కౌలు రైతులకు సాయం ఎలా?.. సమస్యలు.. పరిష్కారాలు ఏమిటి?
కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో కీలకమైనవాటిలో ఒకటైన కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది

- అడ్డంకులేంటి? మార్గాలేంటి?
- కౌలు రైతులకు గుర్తింపే కీలక అంశం
- రాష్ట్రంలో 25 లక్షల కౌలు రైతులు!
- వీరిని గుర్తించేది లేదన్న బీఆరెస్ సర్కార్
- గతంలో రైతుబంధుకు నోచని కౌల్దార్లు
- సాయం అందించేందుకు కాంగ్రెస్ హామీ
- ప్రజాపాలన దరఖాస్తులో కౌలు రైతు ఆప్షన్
- కౌలు రైతుల గుర్తింపునకు ప్రత్యేక చట్టం
- దాని ద్వారానే కౌల్దార్లకు ఆర్థిక సహాయం
- మంత్రి సమీక్షలో న్యాయ నిపుణుల వెల్లడి!
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో కీలకమైనవాటిలో ఒకటైన కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. కౌలు రైతులకు సాయం అందించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించడంపై కేంద్రీకరిస్తున్నది. ముఖ్యంగా కౌలు రైతులకు గుర్తింపు అంశం కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మందికి పైగా కౌలు రైతులున్నారని అంచనా. వీరంతా భూ యజమానుల వద్ద భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. కానీ గతంలో బీఆరెస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కౌలు రైతులకు వర్తింపచేయలేదు.
పైగా రాష్ట్రంలో కౌలు రైతులను తాము గుర్తించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ పదే పదే చెబుతూ వచ్చారు. వారికి తాము రైతు భరోసా పేరిట రైతుల మాదిరిగానే ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించిన సమయంలో కేసీఆర్ తన వైఖరిని మార్చుకోలేదు. కౌలు అగ్రిమెంట్ అనేది భూ యజమానికి, రైతుకు మధ్య జరిగేదని, అలాంటప్పుడు తామెందుకు కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని ప్రశ్నించారు కూడా. ఇలా కౌలు రైతులను గుర్తించడానికి కేసీఆర్ నిరాకరించారు.
కౌలు రైతులకు సాయం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో
ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు కౌలు రైతులను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు తన ఎన్నికల మ్యానిఫెస్టోలో, రైతు డిక్లరేషన్‌లో కూడా స్పష్టం చేసింది. చేసిన వాగ్దానం మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన దరఖాస్తులలో కౌలు రైతుకు ఆర్థిక సహాయం అంశాన్ని ప్రత్యేకంగా పొందుపరిచింది. తాము కౌలు రైతులమంటూ అనేక మంది ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేశారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి అయిన తరువాత కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
గుర్తించడం ఎలా?
దరఖాస్తులైతే తీసుకున్నారు కానీ కౌలురైతును గుర్తించడం ఎలా? అన్న సమస్య సర్కారు ముందున్నది. ధరణికి ముందు పహాణీలో పట్టాదార్ కాలమ్, అనుభవదారు కాలమ్ ఉండేది. పట్టాదార్ కాలమ్‌లో భూ యజమాని పేరు, అనుభవదారు కాలమ్‌లో సాగుచేసే వారి పేర్లు ఉండేది. దీంతో కౌలుదారులకు, రక్షిత కౌలుదారులకు, ఇతర పద్ధతుల ద్వారా భూమి పొందిన వారి పేర్లను అనుభవదారు కాలంలో పొందుపరిచే వారు. ఆనాడు వీఆర్వోలకు ఏ భూమి ఎవరిది? ఏ భూమిలో ఎవరు కౌలుకు సాగు చేస్తున్నారో కూడా తెలిసేది.
ధరణి వచ్చాక అనుభవదారు కాలమ్ ఎగిరి పోయింది. వీఆర్వోల వ్యవస్థ రద్దు అయింది. దీంతో కౌలు రైతులకు సంబంధించి ఎలాంటి సమాచారం ప్రభుత్వం వద్ద లేకుండా పోయింది. దీంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కౌలు రైతులు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి ప్రజా పాలన దరఖాస్తులలో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చింది. వచ్చిన దరఖాస్తులను ఈ నెలాఖరులోగా స్క్రూట్నీ చేస్తారు. ఆ తరువాత పథకాల అమలు గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుంది.
ప్రత్యేక చట్టం తేవాలా?
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ధరణి చట్టం ప్రకారం కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు లేదు. పాత సర్కారు కౌలు రైతులను గుర్తించ నిరాకరించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కౌలు రైతులను గుర్తించాలంటే ప్రత్యేక చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ల్యాండ్ లైసెన్డ్స్ కల్టివేషన్ యాక్ట్ (ఎల్ఈసీ) తీసుకు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ చట్టం మేరకు ప్రభుత్వం కౌలుదారులను గుర్తించి, ఆర్థిక సహాయం చేయవచ్చునని అంటున్నారు.
ఇలా కాకుండా పక్క రాష్ట్రంలో చేసుకున్నట్లుగా కౌలు రైతుల గుర్తింపు చట్టం ఒకటి తెచ్చుకొని ఏ రైతు భూమి కౌలుకు చేసుకున్నా లీజు అగ్రిమెంట్ 11 నెలల కాలానికే వర్తించేలా చేసుకోవచ్చు. దీని ద్వారా భూ యజమాని, కౌలు రైతు ఇద్దరు ఒక నిర్ణీత ఫార్మాట్‌లో ఒప్పందం చేసుకొని గ్రామ స్థాయిలోని ప్రభుత్వ అధికారికి ఇస్తే సరిపోతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దాని ద్వారా కౌలు రైతులకు అందించే సహాయం అందించ వచ్చునని అంటున్నారు.
ఇలా కౌలు రైతులకు సహాయం ఏ విధంగా అందించాలన్న దానిపై ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డితోపాటు న్యాయనిపుణులు సునీల్‌తో కూడా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.