిధి: లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధివిధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అసెంబ్లీలో స్వయంగా ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం వివరాలు ఇలా ఉన్నాయి.

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని సభ కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాపంగా మారకూడదు. జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశ్యంతో చేపట్టిన 42, 84 మరియు 87వ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదనే చెప్పుకోవాలి. జనాభా నియంత్రణ అమలు చేయటం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. అందుకే, నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటేప్రామాణికం కాకూడదు. పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి.రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని ఇప్పుడున్ననియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి.

తాజాజనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. అంతే కాకుండా, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశ పెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్నికోరుతోందని రేవంత్ రెడ్డి ఈ తీర్మానంలో స్పష్టం చేశారు.


బిజెపి.. ద్వంద ప్రమాణాలు

డీలిమిటేషన్ సమస్యపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఇటీవల సమావేశం జరిగిందని వివరించారు. ఈ సమస్యపై కొందరు కేంద్ర మంత్రులు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ద్వంద ప్రమాణాలు పాటిస్తుందని విమర్శించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంపొందించేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే మరోవైపు జమ్మూ కాశ్మీర్లో, సిక్కిం లో తమ రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ ప్రక్రియను కొనసాగించిందని గుర్తు చేశారు. కాబట్టి బిజెపి నాయకులు చెబుతున్న విషయాలు అబద్దాలను తేలిపోతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను, అన్ని రాజకీయ పక్షాలను, ప్రజాసంఘాలను ఈ విషయంపై ఐక్యం చేసేందుకు జానారెడ్డి, కేశవరావు, భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.