Child Trafficking | చిన్నారుల అక్రమ రవాణా.. అడ్డాగా ఉత్తరప్రదేశ్
Child Trafficking తదుపరి స్థానాల్లో బీహార్, ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో గణనీయంగా పెరిగిన కేసులు న్యూఢిల్లీ: చిన్నారుల అక్రమ రవాణా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ నుంచే అధికంగా ఉన్నదని ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. తదుపరి స్థానాల్లో బీహార్, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. 2016 నుంచి 2022 మధ్య నమోదైన ఘటనలను విశ్లేషిస్తూ ఈ అధ్యయనం సాగింది. కొవిడ్ ముందు నుంచి కొవిడ్ తర్వాతి కాలంలో ఢిల్లీలో చిన్న పిల్లల అక్రమ రవాణా 68 శాతం పెరిగిందని […]

Child Trafficking
- తదుపరి స్థానాల్లో బీహార్, ఆంధ్రప్రదేశ్
- ఢిల్లీలో గణనీయంగా పెరిగిన కేసులు
న్యూఢిల్లీ: చిన్నారుల అక్రమ రవాణా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ నుంచే అధికంగా ఉన్నదని ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. తదుపరి స్థానాల్లో బీహార్, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. 2016 నుంచి 2022 మధ్య నమోదైన ఘటనలను విశ్లేషిస్తూ ఈ అధ్యయనం సాగింది. కొవిడ్ ముందు నుంచి కొవిడ్ తర్వాతి కాలంలో ఢిల్లీలో చిన్న పిల్లల అక్రమ రవాణా 68 శాతం పెరిగిందని తెలిపింది. ‘మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక దినం’ సందర్భంగా ఆదివారం విడుదలైన నివేదిక.. దేశంలో చిన్నారుల అక్రమ రవాణా విషయంలో ఆందోళనలు రేకెత్తిస్తున్నది. ‘భారతదేశంలో చిన్నారుల అక్రమ రవాణా’ పేరిట గేమ్స్24X7, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థికి చెందిన కైలాశ్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ (కేఎస్‌సీఎఫ్) సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. చిన్నారుల అక్రమ రవాణా సాగుతున్న రాష్ట్రాల్లో తొలి మూడు స్థానాల్లో యూపీ, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది.
జిల్లాల వారీగా చూసినప్పుడు జైపూర్ సిటీ అగ్రస్థానంలో నిలిచింది. మరో నాలుగు టాప్ స్పాట్లుగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని 21 రాష్ట్రాల్లోని 262 జిల్లాల నుంచి 2016 నుంచి 2022 మధ్య చిన్నారుల అక్రమ రవాణా కేసులకు సంబంధించిన వివరాలను
గేమ్స్24X7కు చెందిన డాటా సైన్స్ టీమ్.. కేఎస్‌సీఎఫ్, ఇతర భాగస్వాముల నుంచి సేకరించింది. దేశంలో చిన్నారుల అక్రమ రవాణా తీరుతెన్నులపై అవగాహన పెంచుకునేందుకు, వాటిని అరికట్టేందుకు అనుసరించాల్సిన మార్గాలను గుర్తించేందుకు ఈ అధ్యయనం దోహదం చేస్తుంది.

ఈ నిర్దిష్ట కాల వ్యవధిలో 18 ఏండ్లలోపు ఉన్న 13,549 మంది చిన్నారులను అక్రమ రవాణా నుంచి రక్షించారు. వీరిలో 80% మంది 13 నుంచి 18 ఏండ్ల లోపువారే. మరో 13శాతం మంది 9 నుంచి 12 ఏళ్ల మధ్యవారు. అంతకంటే తక్కువ వయసున్న వారు 2శాతంగా ఉన్నారు. చిన్నారుల అక్రమ రవాణాలో ప్రత్యేకంగా ఒక వయసువారిని లక్ష్యంగా ఎంచుకోవడం లేదని, అన్ని వయసుల వారినీ టార్గెట్ చేశారని అర్థమవుతున్నది. హోటళ్లు, దాభాల్లో ఎక్కువ మంది (15.6%) బాల కార్మికులు ఉంటున్నారు. తర్వాతి స్థానాల్లో ఆటోమొబైల్ లేదా రవాణా రంగం (13%), వస్త్ర పరిశ్రమ (11.18%) ఉన్నాయి.
యూపీలో గణనీయంగా పెరిగిన కేసులు
నివేదిక ప్రకారం చూస్తే.. చిన్నారుల అక్రమ రవాణా ఉదంతాలు ఉత్తరప్రదేశ్‌లో గణనీయంగా పెరిగాయి. కొవిడ్‌కు ముందు కాలంలో (2016-2019) 267 ఘటనలు ఉంటే.. అవి (2021-2022) నాటికి 1214కి పెరిగాయి. కర్ణాటకలోనూ అక్రమ రవాణా 18 శాతం పెరిగిందని అధ్యయనం వెల్లడించింది.