ఏపీలో పొత్తులకు కాంగ్రెస్, వామపక్షాలు సై
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య పొత్తుల చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని, బీజేపీని కూడా కలుపుకుని పోవాలని నిర్ణయించాయి.

- కలిసి పోటీ..పోరాటాలు చేస్తామన్న వైఎస్ షర్మిల
విధాత : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య పొత్తుల చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని, బీజేపీని కూడా కలుపుకుని పోవాలని నిర్ణయించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం వామపక్షాలతో పొత్తులపై కీలక అడుగు వేసింది. శుక్రవారం కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల నేతలు చర్చించారు.
ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ కార్యాలయంలో పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల, సీపీఎం నేతలు ఎంఏ గఫూర్, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్ రావులు, సీపీఐ నుంచి రామకృష్ణ,నాగేశ్వర రావు, ఆకినేని వనజ, జల్లి విల్సన్‌లు సమావేశమై పొత్తులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి వైసీపీ, టీడీపీలు బీటీమ్‌లుగా ఉన్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సీపీఎం, సీపీఐతో కలిసి కాంగ్రెస్ పని చేస్తుందని స్పష్టం చేశారు. నేటి నుంచి ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పని చేస్తామన్నారు. బీజేపీ, వైసీపీని దెబ్బ కొట్టేలా పని చేస్తామన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈనెల 26న ఏపీకి వస్తున్నారని బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.
కాగా.. ఆరోజు కూడా వామపక్ష పార్టీలు నేతలతో మరోసారి భేటీ అవుతామన్నారు. భవిష్యత్తులో తప్పకుండా కలిసి పని చేస్తామని, కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో అతిపెద్ద అవినీతి పార్టీలుగా ఉన్న బీజేపీ, వైసీపీ, టీడీపీలను తరిమి కొట్టాలంటే కాంగ్రెస్, వామపక్షాలు కలిసి నడవాల్సిన అవసరముందన్నారు. ఏపీకి రాజధాని కూడా లేకుండా అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఓడించాలన్నారు. ఏపీకి కాంగ్రెస్ వల్లే న్యాయం జరుగుతుందని, ప్రజలకు మంచి జరుగుతుందని ఏపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.