Amethi | రాహుల్‌ బదులు అమేథీ నుంచి ఎవరు? ప్రియాంక గాంధీనా, వరుణ్‌గాంధీనా!

పరిశీలనలో పలువురు ఆశావహులు తొలి చాయిస్‌ ప్రియాంక గాంధీ.. వరుణ్‌గాంధీ పోటీ చేసినా ఆశ్చర్యం లేదు! విధాత: పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి సూరత్‌ కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో గాంధీల అడ్డాగా చెప్పే అమేథీ నియోజకవర్గం నుంచి 2024లో ఎవరు పోటీ చేస్తారన్న చర్చ నడుస్తున్నది. ఇదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాహుల్‌ గాంధీ.. బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినా.. కేరళలోని వయనాడ్‌ నుంచి గెలిచి లోక్‌సభలో అడుగు […]

Amethi | రాహుల్‌ బదులు అమేథీ నుంచి ఎవరు? ప్రియాంక గాంధీనా, వరుణ్‌గాంధీనా!
  • పరిశీలనలో పలువురు ఆశావహులు
  • తొలి చాయిస్‌ ప్రియాంక గాంధీ..
  • వరుణ్‌గాంధీ పోటీ చేసినా ఆశ్చర్యం లేదు!

విధాత: పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి సూరత్‌ కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో గాంధీల అడ్డాగా చెప్పే అమేథీ నియోజకవర్గం నుంచి 2024లో ఎవరు పోటీ చేస్తారన్న చర్చ నడుస్తున్నది. ఇదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాహుల్‌ గాంధీ.. బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినా.. కేరళలోని వయనాడ్‌ నుంచి గెలిచి లోక్‌సభలో అడుగు పెట్టగలిగారు.

ఇప్పడు కోర్టు తీర్పు నేపథ్యంలో అనర్హత వేటు ఎదుర్కొన్నారు. కోర్టు విధించిన శిక్షను పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువు ఉన్నది. ఈలోపు తన అర్హత వేటు కేసునూ న్యాయపరంగా ఎదుర్కొనే ప్రయత్నాల్లో రాహుల్‌గాంధీ ఉన్నారు. అదెలా ఉన్నా.. అమేథీ నుంచి రాహుల్‌గాంధీ కాకపోతే మరిన్ని చిక్కులు తప్పవని యూపీ నాయకత్వం భావిస్తున్నది.

అందుకే రాహుల్‌గాంధీ కాని పక్షంలో ఆయనకు తగిన వ్యక్తిని బరిలో నిలపాలని యోచిస్తున్నది. ఆ స్థానం నుంచి అతడి సోదరి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మొదటి చాయిస్‌ అవుతారని యూపీ నాయకత్వం చెబుతున్నది. ఆమెతోపాటు మరికొందరి పేర్ల పైనా చర్చ జరుగుతున్నది.

ప్రియాంక గాంధీ

రాహుల్‌ కాని పక్షంలో ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అమేథీలోని సీనియర్‌ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. యూపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కావడానికి ముందు ఆమె రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. కనుక.. రాహుల్‌ పోటీచేయని పక్షంలో సహజంగానే దీదీ పోటీచేస్తారని ఒక స్థానిక నాయకుడు చెప్పారు.

గాంధీ కుటుంబం నుంచి కాకపోతే అమేథీలో తగిన మద్దతు లభించదని ఆయన అంటున్నారు. ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ మధ్య పోటీని చాలా మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అదే సమయంలో ఈసారి సోనియాగాంధీ ఆరోగ్య కారణాల రీత్యా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయని పక్షంలో ప్రియాంక రాయ్‌బరేలీ నుంచి బరిలో ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సంజయ్‌సింగ్‌

ప్రత్యామ్యాయ అభ్యర్థిగా మాజీ రాజ్యసభ సభ్యుడు రాజా సంజయ్‌సింగ్‌కు కాంగ్రెస్‌ ఆఫర్‌ ఇవ్వవచ్చన్న చర్చ కూడా ఉన్నది. సంజయ్‌సింగ్‌ స్థానికంగా గట్టి బలం ఉన్న నాయకుడు.

ప్రస్తుతం బీజేపీలో ఉన్న సంజయ్‌సింగ్‌.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అమేథీ సదర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడితే సంక్షోభ సమయంలో పార్టీ గట్టెక్కేందుకు సంజయ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఆఫర్‌ ఇస్తుందన్న ప్రచారం నడుస్తున్నది.

దీపక్‌సింగ్‌

మాజీ ఎమ్మెల్సీ అయిన దీపక్‌సింగ్‌.. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడన్న పేరుంది. పైగా అమేథీలో యువత మద్దతు ఉన్న నాయకుడు. తానైతే రేసులో లేనని దీపక్‌ సింగ్‌ చెబుతున్నారు.

పై కోర్టులో రాహుల్‌గాంధీకి తప్పనిసరిగా ఊరట లభిస్తుందన్న నమ్మకంతో తామంతా ఉన్నామని, ఆయన మళ్లీ ఇక్కడ పోటీ చేస్తారని ఆయన అంటున్నారు. అమేథీలో ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త గాంధీ కుటుంబం తమ కుటుంబంగా భావిస్తారని ఆయన చెప్పారు. కనుక గాంధీ కుటుంబం నుంచే పోటీలో ఉంటారని ఆయన అన్నారు.

ఈసారి రాహుల్‌గాంధీ అమేథీ నుంచి పోటీ చేయగలిగితే.. భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. పైగా 2019లో రాహుల్‌ ఓడిపోవడంపై ప్రజల్లో సానుభూతి ఉన్నదని, ఇటీవల ఆయన నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర విజయవంతం కావడం కూడా రాహుల్‌ విజయం, మెజార్టీకి కారణమవుతాయని పలువురు నాయకులు అంటున్నారు.

వరుణ్‌గాంధీ

ఫిలిబిత్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ్‌గాంధీ పోటీ చేసే అవకాశాలపైనా స్థానికంగా చర్చ నడుస్తున్నది. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సమయంలో వరుణ్‌గాంధీ గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ప్రాచుర్యంలోకి వచ్చింది. కాంగ్రెస్‌తో తనకేమీ సమస్యలు లేవని వరుణ్‌ ఆ వీడియో క్లిప్‌లో చెప్పారు. తాను ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో వరుణ్‌గాంధీ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టులు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.

తన సొంత పార్టీ బీజేపీ వైఖరికి భిన్నంగా ఆ పోస్టులు ఉంటున్నాయి. అయితే.. అమేథీ గాంధీల అడ్డాగా పేరున్నా.. ఈసారి ఎన్నికల్లో తాము అమేథీ నుంచి అభ్యర్థిని నిలుపుతామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అమేథీలో అఖిలేశ్‌ నిలిపే అభ్యర్థి వరుణ్‌గాంధీయేనన్న వాదనలు వినిపించాయి.

వరుణ్‌గాంధీతో అఖిలేశ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దానికి తోడు బీజేపీ నాయకత్వం ఆయనను పక్కన పెడుతున్న పరిస్థితుల్లో ఎస్‌పీ-రాష్ట్రీయ లోక్‌దళ్‌ కూటమి వరుణ్‌కు టికెట్‌ ఇస్తుందని, దీనికి కాంగ్రెస్‌ మద్దతును కూడా తీసుకుంటుందని చర్చ జరుగుతున్నది.