YouTube Create | మీరు యూట్యూబరా..? ఇక వీడియో ఎడిటింగ్‌ కష్టాలకు చెప్పండి గుడ్‌బై.. మీ కోసమే ‘యూట్యూబ్‌ క్రియేట్‌’ యాప్‌..!

YouTube Create | మీరు యూట్యూబరా..? ఇక వీడియో ఎడిటింగ్‌ కష్టాలకు చెప్పండి గుడ్‌బై.. మీ కోసమే ‘యూట్యూబ్‌ క్రియేట్‌’ యాప్‌..!

YouTube Create | యూట్యూబర్లకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ట్యూబ్‌ ఛానెల్‌ ఉండి.. ఎడిటింగ్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం సరికొత్తగా వీడియో ఎడిటింగ్‌ యాప్‌ను తీసుకువచ్చింది. ‘యూట్యూబ్‌ క్రియేట్‌’ యాప్‌ తీసుకొని కంపెనీ.. భారత్‌, యూకే, ఫ్రాన్స్​, ఇండోనేషియా, కొరియా, సింగపూర్​లో ఏఐ ఆధారిత యాప్‌కు సంబంధించిన ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ను రిలీజ్‌ చేసింది. వచ్చే ఏడాది ఐఓఎస్‌లో అందుబాటులోకి రానున్నది.

అలాగే, త్వరలోనే మిగతా దేశాల్లోనూ లాంచ్‌ చేయనున్నది. గత గురువారం జరిగిన ‘మేడ్​ ఆన్​ యూట్యూబ్’ కార్యక్రమంలో యూట్యూబ్‌ ‘క్రియేట్‌’ యాప్‌ను లాంచ్‌ చేసింది. అయితే, ఎవరైనా సరే వీడియో తేలిగ్గా వీడియో ఎడిటింగ్‌ చేసుకునేలా ఉండాలనే ఉద్దేశంతో యాప్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది.

‘వీడియోల తయారు చేయడం వెనుక ఉండే కష్టం గురించి మాకు తెలుసు. ముఖ్యంగా కంటెంట్​ క్రియేషన్​ జర్నీని కొత్తగా ప్రారంభిస్తున్న వారికి మరీ కష్టంగా ఉంటుంది. ఎడిటింగ్‌ ప్రక్రియను సులభతరం చేసేందుకు యూట్యూబ్‌ క్రియేట్‌ యాప్‌ను తీసుకువచ్చాం’ అని గూగుల్‌ కంపెనీ ప్రకటించింది.

ఇది ఓ మొబైల్‌ యాప్‌ అని, ఉచితంగానే షార్ట్స్‌, లాంగ్‌ ఫార్మాట్‌లో ఉన్న వీడియోలను ఎడిట్‌ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే యాప్‌నకు ఏఐ టెక్నాలజీని జోడించినట్లు యూట్యూబ్‌ తెలిపింది. ఎడిటింగ్‌, ట్రిమ్మింగ్‌, ఆటోమెటిక్​ కాప్షనింగ్​, వాయిస్​ఓవర్​, ట్రాన్సీషన్స్​ ఏఐ ఆధారంగా చేయచ్చునని, బీట్​ మ్యాచింగ్​ టెక్నాలజీతో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్​ని సైతం క్రియేట్‌ యాప్‌లో పొందవచ్చని వెల్లడించింది.

దాదాపు 3వేల మందికిపైగా యూట్యూబ్‌ క్రియేటర్లను సంప్రదించి, వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న తర్వాత క్రియేట్‌ యాప్‌ను రూపొందించినట్లు యూట్యూబ్‌ పేర్కొంది. అయితే, రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తామని చెప్పింది.

ఏఐని వినియోగించి కొత్త ఫీచర్‌పై ట్రయల్‌ నిర్వహిస్తున్నామని, డ్రీమ్​ స్క్రీన్​ ఫీచర్​ అందుబాటులోకి వస్తే.. మనం ఏది టైప్​ చేస్తే.. అది మన వీడియో బ్యాక్​గ్రౌండ్​లోకి వచ్చేస్తుందని కంపెనీ వివరించింది. కొంతమంది క్రియేటర్లకు ఈ డ్రీమ్​ స్క్రీన్​ ఫీచర్​ ట్రయల్స్‌ కోసం ఇస్తామని.. ఆ తర్వాత అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించింది.