Niranjan Reddy | రుణమాఫీ గైడ్‌లైన్స్‌తో రైతుల్లో గందరగోళం: నిరంజన్‌రెడ్డి

రుణమాఫీపై గైడ్‌లైన్స్‌ గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీకి ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారని నిలదీశారు

Niranjan Reddy | రుణమాఫీ గైడ్‌లైన్స్‌తో రైతుల్లో గందరగోళం: నిరంజన్‌రెడ్డి

పట్టాదారు పుస్తకం ఉన్న రైతులందరికి రుణమాఫీ చేయాలి
రైతు భరోసాపై అబద్ధాలు చెబుతున్న ప్రభుత్వం
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : రుణమాఫీపై గైడ్‌లైన్స్‌ గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీకి ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారని నిలదీశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు రుణమాఫీపై ఆంక్షలను ప్రజలకు ముందే ఎందుకు చెప్పలేదని, మ్యానిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డుకు లింకు అసంబద్ధమైన ప్రక్రియ ఉందన్నారు. రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నిన్న రైతు రుణమాఫీకి పాసుపుస్తకమే ప్రామాణికమన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటల మేరకు గైడ్‌లైన్స్‌లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో మేం ఏలా చేశామో మీరు అదే పద్దతిలో రుణమాఫీ చేయాలని బీఆరెస్ డిమాండ్ చేస్తుందన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు..శ్వేతపత్రాలు..అవినీతి అంటూ హామీల ఎగవేతకు కప్పదాట్లు వేస్తుందన్నారు. రైతు రుణమాఫీకి రైతు పట్టదారు పాస్ పుస్తకమైనప్పుడు రైతుభరోసాకు కూడా ఎందుకు ప్రామాణికం కాదో చెప్పాలన్నారు. గుట్టలకు రైతుబంధు గతంలో పొంది ఉంటే రుణాలు కూడా వాటికే పొందినట్లని, అలాంటప్పుడు రైతుభరోసాపై ప్రభుత్వం చెప్పేదంతా అబద్దాలుగా భావించాల్సివస్తుందని, రైతుభరోసా ఇవ్వలేక దాటవేసే ప్రయత్నమని విమర్శించారు. పాస్‌బుక్‌ ప్రామాణికం అయినప్పుడు రైతు భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పిందని గుర్తుచేశారు.

రైతులందరికీ అందరికీ ఒకే విడతలో రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీపై రేవంత్‌ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు. కరోనా విపత్తులోనూ బీఆరెస్‌ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆరెస్‌ ప్రభుత్వం రూ.29వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. ఏదో కొంతమందికి ముందుగా రుణమాఫీ చేసి రైతు వేదికల్లో సంబరాలు చేసేందుకు సిద్ధపడకండి అని హితవు పలికారు. పట్టాదారు పుస్తకం ఉన్న ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో రుణమాఫీ డబ్బులు వేయాలని.. లేకపోతే రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసినట్లే అని అన్నారు. 11లక్షల మంది వరకే తొలి విడత లక్ష వరకు చేసేందుకు సిద్ధమయ్యారని, మిగిలిన 50లక్షల మంది రైతుల రుణమాఫీ ఎప్పుడు చేస్తారన్నదానిపై స్పష్టతనివ్వాలన్నారు.