sleep divorce : ఆలుమ‌గ‌ల మ‌ధ్య స్లీప్ డివోర్స్? ఇదేంటిది.. కొత్త‌గా!

జీవిత భాగ‌స్వామితో ప‌డ‌క పంచుకుంటే ల‌వ్ హార్మోన్‌గా చెప్పే ఆక్సిటోసిన్ విడుద‌ల చేస్తుంద‌ని, అది డిప్రెష‌న్‌ను త‌గ్గించ‌డంతోపాటు యాంగ్జియిటీని, స్ట్రెస్‌ను దూరం చేస్తుంద‌ని అంటున్నారు. వాటి ఫ‌లితంగా జీవితం, స‌న్నిహిత సంబంధాలు సంతృప్తిక‌రంగా ఉంటాయ‌ని పేర్కొంటున్నారు.

sleep divorce : ఆలుమ‌గ‌ల మ‌ధ్య స్లీప్ డివోర్స్? ఇదేంటిది.. కొత్త‌గా!

Sleep Divorce: ఆలుమ‌గ‌ల అనుబంధం గ‌ట్టిగా ఉండాలంటే.. అన్యోత‌తోపాటు.. ప‌డ‌క పంచుకోవ‌డం కూడా ఒక‌టిగా చెబుతుంటారు. కానీ.. ఇప్పుడు మారుతున్న సామాజిక సంబంధాలు, విలువ‌లు, అవ‌స‌రాల నేప‌థ్యంలో కొత్త కొత్త ధోర‌ణులు పుట్టుకొస్తున్నాయి. అలా వ‌చ్చిందే స్లీప్ డివోర్స్‌! అంటే.. భార్యాభ‌ర్త‌లు ప‌గ‌లంతా క‌లిసే ఉంటారు కానీ.. రాత్రిపూట నిద్ర‌పోయేట‌ప్పుడు మాత్రం ఎవ‌రి బెడ్‌పై వారు ప‌డుకుంటార‌న్న‌మాట‌! ఒక‌ప్ప‌టి లాంటి రోజులు కావివి. చాలా ఫ్యామిలీస్‌లో భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ జాబ్ చేస్తున్నారు. దీంతో ప‌గ‌లంతా ఆఫీసు ప‌ని, ఇంటికి వ‌చ్చాక వంట‌ప‌ని.. ఇలా అలిసిపోయిన త‌ర్వాత ప‌డ‌క కుద‌ర‌క నిద్ర‌ప‌ట్ట‌క ఇబ్బంది ప‌డుతున్న క‌పుల్స్ ఈ స్లీప్ డివోర్స్‌ను పాటిస్తున్నార‌ట‌. స్ట్రెస్‌, యాంగ్జైటీ నుంచి దూరంగా ఉండేందుకే ఈ ప‌ద్ధ‌తిని పాటిస్తున్నామ‌ని వారు చెబుతున్నారు. త‌గినంత నిద్ర‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని స‌ర్వే తెలిపింది. ప్ర‌శాంతంగా నిద్ర‌పోవ‌డం అనేది పెద్ద ఇబ్బందిగా త‌యారైంద‌ని ప్ర‌పంచ‌స్థాయి స్లీప్ స్ట‌డీ ఒక‌టి పేర్కొన్న‌ది. భార‌త‌దేశంలో కూడా ఇటువంటివారు 78 శాతం వ‌ర‌కూ ఉన్నార‌ని స‌ర్వే వెల్ల‌డించింది. అంతేకాదు.. ప్ర‌పంచంలోనే ఇలా స్లీప్ డివోర్స్ పాటిస్తున్న‌ది మ‌న ద‌గ్గ‌రే ఎక్కువ‌ని తేలింది. రెస్‌మెడ్స్ గ్లోబల్ స్లీప్ స‌ర్వేలో భార‌త్ త‌దుప‌రి స్థానంలో చైనా (67%), ద‌క్షిణ కొరియా (65%)తో రెండు, మూడో స్థానాలు ఆక్ర‌మించాయి. 13 ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో 30వేల‌కు మందికిపైగా స‌ర్వే చేసి ఈ గ‌ణాంకాలు రూపొందించారు. అమెరికా, బ్రిట‌న్‌లో స‌గం మంది భార్యాభ‌ర్త‌లు క‌లిసే ప‌డుకుంటామ‌ని చెప్ప‌గా.. మ‌రో 50 శాతం మంది అప్పుడ‌ప్పుడు వేర్వేరుగా పడుకుంటామ‌ని చెప్పారు.

సరైన నిద్రతోనే హ్యాపీ

ఇది విచిత్రంగా క‌నిపించినా.. చాలా మంది త‌గినంత స‌రైన నిద్ర‌తోనే ఆరోగ్యం, సంబంధాలు మెరుగ్గా ఉంటాయ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇందులోనూ మ‌హిళ‌లు స్లీప్ డివోర్స్‌ను ఎక్కువ‌గా కోరుకుంటున్నార‌ట‌. త‌మ భ‌ర్త‌లు నిద్ర‌లో పెట్టే గుర‌క, బ‌లంగా శ్వాస తీసుకోవ‌డం, ఊపిరి తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డ‌టం సంద‌ర్భంగా వ‌చ్చే సౌండ్ త‌ట్టుకోలేక అని 32 శాతం మంది చెప్ప‌గా.. అల‌స‌ట వ‌ల్ల అని 12 శాతం, స్లీప్ షెడ్యూల్ వేర్వేరుగా ఉండ‌టం వ‌ల్ల అని 10 శాతం మంది తెలిపారు. ఓ ఎనిమిది శాతం మంది అయితే.. బెడ్‌పై ప‌డుకుని కూడా మొబైల్ ఫోన్ చూస్తూ ఉండ‌టంతో చికాకెత్తి వేరే బెడ్‌పై ప‌డుకుంటున్నార‌ట‌. ఇలా వేర్వేరు బెడ్‌ల‌పై నిద్రిస్తున్న‌వారిలో ఎక్కువ మంది వృద్ధ దంప‌తులు ఉన్నారు. విడి విడిగా ప‌డుకుంటే త‌గినం నిద్ర పోయే అవ‌కాశం వ‌స్తున్న‌ద‌ని, ఇది త‌మ బంధాన్ని బ‌లోపేతం చేస్తున్న‌ద‌ని, త‌మ శృంగార జీవితం కూడా బాగుంద‌ని కొంద‌రు చెప్ప‌డం విశేషం.

నిపుణులేమంటున్నారు?

అయితే.. నిపుణులు మాత్రం భార్యాభ‌ర్త‌లు ఒక బెడ్‌పై నిద్రిస్తే దాని లాభాలు దానికి ఉంటాయ‌ని చెబుతున్నారు. జీవిత భాగ‌స్వామితో ప‌డ‌క పంచుకుంటే ల‌వ్ హార్మోన్‌గా చెప్పే ఆక్సిటోసిన్ విడుద‌ల చేస్తుంద‌ని, అది డిప్రెష‌న్‌ను త‌గ్గించ‌డంతోపాటు యాంగ్జియిటీని, స్ట్రెస్‌ను దూరం చేస్తుంద‌ని అంటున్నారు. వాటి ఫ‌లితంగా జీవితం, స‌న్నిహిత సంబంధాలు సంతృప్తిక‌రంగా ఉంటాయ‌ని పేర్కొంటున్నారు. నిద్రపై ఇటీవ‌ల నిర్వ‌హించిన ఒక అధ్య‌య‌నంలో ఒకే ప‌డ‌క‌పై నిద్రించే భార్యాభ‌ర్త‌లకు ఎమోష‌న‌ల్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయ‌ని వెల్ల‌డైంది. ఫ్రాంటియ‌ర్స్ ఇన్ సైకియాట్రి అనే మ‌రో అధ్య‌య‌నంలో ఒకే బెడ్‌పై నిద్రించే భార్యాభ‌ర్త‌ల్లో ర్యాపిడ్ ఐ మూమెంట్ (ఆర్ ఈ ఎం) నిద్ర ప‌దిశాతం ఎక్కువ‌గా ఉంటుంద‌ని తేలింది. క‌లిసి నిద్రించే భార్య‌భ‌ర్త‌ల‌ను అభిప్రాయాల‌ను కోర‌గా.. ప్రేమ (53%), సౌఖ్యం (47%), విశ్రాంతి (41%), సంతోషం (27%) ప్ర‌శాంత‌త (21%) త‌మ టాప్ ఎమోష‌న్స్‌గా చెప్పారు. ఏది ఏమైనా క‌ల‌సి ఉంటేనే క‌ల‌దు సుఖం అని మ‌నవాళ్లు ఎప్పుడో చెప్పారు. కొంత అడ్జెస్ట్ అయితే.. జీవిత‌మే స‌ఫ‌ల‌ము.. రాగ సుధా భ‌రిత‌ము.. ప్రేమ కధా మధురము.. అని ఎంచ‌క్కా పాడుకోవ‌చ్చు!