పార్లమెంటు బయట అరెస్టయిన నీలం.. ఎవరంటే..

పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు ఉన్నా.. ఉద్యోగం దొరకని యువతి.. నీలం

పార్లమెంటు బయట అరెస్టయిన నీలం.. ఎవరంటే..

న్యూఢిల్లీ: పార్లమెంటు భద్రతను ఉల్లంఘించిన కేసులో అరెస్టయిన వారిలో నీలం ఒకరు. విద్యాపరంగా చాలా క్వాలిఫికేషన్లు ఉన్నా.. ఇంత వరకూ ఉద్యోగం రాకపోవడంపై తన కుమార్తె తీవ్ర నిస్పృహతో ఉన్నదని ఆమె తల్లి చెబుతున్నారు. నీలం ఎంఏ, బీఎడ్‌, అనంతరం ఎంఎడ్‌ చేసిందని, ఎంఫిల్‌ చేసిందని, సీటీఈటీ, ఎన్‌ఈటీ కూడా అర్హత సాధించిందని ఆమె తమ్ముడు రామ్‌ నగేశ్‌ తెలిపారు. నీలం (42)ను పార్లమెంటు వెలుపల అమోల్‌ షిండే (25)తోపాటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షిండే లాతూర్‌ నివాసి.


వీరిద్దరు బయట నిరసన తెలియజేస్తున్న సమయంలో మరో ఇద్దరు మనోరంజన్‌ డీ, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడి నినాదాలు చేశారు. ఇంత చదువు చదివీ ఉద్యోగం రాకపోతే చావడమే మేలని తనతో తరచూ నీలం అంటుండేదని ఆమె తల్లి ఒక మీడియా సంస్థకు చెప్పారు. తనతో మాట్లాడుతూనే ఉంటుందని, కానీ.. ఢిల్లీ వెళ్లిన విషయం ఇప్పటి దాకా తెలియలేదని అన్నారు. నీలంను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆమె నియంతృత్వం నశించాలి, మహిళలపై నేరాలు అరికట్టాలి అని నినాదాలు చేయడం వినిపించింది. నిరుద్యోగ సమస్యలను కూడా ఆమె లేవనెత్తారు. మరో నిందితుడు మనోరంజన్‌ డీ ఇంజినీరింగ్‌ చదివాడు. 2016లో బీఈ పూర్తి చేసి, పొలం పనులు చూసుకుంటున్నాడు.


అతను మంచి పిల్లాడని అతని తండ్రి దేవరాజ్‌గౌడ చెప్పారు. ‘నా కొడుకు మంచివాడు. నిజాయితీపరుడు. సమాజానికి మంచి చేయాలని ఎప్పుడూ కోరుకునేవాడు. అవసరమైతే సమాజం కోసం త్యాగం చేయాలనేవాడు. స్వామి వివేకానంద రాసిన పుస్తకాలు చదువుతుండేవాడు. ఇటువంటి పుస్తకాలు చదివిన తర్వాత అతడు ఇన్ని మంచి లక్షణాలు అలవర్చుకున్నాడని నేను అనుకునేవాడిని’ అని ఆయన మీడియాకు చెప్పారు. అయితే.. అతడి మనసులో ఏమున్నదో అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. 2016లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కొంతకాలం ఢిల్లీ, బెంగళూరుల్లోని కంపెనీల్లో పనిచేశాడని, ఇప్పుడు పొలం పనులు చూసుకుంటున్నాడని తెలిపారు.


మా ఆఫీసుకు వస్తుండేవాడు : ప్రతాప్‌ సింహ

ఇదిలా ఉంటే.. చొరబడిన వ్యక్తులు బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహ పేరిట విజిటర్స్‌ పాసులు పొందిన నేపథ్యంలో ఆయన స్పీకర్‌ ఓంబిర్లాకు వివరణ ఇచ్చారు. సాగర్‌ శర్మ అనే యువకుడు తన నియోజకవర్గానికి చెందినవారని, కొత్త పార్లమెంటును సందర్శించేందుకు పాసులు ఇప్పించాల్సిందిగా కోరాడని తెలిపారని సమాచారం. అతడు తన వ్యక్తిగత సిబ్బందితో నిత్యం సంప్రదించేవాడని, ఆఫీసుకు కూడా వస్తుండేవాడని తెలిపారు. ఇంతకు మించి తనకు ఎలాంటి సమాచారం లేదని స్పీకర్‌ చెప్పారని సమాచారం. ఇదిలా ఉంటే.. బీజేపీ ఎంపీ పేరుతో విజిటర్‌ పాసులు తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు మైసూరులోని ఎంపీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు సాగర్‌ శర్మ ప్రధాని మోదీతో కలిసి ఉన్న ఫొటోను కాంగ్రెస్‌ శ్రేణులు ఎక్స్‌లో పోస్ట్‌ చేశాయి. ఆ ఫొటో కింద ‘బీజేపీ ఎంపీ పాసుతో పార్లమెంటులో చొరబాటు’ అని పేర్కొన్నారు.