Sama Rammohan Reddy: తండ్రికి రాసిన లేఖలో ఏమున్నదో కవిత బయటపెట్టాలి

Sama Rammohan Reddy: తండ్రికి రాసిన లేఖలో ఏమున్నదో కవిత బయటపెట్టాలి
  • కవిత పార్టీ పెడితే స్వాగతిస్తాం
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే..
  • అందుకే కవితను అణిచివేస్తున్నారు
  • పదేళ్ల పాలనపై, పార్టీలో అన్యాయంపై కేసీఆర్‌కు  ఆమె లేఖ రాశారు
  • లేఖలోని అంశాలను కవిత బహిర్గతం చేయాలి
  • కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ సామ రాంమోహన్ రెడ్డి

విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడుతానంటే కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గత కొన్నిరోజులుగా కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలన విధానాలపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారని అన్నారు. సామాజిక తెలంగాణ సాధనలో.. మహిళా సమానతలో పదేళ్ల పాలనలో విఫలమయ్యారని కవిత ప్రశ్నలు సంధిస్తుండటం అందరికీ తెలిసిందేనన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంలో తనను జైలుకు పంపించిన ఎవ్వరినీ వదిలేది లేదని ప్రతిజ్ఞ చేశారని.. ఆ దిశగా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయకుండా సొంత కుటుంబమే అడ్డుకోవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. రాజకీయంగా పార్టీలో తనను అణిచివేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ వేలకోట్ల ఆస్తులను కేటీఆర్ చేతికి, ఆయన పిల్లలకే తప్ప ..కవితకు, ఆమె పిల్లలకు అందకుండా పోయే పరిస్థితి కూడా కవితను ఆందోళనకు గురి చేసి ఉండవచ్చన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో పురుషాధిక్యత సాగుతున్న వాస్తవాన్ని కవిత గ్రహించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేటీఆర్ తన తదుపరి రాజకీయ వారసుడన్నట్లుగా వేదికపై ఆయన ఫోటో ఒక్కటే పెట్టారన్నారు.

మహిళలు రాజకీయంగా రాణించాలని కాంగ్రెస్ కోరుకుంటుందని సామ రామ్మోహన్ రెడ్డి చెప్పారు. కవిత తెలంగాణలో పార్టీ పెడుతామంటే కచ్చితంగా కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు. అయితే తండ్రి కేసీఆర్ చేసిన వినాశకాలు, పాలన విధానాలను గుణపాఠంగా తీసుకుని అలాంటి వాటికి దూరంగా పార్టీ పెడితే స్వాగతిస్తామని చెప్పారు. అలా కాని పక్షంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిలబడినట్లుగా కవితపై కూడా కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ బంధానికి కవిత ఎపిసోడ్ నిదర్శనమని..బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే సొంత కుటుంబ సభ్యులను కూడా బీఆర్ఎస్ నాయకత్వం సహించలేకపోతుందన్నారు. బీఆర్ఎస్ లోని లోపాలు..వైఫల్యాలు..తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ కవిత ఇటీవల కేసీఆర్ కు లేఖ రాశారని సామా వెల్లడించారు. అమెరికా పోయేలోగానే కవిత తన అసంతృప్తికి.. లేఖకు సమాధానాలు రాబట్టాలని సూచించారు. కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత రాజకీయ ఆధిపత్య పోరును కవిత బయటపెట్టాలని కోరారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ విలీనం మాటలు బీజేపీ, బీఆర్ఎస్ లకే వర్తిస్తాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని..బీఆర్ఎస్ పాలనలోని కుంభకోణాలపై విచారణ కొనసాగిస్తున్నామన్నారు. బీజేపీనే ఈ కేసుల్లో బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకు ఈడీని ఎంటర్ చేస్తూ విచారణకు ఆటంకాలు పెడుతుందని సామా విమర్శించారు.