మేడిగడ్డపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు
మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది

- కారణాలేమిటి? కారకులెవరు?
- నిగ్గు తేల్చాలన్న మంత్రి ఉత్తమ్
- ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన బృందాలు
- ఈఎన్సీ ఆఫీస్ సహా 12 చోట్ల సోదాలు
- పలు కీలక రికార్డుల స్వాధీనం
- ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు?
- ఏం చేశారు? కాంట్రాక్టు ఎలా ఫైనల్ చేశారు?
- విచారణ జరిపే అంశాల్లో ఇవి కూడా!
- జ్యూడిషియల్ విచారణ జరిపించండి
- హైకోర్టు సీజేకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
విధాత : కాళ్వేరం అవినీతి, మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు కారణాలు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలను, బాధ్యులైన అధికారులను గుర్తించేందుకు ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశాలు ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
హైకోర్టు సీజేకు లేఖ
మేడిగడ్డలో పిల్లర్ల కుంగుబాటుపై సిటింగ్ న్యాయమూర్తి చేత జ్యూడిషియల్ విచారణ జరుపుతామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసిందని, సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ముందుగా విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. కాళేశ్వరం అవినీతిపైన, మేడిగడ్డ కుంగుబాటుపైన జ్యూడిషియల్, విజిలెన్స్ విచారణలో ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు? ఏం చేశారు? కాంట్రాక్టు ఎలా ఫైనల్ అయ్యింది? అనే అంశాలపై విచారణ చేయాలన్న ఆదేశించినట్టు ఉత్తమ్ వెల్లడించారు. విజిలెన్స్ ఎంక్వైరీలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, సీఏ ఉంటారని తెలిపారు.
రంగంలోకి విజిలెన్స్ బృందాలు
మేడిగడ్డ కుంగుబాటుపై విచారణ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ శాఖకు చెందిన 12 బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఈఎన్సీ మురళీధర్‌రావు కార్యాలయంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 12 చోట్లలో ఉన్న కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. జలసౌధలోని ఈఎన్సీ కార్యాలయంలోని రెండో అంతస్తు, నాల్గవ అంతస్తులో సోదాలు నిర్వహించి, రికార్డులను సీజ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలో, మహదేవపూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో, రామగుండం కార్యాలయంలో విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించి రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నాయి.
ఎన్నికలకు ముందు కుంగిన మేడిగడ్డ బరాజ్‌ను ఇటీవల మంత్రుల బృందం పరిశీలించింది. అక్కడే అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు పరిస్థితులు, మరమ్మతులకు చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం కాళేశ్వరం అవినీతిపై జ్యూడిషియల్ విచారణకు ఆదేశిస్తామని ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటన చేసింది. సిటింగ్ జడ్జి కేటాయింపులో ఆలస్యమైతే జ్యూడిషియల్ విచారణ జాప్యమవుతుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. అందుకే ముందుగా విజిలెన్స్ విచారణకు మొగ్గు చూపి అందుకు ఆదేశాలిచ్చిందని చెబుతున్నారు.
సోమవారం కరీంనగర్ ఇరిగేషన్ శాఖలో కాళేశ్వరం విభాగంలో చోరీ జరుగడం, విలువైన రికార్డులు, హార్డ్ డిస్క్‌లు చోరీకి గురికావడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఇక ఆలస్యం చేయడం మంచిదికాదన్న భావించిన ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ముందు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతిపై విజిలెన్స్ విచారణ ప్రారంభం కావడంతో ఇరిగేషన్ శాఖ అధికారుల్లో, కాంట్రాక్టు సంస్థల గుండెల్లో గుబులు మొదలైంది. లక్ష కోట్ల వరకు ఖర్చు జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ.4600 కోట్లతో నిర్మించిన మేడిగడ్డ బరాజ్.. కట్టిన రెండేళ్లకే కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో లీకేజీలు వెలుగు చూడటంతో ప్రాజెక్టు మనుగడను ప్రశ్నార్థకం చేసింది. అంతకు ముందే వరదల్లో పంప్‌హౌజ్‌లు ముంపుకు గురైన సమయంలోనే ప్రాజెక్టు నిర్మించిన తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలా మొదటి నుంచీ వివాదాలమయమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణలో ఎలాంటి నిజాలు వెలుగుచూడబోతాయన్నది ఆసక్తికరంగా మారింది.