Bigg Boss | ‘బిగ్‌బాస్’ ట్రోఫీ గెలిచినా ఇంకా అంద‌ని ప్రైజ్‌మనీ.. విజేత ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్

Bigg Boss | దేశవ్యాప్తంగా భారీ ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’లో విజేతగా నిలిచిన గౌరవ్ ఖన్నా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షో ముగిసి మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు తనకు ప్రైజ్‌మనీ అందలేదని వెల్లడించారు.

  • By: Sandeep |    movies |    Published on : Mar 12, 2026 11:25 AM IST
Bigg Boss | ‘బిగ్‌బాస్’ ట్రోఫీ గెలిచినా ఇంకా అంద‌ని ప్రైజ్‌మనీ.. విజేత ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్

Bigg Boss | దేశవ్యాప్తంగా భారీ ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’లో విజేతగా నిలిచిన గౌరవ్ ఖన్నా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షో ముగిసి మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు తనకు ప్రైజ్‌మనీ అందలేదని వెల్లడించారు. అయితే చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నందున త్వరలోనే తనకు రావాల్సిన మొత్తం అందుతుందని చెప్పారు.

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్‌బాస్’ ఒకటి. విభిన్న స్వభావాలు కలిగిన వ్యక్తులను ఒకే ఇంట్లో ఉంచి దాదాపు 100 రోజులకుపైగా వివిధ టాస్కులు, చర్చలు, సవాళ్లతో ముందుకు తీసుకెళ్లే ఈ షో ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందింది. మొదట హిందీలో ప్రారంభమైన ఈ షో తర్వాత ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం అవుతూ భారీ టీఆర్పీలను అందుకుంటోంది.

హిందీ ‘బిగ్‌బాస్’కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేయడం షోకు మరింత ప్రత్యేక ఆకర్షణగా మారింది. తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సల్మాన్ ఖాన్ ఈ షోకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. గత ఏడాది ప్రారంభమైన హిందీ ‘బిగ్‌బాస్’ సీజన్ 19 కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ముగిసింది. ఆగస్టు నెలలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో డిసెంబర్ 7న గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. మొత్తం 18 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్‌లో పాల్గొన్నారు.

దాదాపు 106 రోజుల పాటు సాగిన ఈ పోటీలో టెలివిజన్ నటుడు గౌరవ్ ఖన్నా విజేతగా నిలిచారు. ఫర్హానా మొదటి రన్నరప్‌గా, ప్రణీత్ రెండో రన్నరప్‌గా నిలిచారు. తాన్యా మూడో రన్నరప్ కాగా, అమాల్ నాలుగో రన్నరప్‌గా నిలిచారు. ఈ సీజన్ మొత్తం వివాదాలు, చర్చలు, ఆసక్తికర టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గౌరవ్ ఖన్నాకు ఇప్పటికే టెలివిజన్ సీరియళ్ల ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ‘అనుపమ’ మరియు ‘సీఐడీ’ వంటి సీరియళ్ల ద్వారా ఆయన ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అంతేకాకుండా గతంలో ఒక ప్రముఖ కుకింగ్ రియాలిటీ షోలో కూడా విజేతగా నిలిచి తన ప్రతిభను నిరూపించారు.

‘బిగ్‌బాస్’లో పాల్గొన్నందుకు గౌరవ్ ఖన్నాకు వారానికి సుమారు 17.5 లక్షల రూపాయల పారితోషికం లభించింది. మొత్తం 15 వారాలకు గాను ఆయన దాదాపు 2.62 కోట్ల రూపాయలు సంపాదించారు. విజేతగా నిలిచినందుకు అదనంగా 50 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ కూడా ప్రకటించారు. దీంతో మొత్తం ఆయనకు 3.12 కోట్ల రూపాయలు లభించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా గౌరవ్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. షో ముగిసి మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు తనకు ప్రైజ్‌మనీ అందలేదని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.

షోలో ప్రకటించిన ప్రైజ్‌మనీ, కారుతో పాటు ఇతర బహుమతులు అందుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇలాంటి ఆలస్యం సాధారణమేనని, తాను గెలుచుకున్న మొత్తం ఖచ్చితంగా అందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇంకా ఒకటి లేదా రెండు నెలల్లో తనకు రావాల్సిన మొత్తం అందుతుందని గౌరవ్ ఖన్నా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు మరియు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది సాధారణ ప్రక్రియ అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు త్వరగా ప్రైజ్‌మనీ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.