తొలిసారి యురేన‌స్ ఫొటోల‌ను క్లిక్‌మ‌నిపించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌..

సుదూర అంత‌రిక్షంలోని గ్ర‌హాల ఉనికిని క‌నుగొన‌డానికి నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే

తొలిసారి యురేన‌స్ ఫొటోల‌ను క్లిక్‌మ‌నిపించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌..

విధాత‌: సుదూర అంత‌రిక్షం (Space) లోని గ్ర‌హాల ఉనికిని క‌నుగొన‌డానికి, మ‌న సౌర కుటుంబం (Solar System) లోని గ్ర‌హాల స్థితిగ‌తుల‌ను క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేయ‌డానికి నాసా (NASA) … జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ (James Webb Telescope)ను ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. అత్యంత శ‌క్తిమంత‌మైన ప‌రిక‌రాల‌తో కూడిన ఈ టెలిస్కోప్..ఇప్ప‌టికే అనేక గ్ర‌హాల చిత్రాల‌ను తీసి మ‌న‌కు అందించింది.


తాజాగా సౌర కుటుంబంలో ఏడో గ్ర‌హ‌మైన యురేన‌స్‌ (Uranus) ను అత్యంత స్ప‌ష్ట‌త‌తో త‌న కెమెరాల్లో బంధించి శాస్త్రవేత్త‌ల‌కు పంపించింది. వాటిని నాసా సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. ఆ ఫొటోల్లో యురేన‌స్ చుట్టూ ఉండే వ‌ల‌యాలు, చంద‌మామ‌లు, తుపానుల క‌ద‌లిక‌, ఇత‌ర ప‌రిణామాలు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతున్నాయి. యురేన‌స్‌ను ఇంత స్ప‌ష్టంగా ఫొటో తీయ‌డం ఇదే తొలిసార‌ని నాసా శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు.


మంచుతో క‌ప్ప‌బ‌డి ఉండే ఈ గ్ర‌హం చుట్టూ 27 చంద‌మామ‌లు తిరుగుతున్నాయ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించాం. వాటిల్లో తొమ్మిది యురేన‌స్ చుట్టూ వ‌ల‌యంలా ఉండ‌గా జేమ్స్ వెబ్ క్లిక్‌మ‌నిపించింది. అందులో ఉండే నియ‌ర్ ఇన్‌ఫ్రా కెమెరాకే ఈ ఫొటో క్రెడిట్ ద‌క్కుతుంద‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ గ్ర‌హం ధ్రువాల వ‌ద్ద ఏర్ప‌డిన పోలార్ క్యాప్‌ల‌ను కూడా చిత్రంలో బంధించింది.


 


యురేన‌స్‌ను చుట్టి ఉండే జెటా రింగ్ కూడా ఈ ఫొటోల్లో క‌నిపిస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో తొలిసారి యురేన‌స్‌ను ఇంత స్ప‌ష్టంగా చూస్తున్నాం. ముఖ్యంగా జెటా రింగ్ క‌న‌ప‌డ‌టం ఒక అద్భుతం. భ‌విష్య‌త్తులో యురేన‌స్ ద‌గ్గ‌ర‌కు ఏదైనా మిష‌న్ పంపిస్తే ఈ వివ‌రాలు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి అని నాసా తెలిపింది. ఈ ఫొటోల‌ను ప‌రిశీలించి చూస్తే యురేన‌స్ ద‌క్షిణ ధ్రువం వ‌ద్ద తుపానులు ఎక్కువ సంభ‌విస్తున్న‌ట్లు తెలుస్తోంద‌ని నాసా పేర్కొంది.


2028లో ఈ గ్ర‌హం సూర్యుని ద‌గ్గ‌ర‌గా రానుంద‌ని.. అప్పుడు ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా? ఒక‌వేళ సంభ‌విస్తే అటువంటి మార్పులేమిట‌నే దానిపై శాస్త్రవేత్త‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. యురేన‌స్‌ను మ‌న సౌర‌కుటుంబానికి ఒక పెర‌డుగా భావిస్తున్న‌ట్లు వారు చెబుతున్నారు. ఇలాంటి భారీ గ్ర‌హాల‌ను అధ్య‌య‌నం చేయ‌డం ద్వారా మ‌న సౌర కుటుంబం పుట్టుప‌ర్వోత్త‌రాల‌ను అంచ‌నా వేయొచ్చ‌ని నాసా ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.