Warangal | బిల్లులు రాక అప్పుల పాలై.. BRS మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య
Warangal గ్రామాభివృద్ధి పనులకు అప్పు ఐదేళ్లయినా రాని బిల్లులు హనుమకొండ జిల్లా కొత్తపల్లిలో ఘటన వివరాలు రాసి ఉరేసుకుని మృతి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సర్పంచ్‌గా చేసిన అప్పులు.. ఐదేళ్లయినా తీరక ఆ ఇంటి పెద్దను చావు వరకు వెంటాడాయి. భార్య సర్పంచ్ కావడంతో గ్రామాభివృద్ధికి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అయిదారేండ్లు పూర్తయినప్పటికీ బిల్లులు రాక, తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక మనోవేదనకు గురై అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యకు […]

Warangal
- గ్రామాభివృద్ధి పనులకు అప్పు
- ఐదేళ్లయినా రాని బిల్లులు
- హనుమకొండ జిల్లా కొత్తపల్లిలో ఘటన
- వివరాలు రాసి ఉరేసుకుని మృతి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సర్పంచ్‌గా చేసిన అప్పులు.. ఐదేళ్లయినా తీరక ఆ ఇంటి పెద్దను చావు వరకు వెంటాడాయి. భార్య సర్పంచ్ కావడంతో గ్రామాభివృద్ధికి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అయిదారేండ్లు పూర్తయినప్పటికీ బిల్లులు రాక, తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక మనోవేదనకు గురై అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పనుల కోసం పెట్టుబడి పెట్టిన వివరాలను లెటర్ రూపంలో రాసి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణిగుంట్ల భాగ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామ సర్పంచ్ గా ఎన్నికైంది. పాలనాపరమైన వ్యవహారాల్లో రేణిగుంట్ల చంద్రయ్య (50) ఆమెకు చేదోడువాదోడుగా ఉంటూ అన్నీ చూసుకునేవాడు. కాగా నూతన గ్రామపంచాయతీ భవనానికి 2017లో స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయగా.. డబ్బులు అప్పు తెచ్చి స్లాబ్ లెవెల్ వరకు పనులు చేశారు.
ఇందుకు గతంలో మొదటి దఫా రూ.3 లక్షలు మంజూరు అయ్యాయి. ఇంకో రూ.8 లక్షల వరకు రావాల్సి ఉండగా.. ఇంతవరకు పైసా రిలీజ్ కాలేదు. దీంతో తెచ్చిన అప్పులకు మిత్తి కట్టలేక తరచూ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో తన గోడును వెలిబుచ్చేవాడు.
భూమి అమ్మినా.. అప్పులు తీరక
ఈ క్రమంలో ఆరు నెలల కిందట పది గుంటల భూమి అమ్ముకున్నాడు. మూడు రోజుల కిందట ముల్కనూర్ సొసైటీలో అప్పు ఎత్తుకొని కొంతమేర బకాయిలు తీర్చుకున్నాడు. అయినా అప్పులు తీరక, గ్రామ పంచాయతీ బిల్లులతో పాటు ఇతర కొన్ని పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి దుస్తుల్లో కొంత నగదుతో పాటు తాను గ్రామ పంచాయతీకి పెట్టిన పెట్టుబడి, తెచ్చిన అప్పుల వివరాలు, ప్రస్తుత సర్పంచ్ తో కలిసి పెట్టిన పెట్టుబడి వివరాలతో ఒక చిట్టీ రాసి ఉంది. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉమ్మడి వ్యవసాయం పేరుతో ఇనుపరాతి గుట్టల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఎంతో మంది నిరుపేద రైతులకు అందించడంలో చంద్రయ్య కీలక పాత్ర పోషించాడు.