పార్లమెంటు ఎన్నికలకు సిద్దమవుతున్న కాంగ్రెస్
పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 25న జరిగే బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశానికి అధ్యక్షుడు ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

- ఈ నెల 25న బూత్ కమిటీ కన్వీనర్‌ల సమావేశం
- ముఖ్యఅతిధిగా హాజరు కానున్న అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
- 45 రోజుల్లో చేసిన పనిని ప్రజలకు వివరించేలా దిశానిర్దేశం
విధాత: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సిద్దమవుతోంది. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో ఏమీ చేశామో, వంద రోజుల్లో ఏమి చేయబోతున్నామో ప్రజలకు స్పష్టంగా వివరించేందుకు బూత్ స్థాయిలో కార్యకర్తలను సంసిద్దం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 25వ తేదీన ఎల్‌బీ స్టేడియంలో 40 వేల మంది బూత్ కమిటీ కన్వీనర్లతో సమావేశం నిర్వహిస్తోంది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా వస్తున్న జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 45 రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు. అలాగే 45 రోజుల పాలనపై నివేదికను రూపొందించి, ఆ కాపీలను సమావేశానికి హాజరైన సభ్యులందరికి అందించనున్నారు. ఈ మేరకు అధికారులు 45 రోజుల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై నివేదిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, ఆరోగ్యశ్రీ చికిత్స రూ.10 లక్షలకు పెంపు, ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణ, ప్రజా దర్భార్‌ల నిర్వహణ, ఉద్యోగ నియామకాల కోసం టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇవ్వడం, ధరణి సమస్యల అద్యయనానికి నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ, కమిటీ వరుసగా భేటీ అవున్న తీరు, కాళేశ్వరంపై విచారణ, విద్యుత్ ఒప్పందాలపై విచారణ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే అంశంపై కసరత్తు ఇలా ఈ 45 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాల గురించి బూత్ స్థాయి కార్యకర్తలకు వివరంగా తెలియజేసి, ప్రజల్లో ప్రచారం నిర్వహించేలా ఈ సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.