Congress | టెన్షన్.. టెన్షన్.. కాంగ్రెస్ టికెట్ కోసం ఎదురుచూపులు
ఇంకా కొలిక్కిరాని తొలి జాబితా అయోమయంలో పాలమూరు నేతలు ఆచితూచి అడుగులేస్తున్న పార్టీ అధిష్టానం Congress | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: వచ్చే శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా ఇంకా ప్రకటించలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశావహులు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. టికెట్ వస్తుందా? రాదా? అనే విషయంపై పలువురు సీనియర్ నాయకులు […]

- ఇంకా కొలిక్కిరాని తొలి జాబితా
- అయోమయంలో పాలమూరు నేతలు
- ఆచితూచి అడుగులేస్తున్న పార్టీ అధిష్టానం
Congress |
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: వచ్చే శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా ఇంకా ప్రకటించలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశావహులు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. టికెట్ వస్తుందా? రాదా? అనే విషయంపై పలువురు సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
టికెట్ రాకుంటే తమ పరిస్థితి ఏంటో అని బేరీజు వేసుకుంటున్నారు. పార్టీలో ఉండాలా? లేదా అవకాశం ఉన్న పార్టీలోకి వెళ్ళాలా.. పార్టీలో ఉండి అభ్యర్థికి మద్దతు తెలపాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇప్పుడే టికెట్లు ప్రకటిస్తే, పార్టీకి నష్టం జరుగుతుందనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ రాని వారు పార్టీని వీడే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది.
బీఆర్ఎస్ టికెట్లు కేటాయించి వారం గడిచింది. అయినా కాంగ్రెస్ మాత్రం టికెట్ ప్రకటించడంలో తొందర పాటు నిర్ణయం తీసుకోవద్దనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ఎప్పుడు వస్తుందా.. ఎన్నికల ప్రచారానికి ఎప్పుడు వెళదామా అనే ఆలోచనలో నేతలు ఉన్నారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టికెట్ వస్తే ప్రచారం చేసేందుకు సమయం సరిపోదనే ధోరణిలో నాయకులు ఉన్నారు.
వర్గ పోరు పైనే దృష్టి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం ఎక్కువ గా ఉంది. ఎన్నికల గడువు తక్కువగా ఉంటే ప్రచారంలో దూసుకు పోలేమని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ త్వరగా కేటాయిస్తే వర్గ పోరును తగ్గించు కోవచ్చని, వారిని బుజ్జగించి తమ దారికి తెచ్చుకోవచ్చనే భావనలో టికెట్ ఆశించే నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ వర్గపోరు పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉంది.
అక్కడ మాత్రం టికెట్ వచ్చిన నాయకులకు ఈ తలనొప్పి ఉంటుంది. అధిష్టానం మాత్రం ఇలాంటి నియోజకవర్గాలను ముందుగానే గుర్తించి, వర్గ పోరు లేకుండా టికెట్లకు ముందే వారికి పార్టీలో ఇతర పదవుల ఆశ చూపి, టికెట్ వచ్చిన అభ్యర్థికి మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ జిల్లాలో ముఖ్యంగా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జడ్చర్ల, గద్వాల, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో వర్గపోరు ఉంది.
నాగర్ కర్నూల్
ఈ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య త్రీవ పోటీ నెలకొంది. సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి మధ్య టికెట్ లొల్లి వచ్చింది. నాగం మొదటి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కూచుకుళ్ళ తన కుమారుడు రాజేష్ రెడ్డి కోసం కాంగ్రెస్ టికెట్ కోరుతున్నారు.
ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం నాగంను వదులుకునే పరిస్థితి లేదు. మరోవైపు కూచుకుళ్ళ నూ వదులుకునే అవకాశం లేదు. ఇద్దరి మధ్య సాయోధ్య కుదిరించి టికెట్ ప్రకటించాలని అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చివరకు నాగంను ఒప్పించి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి వైపే కాంగ్రెస్ చూపు నిలిపే అవకాశం కనిపిస్తుంది.
జడ్చర్ల
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. కాంగ్రెస్ కి మొదటి నుంచి దిశా, దిక్కుగా ఉన్న అనిరుద్ రెడ్డి, ఇటీవల ఆపార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో నెల రోజుల పాటు పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యేందుకు అనిరుద్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారు.
ఎర్రశేఖర్ కూడా బీసీ సామాజికవర్గ అభ్యర్థి కావడం.. ఈ నియోజకవర్గంలో బీసీ నేతల్లో పట్టున్న నేత కావడంతో అధిష్టానం ఆయన వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. అనిరుద్ రెడ్డిని బుజ్జగించి, పార్టీలో సముచిత న్యాయం చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చేట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ఎర్రశేఖర్ పేరు నియోజకవర్గంలో మార్మోగుతోంది.
మహబూబ్ నగర్
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలమైన నేత కోసం వెతుకుతోంది. ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఎన్నికల రణరంగంలో తట్టుకునే అభ్యర్థిని పోటీకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం ఇద్దరు నేతల పేర్లు టికెట్ రేసులో ఉన్నాయి. మాజీ డీసీసీ అధ్యక్షులు ఓబేధుల్లా కొత్త్వాల్, సంజీవ్ ముదిరాజ్… వీరిద్దరికీ శ్రీనివాస్ గౌడ్ ను తట్టుకునే స్థాయి లేదని ఆపార్టీ నేతలే అంటున్నారు.
దీంతో వీరిద్దరికీ నచ్చజెప్పి కొత్త అభ్యర్థి కోసం వేచి చూస్తున్నారు. బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకుని, ఇక్కడి నుంచి పోటీలో ఉంచే ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గద్వాల
ఇక్కడ కాంగ్రెస్ లో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. పార్టీలో ముందు నుంచి ఉన్న కురువ విజయకుమార్, అదే సామాజిక వర్గానికి చెందిన సరిత టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న సరిత ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఇక్కడ విజయ్ కుమార్ ను బుజ్జగించి సరితకు మద్దతుగా ఉండాలని టీపీపీసీ కోరినట్లు తెలిసింది. టీపీసీసీ మాత్రం సరితకు టికెట్ ఇచ్చే విధంగా గద్వాలలో పావులుకదుపుతోంది.
కొల్లాపూర్
ఇక్కడ టికెట్ ఆశించే వారు ఇద్దరు సీనియర్ నేతలు ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. సీనియర్ గా గుర్తింపు పొందిన మామిళ్లపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో విష్ణును ఒప్పించి, జూపల్లికి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విష్ణు సీనియర్ నేత కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. విష్ణును ఒప్పిస్తే జూపల్లికి లైన్ క్లియర్ అయినట్లే.
వనపర్తి
ఇక్కడ ముగ్గురు నేతలు పోటీలో ఉన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, యువజన నేత శివశంకర్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి ప్రధాన పోటీదారులుగా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. చిన్న రెడ్డి సీనియర్ నేత కావడం.. మేఘారెడ్డి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో వర్గపోరుకు బీజం పడింది. టీపీసీసీ మాత్రం ఇద్దరినీ ఒప్పించి చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో వర్గ పోరు అంతంత మాత్రమే.