Yamuna River | మళ్లీ ఉప్పొంగుతున్న యమున.. ప్రమాదం అంచులో ఢిల్లీ
Yamuna River విధాత: యమునానది మరోసారి ఉప్పొంగుతున్నది. డేంజర్ మార్క్ దాటి పరవళ్లు తొక్కుతున్నది. దీంతో దేశ రాజధాని నగరం మళ్లీ ప్రమాదంపుటంచున నిలబడింది. మొన్నటి వరద బీభత్సం నుంచి ఇప్పుడి ప్పుడే కోలుకుంటున్న ఢిల్లీ.. మళ్లీ నీట మునక బారిన పడనున్నదన్న ఆందోళనలు తలెత్తుతున్నాయి. గత వరద ప్రభావానికి గురైన బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు జోరుగా సాగుతున్న సమయంలో వాటికీ అడ్డంకులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, […]

Yamuna River
విధాత: యమునానది మరోసారి ఉప్పొంగుతున్నది. డేంజర్ మార్క్ దాటి పరవళ్లు తొక్కుతున్నది. దీంతో దేశ రాజధాని నగరం మళ్లీ ప్రమాదంపుటంచున నిలబడింది. మొన్నటి వరద బీభత్సం నుంచి ఇప్పుడి ప్పుడే కోలుకుంటున్న ఢిల్లీ.. మళ్లీ నీట మునక బారిన పడనున్నదన్న ఆందోళనలు తలెత్తుతున్నాయి. గత వరద ప్రభావానికి గురైన బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు జోరుగా సాగుతున్న సమయంలో వాటికీ అడ్డంకులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, హత్నికుండ్ బరాజ్ నుంచి నీటి విడుదల పెరగడంతో యుమునా నది మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. హత్నికుండ్ బరాజ్ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో ఢిల్లీ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదే నెల 13వ తేదీన చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో 208.66 మీటర్ల ఎత్తున యమున ప్రవహించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గరిష్ఠస్థాయి 205.33 మీటర్లు. అయితే.. ఆదివారం ఉదయం 9 గంటల సమయానికికే యమున నీటి మట్టం 205.96 మీటర్లుగా ఉన్నదని కేంద్ర జలసంఘం బులెటిన్ పేర్కొన్నది. సాయంత్రం 4 గంటల సమయానికి 206.7 మీటర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
కొనసాగుతున్న భారీ వర్షాలు
మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంఖండ్‌లలో మంగళవారం వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ విభాగం వెల్లడించడం మరింత ఆందోళనకు గురి చేస్తున్నది. యుమునా నదిలోకి విడుదల చేస్తున్న నీటితో ఢిల్లీకి మరోసారి వరద ముంపు తప్పదని డ్యాం నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సత్వరమే తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని, గండి పడేందుకు అవకాశం ఉన్న చెరువులు, కుంటల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు.
1978లో ఇంతటి వరద..
ఇటీవల వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువన కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గత కొద్దిరోజులుగా నీటి మట్టం అస్థిరంగా కొనసాగుతూ వచ్చింది. వరద తగ్గినా, ఢిల్లీలోని అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జూలై నెల మొత్తం కురవాల్సిన 125 శాతం వర్షపాతం జూలై 8, 9 తేదీల్లోనే కురవడం వరదలకు కారణమైంది. గతంలో 1978 సెప్టెంబర్‌లో యుమునా నది 207.49 మీటర్ల మట్టంతో ప్రవహించింది. మళ్లీ ఇప్పుడు ఆనాటి పరిస్థితులు నెలకొన్నాయి.