జపాన్‌లో పని ప్రారంభించిన అతి భారీ న్యూక్లియర్ రియాక్టర్
ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ జపాన్‌లోని ఇబారకీ ప్రిఫెక్చర్ లో ఏర్పాటు చేయగా.. ఈ నెల 1 ఒకటి నుంచి పని ప్రారంభించింది.

విధాత: ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ (Nuclear Reactor) జపాన్‌లో సిద్ధమైంది. ఇబారకీ ప్రిఫెక్చర్ అనే ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయగా.. ఈ నెల 1 ఒకటి నుంచి విజయవంతంగా పని చేస్తున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. యురోపియన్ యూనియన్ (EU) , జపాన్ (Japan) సంయుక్తంగా జేటీ-60ఎస్ఏ అనే ఈ రియాక్టర్‌ను తయారుచేశాయి.
ఎంతో ఆధునిక పరిజ్ఞానంతో రూపొందొంచిన ఈ ఫ్యూజన్ (Fusion) రియాక్టర్ భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీరుస్తుందని, గ్రీన్ ఎనర్జీలో కీలక పాత్ర పోషిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఏడు అంతస్తుల ఎత్తు ఉండే ఈ భారీ రియాక్టర్.. 200 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను వెలువరిస్తుంది. ఫ్యూజన్ (సంలీనం) ఆధారంగా పనిచేసే ఈ రియాక్టర్‌లో తేలికైన హైడ్రోజన్ అణువులు కలిసి భారమైన హీలియం ఏర్పడుతుంది.
ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే శక్తి నుంచే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. దీని నిర్మాణంలో 500 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, 70కి పైగా వివిధ సంస్థలు పాలుపంచుకున్నాయని జేటీ-60ఎస్ఏ ప్రాజెక్టు డిప్యూటీ హెడ్.. సాం డేవిస్ వివరించారు. అణు విచ్ఛిత్తి ప్రక్రియతో పోలిస్తే.. కాస్త సురక్షితంగా భావించే అణు సంలీన ప్రక్రియ ద్వారా విద్యుదుత్పత్తి చేయాలని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఏదో ఒక ప్రత్యామ్నాయం ఆలోచించకపోతే ఈ శతాబ్దం నాటికి డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండదని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు యూరప్‌లోనూ ఒక ఫ్యూజన్ రియాక్టర్ నిర్మాణంలో ఉంది. జేటీ-60ఎస్ఏకు సోదరుడిలా భావించే ఈ రియాక్టర్‌ను ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) అని పిలుస్తున్నారు. ఇదే ముందు కార్యకలాపాలు మొదలు పెట్టాల్సి ఉన్నప్పటికీ.. శాస్త్రవేత్తలు డెడ్‌లైన్‌ను అందుకోలేకపోయారు. ఇది కూడా ఫ్యూజన్ ప్రక్రియ ద్వారానే శక్తిని ఉత్పత్తి చేస్తుంది.