America Birth Tourism | అమెరికాలో బర్త్‌ టూరిజంపై బ్యాన్‌! గర్భిణులకు నో వీసా!

మనకు అమెరికా పౌరసత్వం లేకపోయినా.. మన బిడ్డ అమెరికాలో జన్మిస్తే ఆటోమేటిక్‌గా ఆ దేశ పౌరసత్వం వచ్చేస్తుంది. ఇది ఇప్పటిదాకా నడిచింది. కానీ.. ఈ విధానాన్ని అడ్డుకోవాలని అమెరికా నిర్ణయించింది. అమెరికాలో డెలివరీల కోసం వచ్చే గర్భిణుల వీసాలను తిరస్కరించాలని తన కాన్సులేట్‌ జనరల్స్‌ను ఆదేశించింది.

  • By: TAAZ |    lifestyle |    Published on : Dec 13, 2025 8:40 PM IST
America Birth Tourism | అమెరికాలో బర్త్‌ టూరిజంపై బ్యాన్‌! గర్భిణులకు నో వీసా!

America Birth Tourism | అమెరికా ప్రభుత్వం కొద్ది నెలలుగా భారత్ వీసాలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే హెచ్1బీ వీసాల జారీ నిబంధనలు కఠినతరం చేసిన అమెరికా.. బర్త్ టూరిజంపై కన్నేసింది. బీ-1, బీ-2 వీసాల కోసం వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఈ వీసాల కింద భారతీయ మహిళలు, ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రం నుంచి గర్భిణులు వస్తున్నారని గుర్తించారు. అమెరికాలో కాన్పు చేసుకుని, పుట్టిన బిడ్డకోసం యూఎస్ సిటిజన్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నందున ప్రతి దరఖాస్తును పరిశీలించాలని యూఎస్ ఎంబసీ దేశంలోని అన్ని కాన్సుల్ జనరల్స్‌ను ఆదేశించింది. అమెరికాలో జన్మనిచ్చేందుకే గర్భంతో వచ్చే మహిళల వీసా దరఖాస్తులను తిరస్కరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని పేర్కొంది.

బీ-1, బీ-2 వీసాల విధానాన్ని గుజరాత్ తో పాటు ఏపీ, తెలంగాణ మహిళలు ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారత్‌లో గర్భం దాల్చి అక్కడికి వెళ్లి జన్మనివ్వడం మూలంగా ప్రభుత్వంపై మోయలేని విధంగా భారం పడుతోందనే అభిప్రాయంతో అమెరికా ఉంది. ఇలాంటి వారు తమ దేశ ప్రజల పన్నులు సునాయసంగా వినియోగించుకుంటున్నారనేది అమెరికా ప్రభుత్వం వాదన. డిసెంబర్ 15వ తేదీ నుంచి హెచ్1బీ తో పాటు హెచ్-4 డిపెండెంట్ వీసాల తనిఖీ ని ప్రారంభించనున్నట్లు స్టేట్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే ప్రకటించింది. వెట్టింగ్ లో భాగంగా ఆన్ లైన్ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించనున్నారు.

నూతన విధానంతో హెచ్1బీ తో పాటు హెచ్-4 డిపెండెంట్ వీసాదారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటి వరకు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇష్టానుసారంగా ఆ దేశ ప్రభుత్వంతో పాటు ఇండియాలో తమకు నచ్చని వారిపై కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే తమకు ఏమీ కాదనే విధంగా జుగుప్పాకరమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారందరూ మున్ముందు అమెరికాలో కష్టాలను ఎదుర్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. భారత్ లో హెచ్1బీ తో పాటు హెచ్-4 డిపెండెంట్ వీసాల జారీ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఏడాది మధ్యలో కాన్సుల్ జనరల్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చే సూచనలు ఉన్నాయి. త్వరలోనే దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ అప్పాయింట్ మెంట్లు రీ షెడ్యూలు చేస్తున్నట్లు ఈ మెయిల్ పంపించనున్నారు.

Read Also |

విశాఖ టు గరివిడి.. చీపురుపల్లిలో బొత్స అనూష పొలిటికల్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Krithi Shetty | క్లాసిక్ లుక్‌లో కాకరేపుతున్న కృతి శెట్టి
Nidhhi Agerwal | అందాలతో ఆగం చేస్తున్న నిధి అగర్వాల్