Venkanna vs Linganna | ఉదయ సముద్రంపై ప్రచార వార్.. తగ్గేదేలే అంటున్న గురు శిష్యులు!
Venkanna vs Linganna విధాత: ఉదయ సముద్రం(Udaya Samudram) ఎత్తిపోతల ప్రాజెక్టు ట్రయల్ రన్(Project trial run) సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ ఘనత మాదంటే మాదే అంటూ మొదలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మధ్య ప్రచార వార్ మీడియా, సోషల్ మీడియా వేదికగా జోరందుకుంది. ప్రాజెక్టు ట్రయల్ రన్ దృశ్యాలు, వీడియోలతో సోషల్ మీడియా వేదికగా ఒకనాటి గురుశిష్యులు, ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులుగా మారిన కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బిఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి […]
Venkanna vs Linganna
విధాత: ఉదయ సముద్రం(Udaya Samudram) ఎత్తిపోతల ప్రాజెక్టు ట్రయల్ రన్(Project trial run) సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ ఘనత మాదంటే మాదే అంటూ మొదలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మధ్య ప్రచార వార్ మీడియా, సోషల్ మీడియా వేదికగా జోరందుకుంది.
ప్రాజెక్టు ట్రయల్ రన్ దృశ్యాలు, వీడియోలతో సోషల్ మీడియా వేదికగా ఒకనాటి గురుశిష్యులు, ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులుగా మారిన కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బిఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గాల మధ్య సాగుతున్న పోటాపోటీ ప్రచారం జనంలో చర్చనీయాంశంగా మారింది.

తొలుత గత బుధవారం రాత్రి ఉదయ సముద్రం ప్రాజెక్టు రెండు మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ లోకి కృష్ణా జలాలను పంపింగ్ చేశారు. ఇక అప్పటి నుండి ఉదయ సముద్రం ప్రాజెక్టు క్రెడిట్ కోసం మొదలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ ల ప్రచారయుద్ధం రోజురోజుకు తీవ్రతరమవుతుంది.
తొలి ట్రయల్ రన్ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు నిర్వహించారు. కృష్ణా జలాలకు హారతి పట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడుతూ తన వంతుగా సీఎం కేసీఆర్ దృష్టికి పదేపదే ఉదయం సముద్రం ప్రాజెక్టు సమస్యను తీసుకెళ్లడంతో సీఎం కేసీఆర్ పనుల పూర్తికి నిధులు, ఆదేశాలు ఇచ్చారని ప్రకటించారు.

పోటీగా నకిరేకల్ కాంగ్రెస్ నేత దైద రవీందర్ కృష్ణా జలాలకు పూజలు చేసి, వెంకన్న ఫ్లెక్సీలకు పాలు, పూల అభిషేకాలు చేసి, ప్రాజెక్టు నిర్మాణ ఘనత దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వానికి, ఆనాటి మంత్రి, ప్రస్తుత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దేనన్నారు. అలా రెండు పార్టీల మధ్య ఉదయం సముద్రం ప్రాజెక్టు నేపథ్యంగా నెలకొన్న ప్రచార పోరులో తగ్గేదేలే అంటూ రెండు వర్గాలు ప్రాజెక్టు వద్ద సందడి చేస్తున్నాయి.
శనివారం మరోసారి ఉదయ సముద్రం ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంబరాల ఫోటోలు, వీడియోలను ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

ప్రతిగా వెంకట్ రెడ్డి వర్గీయులు ప్రాజెక్టు, ట్రయల్ రన్ చిత్రాలతో మిక్సింగ్ వీడియోలను రూపొందించి, గతంలో ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ఆనాటి సీఎం వైఎస్ఆర్, మంత్రి వెంకటరెడ్డి, లింగయ్యలు హాజరైన ఫోటోలతో కూడిన ప్రచార దృశ్యాలను సోషల్ మీడియాలోకి వదిలారు.
అటు లింగయ్య వర్గీయులు, ఇటు వెంకట్ రెడ్డి వర్గీయులు ఇద్దరు కూడా ఉదయ సముద్రం ప్రాజెక్టు నిర్మాణ క్రెడిట్ మాదంటే మాదే అంటూ సాగిస్తున్న ప్రచార యుద్ధాన్ని జిల్లా ప్రజలు ఆసక్తిగా తిలకిస్తు ఈ వ్యవహారంపై రచ్చబండ చర్చల్లో మునిగి తేలుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram