CM Revanth Reddy: వర్గీకరణ అమలులో తొలి అడుగు మనదే : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ వర్గీకరణపై బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ సుప్రీం తీర్పు అమలు చేయలేదని..వర్గీకరణ అమలు చేసే ప్రక్రియను తొలుత మన రాష్ట్రంలోనే మొదలుపెట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు.
CM Revanth Reddy: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదని..తీర్పు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ సుప్రీం తీర్పు అమలు చేయలేదని..మేం అమలు చేసే ప్రక్రియను మొదలుపెట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎస్సీ సంఘాల నాయకులు అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపి అభినందించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ సంఘాలు ధన్యవాదాలు నాకు మాత్రమే కాదు.. మన నాయకుడు రాహుల్ గాంధీకి తెలియజేయాలన్నారు. రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి నాకు వచ్చేది కాదన్నారు. భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వర్గీకరణపై వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వన్ మెన్ కమిషన్ 199 పేజీల నివేదిక ఇచ్చిందన్నారు. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, ఇది ఎవరికి వ్యతిరేకంగా చేసింది కాదన్నారు. వర్గీకరణ ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఆనాడు వర్గీకరణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. పదేళ్లలో పరిష్కారం కాని సమస్యకు మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పరిష్కారం చూపామన్నారు. సుప్రీం కోర్టులో బలంగా వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు కృషి చేశామని చెప్పారు. న్యాయపరమైన హక్కుల సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాం.. ఇప్పుడు సాధించుకున్నామన్నారు. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మాదిగ బిడ్డ కుమార్ ను నియమించామని, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ ఖాసీంనునియమించామని, ఉన్నత విద్యామండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యాకమిషన్ లలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.
ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటేనే… భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఇదొక గొప్ప అవకాశం.. ఇది పది మందికి ఉపయోగపడేలా చూడాలన్నారు. కుర్చీలో మీ వాడిగా నేనున్నానని..మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదన్నారు. బీసీ కులగణన నిర్వహించి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు కూడా న్యాయం చేసేందుకు, పార్టీ ఎన్నికల హామీ అమలు చేసేందుకు చిత్తశుద్ధితో బిల్లులు అమోదించామని చెప్పారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram