B Form | BRS.. ప్రకటించిన అభ్యర్థులకే బీ ఫామ్‌ దక్కుతుందా? మార్పులుంటాయా?

B Form | తెలంగాణలో అధికారపార్టీ అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించినా క్యాడర్‌లో అయోమయం నెలకొన్నది. జాబితాపై కొన్ని నియోజకవర్గాల్లో నేతలు రెండుగా విడిపోవడమే దీనికి కారణం. సీఎం ప్రకటించిన అభ్యర్థులందరికీ బీ ఫామ్‌ దక్కుతుందా? లేదా చివరి నిమిషంలో మారుతుందా? అనే చర్చ జరుగుతున్నది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య లిస్ట్‌ మారుతుందని కేసీఆర్‌ చెప్పినట్టు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎమ్మెల్సీలు నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని అన్నారని చెప్పారు. ఇలా వివాదాస్పదమవుతున్న నియోజకవర్గాలన్నింటిలోనూ ఇదే […]

  • By: krs    latest    Sep 11, 2023 12:29 AM IST
B Form | BRS.. ప్రకటించిన అభ్యర్థులకే బీ ఫామ్‌ దక్కుతుందా? మార్పులుంటాయా?

B Form |

తెలంగాణలో అధికారపార్టీ అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించినా క్యాడర్‌లో అయోమయం నెలకొన్నది. జాబితాపై కొన్ని నియోజకవర్గాల్లో నేతలు రెండుగా విడిపోవడమే దీనికి కారణం. సీఎం ప్రకటించిన అభ్యర్థులందరికీ బీ ఫామ్‌ దక్కుతుందా? లేదా చివరి నిమిషంలో మారుతుందా? అనే చర్చ జరుగుతున్నది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య లిస్ట్‌ మారుతుందని కేసీఆర్‌ చెప్పినట్టు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎమ్మెల్సీలు నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని అన్నారని చెప్పారు.

ఇలా వివాదాస్పదమవుతున్న నియోజకవర్గాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. జాబితా ప్రకటించిన తర్వాత పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆ లోగా అసమ్మతి, అసంతృప్త నేతలను బుజ్జగించే బాధ్యతను పార్టీలోని కొందరు నేతలకు అప్పగించినా పరిస్థితిలో మార్పులేదు. దీంతో వివాదం ఉన్న నియోజకవర్గాల్లో నేతలు కలిసిపోయిన చోట్ల ఉదాహరణకు తాండూరు లాంటి వాటి చోట్ల మినహా మిగిలిన చోట్ల ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అసమ్మతిపై ఆచితూచి

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మెదక్‌ సీటు తన తనయుడికి ఇవ్వకపోతే కచ్చితంగా అక్కడ పోటీ చేస్తామని ధిక్కార స్వరం వినిపించారు. మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పెత్తనంపై మండిపడ్డారు. దీన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఖండించి పార్టీ గీత దాటితే ఎంతటివారిపైనా వేటు వేస్తామని హెచ్చరించారు. కానీ తొందరపడి అలాంటి చర్యలు తీసుకోవద్దని అనుకున్నట్టు ఉన్నారు.

దీనికి కారణం మొత్తం ప్రకటించిన 115 నియోజకవర్గాల్లో సగానిపైగా నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నదన్న వాదనలు ఉన్నాయి. అంతేకాదు మొత్తం క్యాబినెట్‌లోని మంత్రుల్లో సగానికి పైగా అంటే సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు తప్పా మిగిలిన వారంతా తీవ్రంగా శ్రమించాల్సి రావొచ్చని, అయినా ఓటమి తప్పకపోవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ముందుగా ప్రకటించిన జాబితాలోని కొందరు అభ్యర్థులను మార్చుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీ వర్గాలు మార్పులు అనివార్యమంటున్నాయి.

నాట్‌ నౌ నెవర్‌

పార్టీలో అవకాశాలు రాని అసమ్మతి నేతలు, అధిష్ఠానంపై తిరుబాటు చేస్తున్న వారికి పిలిచి మాట్లాడుతున్నా.. వారికి హామీ ఇస్తున్నా పట్టువీడటం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా పనిచేసే అవకాశం దక్కనివారికి ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేషన్‌ ఛైర్మన్‌ లాంటి ఇతర పదవులు వస్తాయని సీఎం చెప్పినా.. అసలు అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమౌతాయని ప్రశ్నిస్తున్నారట.

నాట్‌ నౌ నెవర్‌ అనే అభిప్రాయాన్ని ఆయా నియోజకవర్గాల్లో వారి అనుయాయులు చెబుతున్నారట. అందుకే కొందరు నేతలు ఎలాగైనా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారట. ఫలితాల అనంతరం గెలిస్తే అధిష్ఠానమే మద్దతు కోసం వస్తుందని, అప్పుడు ఎన్ని డిమాండ్లు పెట్టినా అంగీకరిస్తుందని.. 2014, 2018 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను వారు ఉదహరిస్తున్నారట.

అసమ్మతి నేతల అడుగులు ఎటు?

ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో వివాదం నెలకొన్న కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు ఆశావహులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి కేసీఆర్‌ లేదా, కేటీఆర్‌, కవిత, హరీశ్‌ అండదండలు ఉన్నాయట. జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం మద్దతు ఉంటే అదే స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి కేటీఆర్‌ అండ ఉన్నది. వీళ్లిద్దరిలో ఎవరికి ఇచ్చినా ఇంకొకరు వ్యతిరేకంగా పనిచేస్తారని భావిస్తున్నారు.

అలాగే రామగుండంలో జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, భూపాలపల్లిలో మధుసుదనా చారి, వరంగల్‌ తూర్పులో బస్వరాజు సారయ్య, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, ఆలేరులో భిక్షమయ్య గౌడ్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్య వంటి వారు ఏం చేస్తారన్నది చూడాలి. అలాగే ఖమ్మం జిల్లాలో మంత్రి వర్సెస్‌ అసమ్మతి నేతలు అన్నట్టు పరిస్థితి తయారైంది. వైరాలో తనను కాదని బానోతు మదన్‌లాల్‌కు టికెట్‌ ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రాములు నాయక్‌ మంత్రి పువ్వాడ అజేయ్‌పై మండిపడ్డారు.

గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి మంత్రి చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు మిగిసి ఫలితాలు వెలువడే వరకు తానే ఎమ్మెల్యేనన్న విషయాన్ని ఆయన గుర్తించుకోవాలి, తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తే టికెట్‌ రాని అసమ్మతి నేతల అడుగులు ఎటువైపు? పార్టీ అధిష్ఠానం ఇచ్చే హామీ మేరకు సంతృప్తి చెంది పనిచేస్తారా? పార్టీ మారుతారా? లేక పార్టీలోనే ఉండి వ్యతిరేకంగా పనిచేస్తారా? అన్న చర్చ ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్నది.