Yuva Vikasam: తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం ‘రాజీవ్ యువ వికాసం’.. నియోజకవర్గానికి 2 నుంచి 3వేల మంది
రాజీవ్ యువ వికాసం కింద స్వయం ఉపాధి కోసం 6వేల కోట్ల ఆర్థిక లబ్థి చేకూరనుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 2నుంచి 3వేల మంది చొప్పున 5లక్షల మంది లబ్ధిదారులను జూన్ 2 నాడు ప్రకటిస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం' పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

CM Revanth Reddy: తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరడంలో రాజీవ్ యువ వికాసం పథకం సాధనంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజీవ్ యువ వికాసం కింద స్వయం ఉపాధి కోసం 6వేల కోట్ల ఆర్థిక లబ్థి చేకూరనుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 2నుంచి 3వేల మంది చొప్పున 5లక్షల మంది లబ్ధిదారులను జూన్ 2నాడు ప్రకటిస్తామన్నారు. తమ ప్రజాప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కోటిగా అమలు చేస్తూ..15నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో మొదటి 10నెలల్లోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించిందన్నారు.
25లక్షల35వేల మంది రైతులకు 20,617కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. 150కోట్ల ఉచిత బస్ ట్రిప్పులను 5,005కోట్ల రూపాయలు ఖర్చు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం అందించామన్నారు. 200యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తూ 50లక్షల కుటుంబాలలో వెలుగునిస్తున్నామన్నారు. 43లక్షల కుటుంబాలకు రూ.500గ్యాస్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. 65లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏడాదికి నాణ్యమైన రెండు చీరలు 1కోటి 30లక్షలు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. 29,500 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంటు అందిస్తు, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించామన్నారు.
కులగణన పూర్తి చేసి శాసన సభలో బిల్లును పెట్టామన్నారు. 56.36శాతం బీసీల లెక్క తేలగా 42శాతం బీసీ రిజర్వేషన్లు అందించబోతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా పెట్టుకున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ, టూరిజం, ఎండోమెంట్, ఇండిస్ట్రీస్ పాలసీ వంటి అన్ని రంగాల్లో నూతన పాలసీలు తెచ్చి పరిపాలన ప్రక్షాళన చేసి పారదర్శక పాలన తెస్తున్నామన్నారు. ఇవన్ని తొలి అడుగు మాత్రమేనన్నారు.
ఆర్థిక పరిస్థితిపై ఫోకస్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వేసిన అంచనాలొకటైతే ఉన్న అప్పులు, ఆదాయం మరొకటిగా ఉందని..దీంతో అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపకూడదని నిర్ణయించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దుబారా తగ్గించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. ఇసుక పై రోజుకో కోటిన్నర ఆదాయం వచ్చేదని.. దీనిపై దృష్టి పెడితే మూడున్నర కోట్లకు పెరిగి 600నుంచి 1200కోట్లకు పెరిగిందన్నారు.
దేశంలోనే తెలంగాణ మేటి
కేంద్ర ప్రభుత్వ లెక్కల మేరకు జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని, రాష్ట్ర పరిధిలోని పన్నుల వసూళ్లో 88శాతం పన్నుల వసూళ్లతో అగ్రగామిగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదాయం పన్నుల వసూలు లోనూ మొదటి స్థానంలో ఉన్నామని, ధరల నియంత్రణలోనూ నెంబర్ వన్ గా ఉన్నామని, నిరుద్యోగ రేటు 8.8శాతం నుంచి 6.1కు తగ్గించామన్నారు. ఇంత చేసిన మీడియా వారు మీకు ఇంకా పాలనపై పట్టు వచ్చినట్లు లేదంటున్నారని.. అందరిని కూడగట్టే ప్రయత్నం చేస్తుండటంతో కొంత ఆలస్యమవుతుందన్నారు. 22వేల టీచర్లకు పదోన్నతులు, 36వేల మంది టీచర్ల బదిలీలు, 58వేల వరకు ఉద్యోగాల భర్తీలను చిన్న ఆరోపణలు లేకుండా చేశామని ఇది మా ప్రభుత్వ ఘనతగా గుర్తించాలన్నారు.
ఆదర్శవంతమైన పాలన అందించేందుకు అధికారులు ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలన్నారు. యువ వికాసం ప్రజల పథకమని..పార్టీ పథకం కాదన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా, ఐటీఐల ద్వారా వృత్తి శిక్షణ అందిస్తున్నామన్నారు. శిక్షణ పొందిన వారికి ఉద్యోగం రాకపోతే రాజీవ్ యువ వికాసం కింద స్వయం ఉపాధి పథకం అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి పథకాలలో మైనార్టీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. మండలాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి యువ వికాసం కింద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన పథకాలు అమలు చేసేలా ఎమ్మెల్యేలు ప్రయత్నించాలన్నారు.
గత 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో యువతను పట్టించుకోలేదని, దీంతో యువత డ్రగ్స్ కు బానిసగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ వినియోగంలో తెలంగాణ పంజాబ్ వైపు వేగంగా ప్రయాణం చేస్తోందన్నారు. యువత సింథటిక్ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారన్నారు. గంజాయి, కొకైన్ వాడకం పెరిగిందన్నారు. యువత పక్కదారి పట్టకుండా వారికి స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చామన్నారు.సింథటిక్ డ్రగ్స్, గంజాయి వంటి వాటికి దూరంగా యువత స్వయం ఉపాధి పథకాల వైపు మళ్లాలన్నారు. తెలంగాణ రైజింగ్ లో భాగస్వామం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.