సోద‌రుడికి కిడ్నీ దానం చేసిన మ‌హిళ‌.. ఆమెకు విడాకులిచ్చిన భ‌ర్త‌

ప్రాణ‌పాయ స్థితిలోఉన్న త‌న సోద‌రుడిని బ‌తికించుకునేందుకు, ఓ మ‌హిళ కిడ్నీ దానం చేసింది. త‌న‌కు తెలియ‌కుండా కిడ్నీ ఎందుకు దానం చేశావ‌ని ఆమెకు భ‌ర్త విడాకులిచ్చాడు

సోద‌రుడికి కిడ్నీ దానం చేసిన మ‌హిళ‌.. ఆమెకు విడాకులిచ్చిన భ‌ర్త‌

ల‌క్నో : ప్రాణ‌పాయ స్థితిలోఉన్న త‌న సోద‌రుడిని బ‌తికించుకునేందుకు, ఓ మ‌హిళ కిడ్నీ దానం చేసింది. త‌న‌కు తెలియ‌కుండా కిడ్నీ ఎందుకు దానం చేశావ‌ని ఆమెకు భ‌ర్త విడాకులిచ్చాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోండాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. యూపీలోని గోండాకు చెందిన త‌ర‌న్న‌మ్, మ‌హ్మ‌ద్ ర‌షీద్‌కు 20 ఏండ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి సంతానం క‌ల‌గ‌లేదు. ఉపాధి నిమిత్తం ర‌షీద్ సౌదీ అరేబియా వెళ్లాడు. అయితే త‌ర‌న్న‌మ్ సోద‌రుడు మ‌హ్మ‌ద్ ష‌కీర్‌కు కిడ్నీలు ఫెయిల‌య్యాయి. దీంతో అత‌ను ప్రాణ‌పాయ స్థితిలో ఉన్నాడు. త‌మ్ముడిని బ‌తికించుకునేందుకు త‌రన్న‌మ్ త‌న కిడ్నీ దానం చేసింది. నాలుగు నెల‌ల క్రితం ముంబైలోని ఓ ఆస్ప‌త్రిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చికిత్స విజ‌య‌వంత‌మైంది.

ఇక ఇటీవ‌లే త‌ర‌న్న‌మ్ అత్త‌గారింటికి వెళ్లింది. త‌న సోద‌రుడికి కిడ్నీ దానం చేసిన సంగ‌తిని భ‌ర్త‌కు చెప్పింది. కిడ్నీ దానం చేసినందుకు గానూ మ‌హ్మ‌ద్ ష‌కీర్ నుంచి రూ. 40 ల‌క్ష‌లు తేవాల‌ని భార్య‌ను ర‌షీద్ డిమాండ్ చేశాడు. డ‌బ్బులు ఇవ్వ‌డం కుదర‌ద‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. దీంతో తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన ర‌షీద్.. వాట్సాప్ ద్వారా ట్రిపుల్ త‌లాక్ చెప్పేశాడు.

దీంతో త‌ర‌న్న‌మ్ తిరిగి త‌న పుట్టింటికి చేరుకుంది. ర‌షీద్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ర‌షీద్‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అడిష‌న‌ల్ ఎస్పీ రాధేశ్యాంరాయ్ పేర్కొన్నారు. అయితే త‌న‌తో సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డంతో ర‌షీద్ రెండో పెళ్లి చేసుకున్న‌ట్లు త‌ర‌న్న‌మ్ పోలీసుల‌కు తెలిపింది.